ఇలాంటి గురువులుంటే... దేశ భవిష్యత్ గురి తప్పదా?
posted on Aug 31, 2016 @ 12:04PM
బతకలేని బడి పంతులు అంటుంటారు. బతకలేని బడిపంతుళ్లు ఇప్పుడున్నారో లేదోగాని సరిగ్గా బతకటం చేతకాని బడి పంతుళ్లు రోజురోజుకు ఎక్కువైపోతున్నారు. అసలు ఒకప్పుడు ఉపాధ్యాయ వృత్తి అంటే చాలా మందికి మంచి గౌరవం వుండేది. కాని, ఇప్పుడు పరిస్థితి మరీ విషాదం. ఏ ఇంజనీరో, డాక్టరో, కనీసం ఎంబీఏనో చేయలేని వాళ్లే టీచర్లు అవుతున్నారు. టీచర్ అయ్యేందుకు ఫలానా అర్హత అంటూ కూడా లేకుండా పోయింది. గల్లీ గల్లీల్లో వెలిసే చిన్నా చితకా స్కూల్స్ లో డిగ్రీ, ఇంటర్ పాసైన వారు ఎవర్నైనా సరే టీచర్లుగా పెట్టేస్తున్నారు! టీచర్ అయ్యాక విద్యార్హతలు సరిగ్గా లేకున్నా సరే..... కనీసం బుద్దైనా వక్రమార్గంలో వుండకుంటే అదే గొప్పా!
కాని, కొందరు గురువులు తమ వృత్తికే సిగ్గు చేటుగా మారిపోతున్నారు. ఒక టీచర్ పిల్లల్ని వాతలు పడేలా కొట్టి షాడిజమ్ చూపిస్తుంది. మరో టీచర్ బూతులు తిడుతూ అవమానిస్తుంది. ఇలాంటి వార్ని చూసి పిల్లలు అందుకు తగ్గట్టే తయారవుతున్నారు... కొట్టడం, తిట్టడం కాదు... మరో అడుగు ముందుకేసే దుర్మార్గ టీచర్లు కూడా ఎక్కువైపోతున్నారు ఈ మధ్య. తాజాగా ఛత్తీస్ గఢ్ లో ఓ గిరిజన పాఠళాల టీచర్ ఏం చేశాడో తెలుసా? చదువుకోటానికి తన దగ్గరికి వచ్చిన పిల్లల్ని మసాజ్ చేయమన్నాడు. వాళ్ల చేత కాళ్లు కూడా పట్టించుకున్నాడు. అయితే, ఆ ఘన కార్యం అంతా సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. సోషల్ మీడియాలో సర్క్యులేట్ అయింది. చివరకు, పై అధికారులు టీచర్ దొరవార్ని సస్పెండ్ చేశారు. నిజంగా మాట్లాడుకుంటే ఒక టీచర్ కాళ్లు పట్టడం పెద్ద వార్తేం కాదు మన దేశంలో. అది గౌరవం కొద్దీ పిల్లలు చేస్తే ఫర్లేదు. కాని, అమాయక గిరిజన పిల్లల్ని టీచర్ దబాయించి కాళ్లు ఒత్తించుకోవటం? నిస్సందేహంగా అమానుషమే అవుతుంది. ఇలాంటి టీచర్లు మన దేశంలో ఊరూరా వుంటుంటారు...
టీచర్లలో కీచక టీచర్లు కూడా ఈ మధ్య ఎక్కువైపోయారు. లైంగికంగా వేధించే ఉపాధ్యాయులకు దేహ శుద్ధి జరగటం అసలు పెద్ద వార్తే కాదన్నంత మందంగా మారిపోయాం మనం! ఒరిస్సాలో ఏకంగా ఉత్కల్ యూనివర్సిటి క్యాంపస్ లోనే తన పైత్యం ప్రదర్శించాడు ఓ టీచర్. తన స్నేహితురాల్ని కలవటానికి వచ్చిన మరో విద్యార్థినితో అసభ్యంగా ప్రవర్తించాడు. ఆ విషయం తెల్సిన యూనివర్సటి విద్యార్థిని మాస్టార్ గార్ని చితకబాదింది. ఆమెకు మిగతా విద్యార్థినులు కూడా తొడయ్యారు. అయితే, ఇక్కడ మరో అరాచకం ఏంటంటే, అమ్మాయిలతో అసభ్యంగా ప్రవర్తించిన గురువుగారు ఆ సమయంలో చిత్తుగా మందు కూడా తాగి వున్నాడట!
మందు తాగి, అమ్మాయిల్ని వేధించే టీచర్లతో ... ఇక విద్యార్థుల భవిష్యత్ ఎలా వుండబోతోంది? ధైర్యం వుంటే మనమే ఊహించుకోవచ్చు!