స్వెరోస్ చిచ్చు.. ఐపీఎస్‌పై రచ్చ.. మౌనమేల కేసీఆర్?
posted on Mar 24, 2021 @ 6:49PM
స్వెరోస్. కొంతకాలంగా మారుమోగుతున్న పేరు. స్వెరోస్ వర్సెస్ బీజేపీ. స్వెరోస్ వర్సెస్ హిందుత్వ సంస్థలు. స్వెరోస్ వర్సెస్ దళిత సేన. ఇలా స్వెరోస్ కాంట్రవర్సీకి కేరాఫ్‌గా మారింది. స్వెరోస్ సమావేశంలో హిందూ దేవుళ్లను పూజించనంటూ ఐపీఎస్ ప్రవీణ్ కుమార్ చేసిన ప్రతిజ్ఞతో వివాదం రాజుకుంది. మా దేవుళ్లను, మా మతాన్ని అవమానిస్తారా అంటూ కమలనాథులు స్వెరోస్‌పై కస్సుమన్నారు. బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కౌంటర్‌గా కోదాడలో బండి సంజయ్‌పై దాడికి యత్నించారు స్వెరోస్ సభ్యులు. దీంతో.. వివాదం మరింత ముదిరింది. ఓవైపు ఐపీఎస్ ప్రవీణ్ కుమార్‌కు మద్దతుగా స్వెరోస్ ర్యాలీలు తీస్తుంటే.. మరోవైపు స్వెరోస్‌కు వ్యతిరేకంగా హిందుత్వ సంస్థలు నిరసన కార్యక్రమాలు చేస్తున్నాయి. తాజాగా, ప్రవీణ్‌పై ఆరోపణలు చేసిన దళిత సేన నేత హమారా ప్రసాద్‌పైనా దాడి చేశారు స్వెరోస్ సభ్యులు.
స్వెరోస్ కేంద్రంగా ఇంత రచ్చ జరుగుతున్నా ఇప్పటి వరకూ సర్కారు నుంచి ఎలాంటి స్పందన లేదు. అటు, ఐపీఎస్ ప్రవీణ్ కుమార్ సైతం ఈ దాడులను ఖండించడం లేదు. ఐపీఎస్‌గా ఉన్న వ్యక్తి.. తన కనుసన్నల్లో నడుస్తున్న స్వెరోస్ సభ్యులు ఇలాంటి దాడులకు తెగబడుతున్నా అడ్డుకునే ప్రయత్నం కానీ, వారిని అదుపు చేసే చర్యలు కానీ చేయక పోవడం అనుమానాస్పదంగా మారింది. అంటే, ప్రవీణ్ కుమార్ ఈ దాడులను ప్రోత్సహిస్తున్నారా? అనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు కొందరు.
ఐపీఎస్ ప్రవీణ్ కుమార్. పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో ఒకప్పుడు డైనమిక్ ఆఫీసర్. సడెన్‌గా ఖాకీ యూనిఫాం నుంచి ఫార్మల్ డ్రెస్‌లోకి మారిపోయారు. పోలీస్ శాఖ నుంచి డిప్యూటేషన్‌పై గురుకులాల అధికారిగా చేరిపోయారు. తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాసంస్థల కార్యదర్శి తొమ్మిదేళ్లుగా అక్కడే పని చేస్తున్నారు ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్. పూర్వ విద్యార్థుల సంఘమంటూ ఆయన ఏర్పాటు చేసిన స్వెరోస్.. గురుకులాలను దాటేసి గ్రామాల్లో విస్తరించింది. ఇప్పుడు ఊరూరా స్వెరోస్ సంఘాలు ఉన్నాయి. ఓ వర్గం వారంతా స్వెరోస్ చెంతన చేరారు. హిందూ మతానికి పోటీగా సమాంతర వ్యవస్థ నడుపుతున్నారనేది బీజేపీ ఆరోపణ.
ఐపీఎస్ అయిన ఆర్.ఎస్.ప్రవీణ్‌కుమార్ తొమ్మిదేళ్లుగా అదే సంస్థలో తిష్ట వేసి ఉండటమేంటని ప్రశ్నిస్తున్నారు కొందరు. సాధారణంగా ఏ ఉద్యోగంలోనైనా మూడేళ్లకు ఒకసారి బదిలీలు కామన్. తప్పనిసరి అయితే.. మరో రెండు, మూడేళ్లు అక్కడే ఉంచుతారు. అలాంటిది ఏకంగా తొమ్మిదేళ్లు ఒకే సంస్థ బాధ్యతలు అప్పగించడమేంటని తప్పుబడుతున్నారు. ప్రభుత్వ ఉన్నతాధికారిగా ఉండి.. స్వెరోస్ లాంటి ఎన్జీవో నడపడం నిబంధనలకు విరుద్ధమనీ అంటున్నారు. అధికారులు సంస్థలు రూపంలో తమ పరపతిని దుర్వినియోగం చేసే అవకాశం ఉంటుందని ఆరోపిస్తున్నారు. ఐపీఎస్ ప్రవీణ్‌కుమార్‌కు ప్రభుత్వ పెద్దల అండా,దండా పుష్కలంగా ఉందని అంటున్నారు. ప్రవీణ్ కుమార్ బావ మెతుకు ఆనంద్.. టీఆర్ఎస్ పార్టీ తరఫున వికారాబాద్ ఎమ్మెల్యేగా ఉన్నారు.
కొంత కాలంగా స్వెరోస్ కారణంగా ప్రవీణ్ కుమార్ కేంద్రంగా ఇంత రచ్చ జరుగుతున్నా.. ప్రభుత్వం కనీసం పట్టించుకోకపోవడమేంటని ప్రశ్నిస్తున్నారు. ఆయనకు సర్కారు సపోర్ట్ చేస్తోందని ఆరోపిస్తున్నారు. చిన్న అలగేషన్ వస్తేనే వెంటనే ట్రాన్స్‌ఫర్ చేసేస్తారు.. అలాంటిది స్వెరోస్ కేంద్రంగా వందల కోట్ల అక్రమాలు జరిగాయని ఆరోపణలు వస్తున్నా.. ప్రభుత్వం వాటిపై విచారణకు ఆదేశించకపోవడం అనుమానాలకు తావిస్తోందని అంటున్నారు. ఒక్క అధికారి కోసం ప్రభుత్వం ఇంతగా మౌనం ఎందుకు వహిస్తోందని.. ఇది కులాల, మతాల విధ్వేషంగా మారుతున్నా ఎందుకు పట్టించుకోవడం లేదని నిలదీస్తున్నారు. ముందుముందు.. స్వెరోస్, ప్రవీణ్ కుమార్, బీజేపీ, హిందుత్వ సంస్థలు, దళిత సేన వివాదం ఏ తీరాలకు చేరుతుందో...