పీఆర్ మోహన్ మృతికి చంద్రబాబు సంతాపం
posted on Jul 12, 2021 @ 1:31PM
తెలుగు దేశం పార్టీ సీనియర్ నేత, శాప్ మాజీ చైర్మన్ పీఆర్ మోహన్ గుండెపోటుతో మృతి చెందారు. టీడీపీలో పలు కీలక పదవుల్లో మోహన్ పనిచేశారు. గతంలో శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానం ట్రస్టుబోర్డు చైర్మన్‌గా విధులు నిర్వహించారు. పీఆర్ మోహన్ మృతితో టీడీపీలో విషాదం అలుముకుంది. ఆయన మృతికి టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేష్, అచ్చెన్నాయుడు సహా రాష్ట్ర పార్టీ నేతలు, జిల్లా టీడీపీ నాయకులు సంతాపం తెలిపారు.
టీడీపీ సీనియర్ నేత పీఆర్ మోహన్ మృతి బాధాకరమని ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. మోహన్ గుండెపోటుతో మృతి చెందారన్న వార్తను జీర్ణించుకోలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ ఆవిర్భావం నుంచి పార్టీకి మోహన్ చేసిన సేవలు వెలకట్టలేనివన్నారు. శాప్ చైర్మన్‌గా మోహన్ ఎన్నో అభివృద్ది కార్యక్రమాలు చేశారని తెలిపారు. టీడీపీ నిబద్ధత కలిగిన నేతను కోల్పోయిందని అన్నారు. మోహన్ కుటుంబసభ్యులకు పార్టీ ఎప్పుడు అండగా ఉంటుందని చంద్రబాబు భరోసా ఇచ్చారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి అంకిత భావంతో పనిచేస్తున్న క్రమశిక్షణ కలిగిన నాయకుడిని కోల్పోయామని టీడీపీ నేతలు సంతారం తెలిపారు. పీఆర్ మోహన్ ఆత్మకు శాంతి చేకూర్చాలని, వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యం ప్రసాదించాలని భగవంతున్ని ప్రార్థించారు.