రూ.10కే కరోనా చికిత్స.. డాక్టర్ కాదు దేవుడు..
posted on May 24, 2021 @ 10:40AM
కరోనాన సోకి ఆసుపత్రిలో చేరితే ఆస్తులు అమ్ముకోవాల్సిన పరిస్థితి. రెమ్‌డెసివిర్ ఇంజెక్షన్ కావాలంటే 50వేలకు పైనే కట్టాలి. హాస్పిటల్‌లో ఎన్ని రోజులుంటే అన్ని లక్షలు లాగేస్తున్నారు. కన్సల్టెన్సీ కావాలంటే వందలకు వందలు చెల్లించాల్సిందే. అది కూడా ఏ ఆన్‌లైన్లో పైపైన ట్రీట్‌మెంట్ చేస్తున్నారు. కొందరు డాక్టర్లు సైతం కరోనా బాధితులను అంటరాని వారిగా చూస్తున్నారు. ఆ టెస్టులు, ఈ టెస్టులు అంటూ వేలకు వేలు వసలు చేస్తున్నారు. అలాంటిది, ఇలాంటి కరోనా కల్లోల సమయంలో ఓ వైద్యుడు కరోనా బాధితుల పాలిట దేవుడిలా మారాడు. 10 రూపాయలు పెడితే మంచి టీ అయినా దొరకని ఈ రోజుల్లో.. జస్ట్.. 10 రూపాయలకే కరోనా చికిత్స చేస్తూ అందరి అభిమానం చూరగొంటున్నారు. వైద్యో నారాయణో హరి.. అనే మాటకు నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తున్నారు డాక్టర్ విక్టర్ ఇమ్యాన్యుయెల్.
కన్సల్టెన్సీ ఫీజుగా కేవలం రూ. 10 తీసుకొని, కరోనా బాధితులకు చికిత్స అందిస్తున్నాడు ఆ వైద్యుడు. బాధితులు నిరుపేదలైతే ఆ రూ.10 కూడా తీసుకోవడం లేదు. కరోనాకు సంబంధించిన వివిధ పరీక్షలను తక్కువ ధరకే చేస్తున్నారు. మందులనూ అందుబాటు ధరలకే ఇస్తున్నారు.
కొవిడ్ వైద్యం ఖరీదైన వ్యవహారంగా మారిన పరిస్థితుల్లో హైదరాబాద్, పీర్జాదిగూడలో ప్రజ్వల క్లినిక్ నిర్వహిస్తున్న డాక్టర్ విక్టర్ ఇమ్మాన్యుయెల్ తక్కువ ధరకు మంచి చికిత్స అందిస్తూ మిగతా వైద్యులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. ఆయన జనరల్ మెడిసిన్ స్పెషలైజేషన్‌తో ఎంబీబీఎస్ చేశారు. వివిధ ఆస్పత్రుల్లో పనిచేసిన ఆయన తర్వాత సొంతంగా క్లినిక్ పెట్టుకున్నారు క్లినిక్ పెట్టినప్పటి నుంచి తన దగ్గరకు వచ్చే రోగులకు కన్సల్టెన్సీ ఫీజు కింద రూ.200 తీసుకుంటున్నారు. పేదరోగుల నుంచి రూ.10 మాత్రమే తీసుకుంటున్నారు.
దేశం కోసం సరిహద్దుల్లో పోరాడే సైనికులు, ప్రజలకు అన్నం పెట్టే రైతులు, అనాథలు, దివ్యాంగులకు.. ఫీజు, మందులు అంతా ఉచితంగా అందిస్తున్నారు. కొందరు దాతలు సహకరిస్తే నిరుపేద రోగులకు టెస్టులు సహా మందులూ ఉచితంగానే అందిస్తున్నారు. కొవిడ్ సోకిన నిరుపేద రోగులకు ల్యాబ్ పరీక్షలు, మందులు, ఆక్సిజన్, రెమ్‌డెసివిర్ ఇంజక్షన్‌లు తక్కువ ధరకే అందిస్తున్నారు. రవాణా ఖర్చులు భరిస్తే.. ఇంటి దగ్గర వైద్యం చేయించుకునే రోగుల కోసం నర్సులను సైతం పంపుతున్నారు.
పీర్జాదిగూడలోని ప్రజ్వల క్లినిక్‌లో అతి తక్కువ ధరకే ఇన్‌పేషెంట్ సేవలు సైతం అందిస్తున్నారు డాక్టర్ ఇమ్మాన్యుయెల్. పేషెంట్ వస్తే చాలు లక్షలకు లక్షలు దోసుకునే ప్రైవేట్ హాస్పిటల్స్ మాదిరి కాదు. రూ.15వేల నుంచి రూ.20లోపు ఖర్చుతోనే కరోనాకు ట్రీట్‌మెంట్ చేసి పంపిస్తున్నారు. కార్పొరేట్ ఆస్పత్రుల్లో లక్షలు ఖర్చవుతుండగా రూ.15 వేలకే కరోనా వైద్యం అందిస్తుండడంతో ఇమ్మాన్యుయెల్ నడిపిస్తున్న ప్రజ్వల క్లినిక్‌కు వచ్చే రోగుల సంఖ్య రోజురోజుకి పెరుగుతోంది. హైదరాబాద్‌లోని అనేక ప్రాంతాల నుంచి ప్రజ్వల క్లినిక్‌ను వెతుక్కుంటూ వస్తున్నారు. 10 రూపాయల డాక్టర్‌గా ఆయన పేరు ఇప్పుడు ప్రజల్లో మారిమోగిపోతోంది.
పీర్జాదిగూడ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొవిడ్ ఐసొలేషన్ సెంటర్‌లోనూ డాక్టర్ ఇమ్మాన్యుయెల్ ఏడాదిగా కరోనా బాధితులకు ఉచితంగా వైద్య సేవలందిస్తున్నారు. తన వద్దకు వచ్చిన రోగుల్లో నిరుపేదలుంటే వారిని పీర్జాదిగూడ ఐసొలేసన్ సెంటర్‌లో చేర్పించి వారికి పూర్తిస్థాయిలో ఉచితంగానే వైద్యం చేయిస్తున్నారు. పది రూపాయల డాక్టర్‌గా.. కరోనా దేవుడిగా.. స్థానికులంతా ఆయన్ను కొనియాడుతున్నారు.