బ్లాక్ ఫంగస్ సోకడానికి కారణం ఇదేనా? ఆక్సిజన్ ను అడ్డగోలుగా వాడేస్తున్నారా!
posted on May 24, 2021 9:16AM
కరోనా సెకండ్ వేవ్ రోజురోజుకూ భయంకరంగా మారుతోంది. దేశంలోని పెద్ద ఆసుపత్రుల్లో సైతం ఆక్సిజన్ వ్యవస్థ సరిగ్గా లేకపోవడంతో వైరస్ మ్యూటేషన్ మరింత విధ్వంసకారిగా మారుతోంది. కోవిడ్ నుంచి కోలుకున్నరోగులిప్పుడు ఇతర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. డయాబెటిస్, హార్ట్ ఎటాక్, బ్లడ్ క్లాటింగ్ సమస్యతో పాటు ఇప్పుడు బ్లాక్ ఫంగస్ వెంటాడుతోంది. ముకోర్మైకోసస్ అని పిలిచే బ్లాక్ ఫంగస్ ఇన్ఫెక్షన్ కేసులు పెరుగుతుండటం ఆందోళనకరంగా మారింది. కరోనా నుంచి కోలుకున్న కొంతమంది ఈ ఫంగస్ దెబ్బకు ప్రాణాలు కోల్పోతున్నారు. మ్యూకోర్ మైకోసిస్ వ్యాధి మనిషి శరీరంలో చాలా వేగంగా వ్యాపిస్తుంది. రోగి బ్రెయిన్, ఊపిరితిత్తులు, చర్మంపై కూడా ఈ బ్లాక్ ఫంగస్ దాడి చేస్తుంది. చాలామంది బ్లాక్ ఫంగస్ కారణంగా చూపు కోల్పోతున్నారు. కొందరప రోగులకు నాసల్ బోన్ సమస్యలు వస్తున్నాయి. తగిన సమయంలో ఇవి నియంత్రించబడకపోతే రోగి ప్రాణాలకు ముప్పు వాటిల్లుతుంది. ఇది అరుదైన ఫంగల్ ఇన్ఫెక్షన్ అని, దీని మరణాల రేటు 50% కంటే ఎక్కువగా ఉంటుందని వైద్యులు అంటున్నారు.
ముకోర్మైకోసిస్ ముకోర్ అనే ఫంగస్ వల్ల ఇది వ్యాపిస్తుంది. ఇది తడి ఉపరితలాల నుంచి ఎక్కువగా సోకుతుంది. కరోనా సోకిన వారిలో, ఇతర దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఉన్నవారిలో, బలహీనమైన రోగనిరోధక శక్తి ఉన్నవారికి ఈ వ్యాధి సోకే అవకాశం ఉంది. ఎక్కువ షుగర్ లెవెల్స్ ఉన్నవారికీ, కరోనా తగ్గి ఇమ్యూనిటీ లెవల్స్ తక్కువగా ఉన్నవారిలో ఈ సమస్య వస్తోంది. కిడ్నీ వ్యాధులు, సైనస్, హెచ్ఐవీ, గుండె జబ్బులు కలవారిలో దీని ప్రభావం ఎక్కువగానే ఉంటుంది. క్యాన్సర్ చికిత్స, కిడ్నీ, లివర్ మార్పిడి జరిగిన వారు.. మోకాళ్ల నొప్పులు, ఆస్మా ఉన్నవారు స్టెరాయిడ్స్ ఎక్కువగా వాడుతుంటారు. అందుకే వారిలో కూడా ఈ వ్యాధి సోకే అవకాశం ఎక్కువ. ఇది సాధారణంగా ముక్కు నుంచి కంటికి, అక్కడి నుంచి మెదడుకు వ్యాప్తి చెందుతుంది.
కోవిడ్ చికిత్స సమయంలో అధికంగా స్టెరాయిడ్ వాడటం, ఆక్సిజన్ అందించేప్పుడు పరికరాలు పరిశుభ్రంగా లేకపోవడం కూడా ఈ వ్యాధికి కారణమవుతాయని నిపుణులు చెబుతున్నారు. ఆక్సిజన్ అందించే ప్రక్రియలో ఉపయోగించే హ్యుమిడిఫయర్‌లో స్టెరైల్ వాటర్‌కు బదులుగా సాధారణ నీటిని ఉపయోగించడం వలన ఫంగస్ ఏర్పడుతుంది. ఆక్సిజన్‌తో పాటు ఈ ఫంగస్ కూడా చేరడం వలన కోవిడ్ పేషెంట్లు బ్లాక్ ఫంగస్ బారిన పడే అవకాశం ఉందని అంటున్నారు. వీటితో పాటు బ్లాక్ ఫంగస్ సోకడానికి కొత్త కారణం ఉందని తెలుస్తోంది. హాస్పిటల్స్ లో రోగులకు అందిస్తున్న ఆక్సిజన్ ఇందుకు కారణమవుతోందని వైద్యులు చెబుతున్నారు.
దేశంలో ప్రస్తుతం విజృంభిస్తున్న సెకండ్ వేవ్ తో వైరస్ లోడ్ ఎక్కువగా ఉంటోంది. ఎక్కువ మంది రోగులు హాస్పిటల్ లో చేరాల్సి వస్తోంది. శ్వాస సమస్యలతో ఆక్సిజన్ అవసరమవుతోంది. దేశంలో మెడికల్ ఆక్సిజన్ కొరత తీవ్రంగా ఉంది. దీంతో అత్యవసరం కావడంతో.. పారిశ్రామిక ఆక్సిజన్ ను ఉపయోగిస్తున్నారు. ఇదే ఇప్పుడు సమస్యగా మారిందంటున్నారు. పారిశ్రామిక ఆక్సిజన్ ను అప్ గ్రేడ్ చేసి మెడికల్ ఆక్సిజన్ గా వాడాలి.. కాని ఎక్కువ రాష్ట్రాల్లో అలాంటిదేమి చేయకుండానే నేరుగా రోగులకు ఆక్సిజన్ అందిస్తున్నారు. ఇది కూడా బ్లాక్ ఫంగస్ రావడానికి ప్రధాన కారణమవుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.
పారిశ్రామిక ఆక్సిజన్ వైద్య ఆక్సిజన్ కంటే 99.67% వద్ద స్వచ్ఛమైనప్పటికీ, పారిశ్రామిక సిలిండర్లు.. ఆక్సిజన్ సిలిండర్ల వలె శుభ్రంగా ఉండవు. పారిశ్రామిక ఆక్సిజన్ అనేక మైక్రో లీక్‌లకు గురవుతుంటుంది. పారిశ్రామిక గ్యాస్ సిలిండర్లలో దుమ్ము కణాలు, తేమ మరియు నీటి సీపేజ్ ఉన్నందున వాటిని వైద్య అవసరాల కోసం ఉపయోగించకూడదని వైద్యులు చెబుతున్నారు. అప్‌గ్రేడ్ చేయకుండా వాటిని మెడికల్ ఆక్సిజన్ గా ఉపయోగిస్తే సమస్యలు వస్తాయంటున్నారు. పారిశ్రామిక ఆక్సిజన్ అప్‌గ్రేడేషన్‌కు కొంత సమయంతో డబ్బు అవసరం. దేశంలో ఆక్సిజన్ అవసరం పెరగడంతో అప్ గ్రేడ్ చేయడం సాధ్యం కావడం లేదు. దీంతో పారిశ్రామిక సిలిండర్ల ద్వారా కలుషితం ఎక్కువగా ఉండటంతో బ్లాక్ ఫంగస్ ఈజీగా వస్తోందనే అభిప్రాయం వైద్య నిపుణుల్లో వ్యక్తమవుతోంది.
పారిశ్రామిక ఆక్సిజన్‌ను వైద్య వినియోగానికి పెట్టేటప్పుడు ఖచ్చితంగా ప్రోటోకాల్ పాటించాల్సి ఉంటుంది. అవి నిల్వ చేయబడిన విధానం మరియు లీక్‌ల ద్వారా కలుషితమయ్యే అవకాశం ఉన్నందున శుభ్రపరచడం అవసరం. అప్‌గ్రేడ్ చేయకుండా ఉపయోగించరాదు. ఇందులో లీకేజీలను గురించి ప్లగ్ చేయడం, కవాటాలను మార్చడం చేయాలి. ఇవన్ని పరిశీలించాక... వైద్యాధికారులు పరిశీలించి ధృవీకరించాకే మెడికల్ ఆక్సిజన్ గా ఉపయోగించాలి. కాని దేశంలో ప్రస్తుతం ఇదేమి జరగడం లేదు. దీంతో లోపల కలుషితమైన నీటితో ఆక్సిజన్ సిలిండర్లు ఫంగస్ నుండి ముఖ్యంగా రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారికి ముప్పు కలిగిస్తున్నాయని అంటున్నారు. బ్లాక్ ఫంగస్ కేసులు పెరుగుతున్నందున ఇప్పటికైనా వైద్యాధికారులు, ప్రభుత్వాలు.. పారిశ్రామిక ఆక్సిజన్ వాడకంలో ఖచ్చితమైన మెడికల్ ప్రోటోకాల్ పాటించాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. లేదంటే బ్లాక్ ఫంగస్ మరింత ప్రమాదకరంగా మారే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.