అర్ధరాత్రి టీడీపీ సీనియర్ నేత అరెస్ట్.. ఇంత అరాచకమా..
posted on May 24, 2021 @ 10:40AM
కరోనా కల్లోలం రేపుతున్నా.. బ్లాక్ ఫంగస్ భయపెడుతున్నా ఆంధ్రప్రదేశ్ సర్కార్ తీరు మాత్రం మారడం లేదు. కరోనా కట్టడి, చికిత్స కంటే కక్ష రాజకీయాలే తమకు ఇష్టమన్నట్లుగా వ్యవహరిస్తోంది. వరుసగా జరుగుతున్న ఘటనతో జనాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నా జగన్ రెడ్డి ప్రభుత్వం మాత్రం డోంట్ కేర్ అన్నట్లుగా సాగుతోంది. నర్సాపురం ఎంపీ రఘురామ రాజు అరెస్ట్ వ్యవహారం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. ఆ వివాదం చల్లారకుండానే మరో టీడీపీ నేతలను అర్ధరాత్రి పోలీసులు అరెస్ట్ చేయడం కలకలం రేపుతోంది.
కర్నూల్ జిల్లా బనగానపల్లె టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్ధన్ రెడ్డిని బనగానపల్లె పోలీసులు అర్ధరాత్రి అరెస్ట్ చేశారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో జనార్ధన్ రెడ్డిని అరెస్ట్ చేసి డోన్ రూరల్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. జనార్ధన్ రెడ్డిపై ఐపీసీ 307, 147, 148, 324, 341, 3 క్లాస్ 1, సెక్షన్లతోపాటు... ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులను పోలీసులు నమోదు చేశారు. సోమవారం ఆయనను ఆళ్లగడ్డ కోర్టులో హాజరు పరచనున్నారు.ఆదివారం మధ్యాహ్నం బీసీ జనార్ధన్ రెడ్డి ఇంటి పరిసరాల్లో తిరిగిన... కాటసాని రామిరెడ్డి అనుచరులు ముగ్గురిని టీడీపీ కార్యకర్తలు పట్టుకున్నారు. దీంతో జనార్థన్‌రెడ్డి, కాటసాని రామిరెడ్డి అనుచరుల మధ్య ఘర్షణ జరిగింది. వారిలో ముగ్గురికి గాయాలయ్యాయి. కాటసాని రామిరెడ్డి అనుచరులపై దాడి ఘటనలో జనార్ధన్‌రెడ్డితో పాటు.. మరో 9 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
టీడీపీ నేత బీసీ జనార్ధన్ రెడ్డి అరెస్టుతో బనగానపల్లెలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఎమ్మెల్యే అనుచరులే.. బీసీ జనార్ధన్ రెడ్డి ఇంటి పరిసరాల్లో తిరిగినా.. పోలీసులు మాత్రం ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. బనగానపల్లె పోలీసుల చర్యలపై టీడీపీ నేతలు ఫైరవుతున్నారు. రాజకీయ కక్షతోనే బీసీ జనార్ధన్ రెడ్డిని అరెస్ట్ చేశారని ఆరోపిస్తున్నారు.
టీడీపీ బీసీ జనార్ధన్ రెడ్డి అరెస్టును ఆ పార్టీ అధినేత చంద్రబాబు ఖండించారు. "కరోనా విపత్కర పరిస్థితుల్లో ప్రభుత్వం ప్రజల ఆరోగ్యంపై దృష్టి పెట్టాలి. ప్రతిపక్ష నేతలపై అక్రమ కేసులే లక్ష్యంగా పాలన సాగిస్తున్నారు. బీసీ జనార్ధన్‌రెడ్డి, ఇతర నేతల అక్రమ అరెస్టులను ఖండిస్తున్నా. అధికారం శాశ్వతం కాదనే విషయాన్ని జగన్ తెలుసుకోవాలి. వైకాపా పాలన మూడు అక్రమ కేసులు, 6 అరాచకాలు అన్నట్లుగా సాగుతోంది. దాడికి పాల్పడిన వైకాపా నేతలను వదిలిపెట్టి జనార్ధన్‌రెడ్డిపై కేసు పెడతారా.? తెదేపా నేతలపై అక్రమ కేసులు ఎత్తివేసి వెంటనే విడుదల చేయాలి" అని చంద్రబాబు డిమాండ్ చేశారు.