దాడులతో భయపెట్టగలరా? జగన్‌పై తిరుగుబాటు తప్పదా?
posted on Jul 28, 2021 @ 12:26PM
కోడలిని కొట్టి అత్త అరిచిందనేది సామెత. ఇది నిజమేనని ఎప్పటికప్పుడు రుజువు అవుతూనే ఉంటుంది. సేట్ టు సేమ్.. ఈ సామెతను పోలిన సంఘటన ఇప్పుడు ఏపీలో కలకలం రేపుతోంది. బాధితులపైనే కేసులు. దాడికి గురైన వారిపైనే హత్యాయత్నం బనాయింపు. బహుషా.. రాజారెడ్డి రాజ్యమే వాళ్ల టార్గెట్ కాబోలు. అందుకే, వరుసగా టీడీపీ నేతలే లక్ష్యంగా దాడులకు తెగబడుతూనే ఉన్నారు. తాజాగా, మాజీ మంత్రి దేవినేని ఉమా మీద జరిగిన అటాక్ మరింత అరాచకంగా ఉంది. రాత్రి వేళలో పదుల సంఖ్యలో వైసీపీ శ్రేణులు దేవినేని బృందంపై దాడికి బరితెగించారు. కొండపల్లి అడవుల్లో గప్‌చుప్‌గా జరుగుతున్న అక్రమ మైనింగ్‌ను బాహ్య ప్రపంచానికి చాటిచెప్పడానికి దేవినేని ఉమా ఆధ్వర్యంలో టీడీపీ బృందం అక్కడికి వెళ్లింది. ఈ విషయం తెలిసి వైసీపీ వర్గాలు దేవినేనిని అడ్డగించి దాడికి పాల్పడ్డారు. టీడీపీ వాళ్లు ఎదురుతిరగడంతో దెబ్బలు తగలకుండా బతికిపోయారు. తనపై జరిగిన దాడికి నిరసనగా దేవినేని అక్కడే కారులో ధర్నాకు దిగారు. పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. పై నుంచి ఏం ఆదేశాలు వచ్చాయో.. ఖాకీలే కారు అద్దాలు పగలగొట్టారు. దేవినేనిని అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు. మామూలుగా అయితే అక్కడికి ఆ ఉద్రిక్తత ముగిసిపోవాలి. కానీ, ఏపీ పోలీసులు కదా.. వైసీపీ తొత్తుల్లా వ్యవహరించారని అంటున్నారు. బాధితుడైన దేవినేనిపైనే ఏకంగా మర్డర్ అటెంప్ట్ కేసు పెట్టారు. ఉచ్చు మరింత బిగించేందుకు ఎస్సీ, ఎస్టీ సెక్షన్లు కూడా బనాయించారు. బహుషా పాలకులు ఫుల్ ఖుషీ అయింటారు.
కృష్ణా జిల్లా నేతలపై ఇలాంటి అరాచకాలు జరగడం ఇదే తొలిసారి కాదు. గతంలో కూడా దాదాపు ఇలాంటి దాడులే జరిగాయి. అది స్థానిక సంస్థల ఎన్నికల సమయం. బుద్ధా వెంకన్న, బోండా ఉమాలు మాచర్లలో ఎన్నికల ప్రచారాన్ని పర్యవేక్షించి విజయవాడ తిరిగి వస్తున్నారు. మార్గ మధ్యలో వైసీపీ దుండగులు కాపు కాశారు. టీడీపీ నేతలు ప్రయాణిస్తున్న కారును వెంబడించి దాడికి దిగారు. పెద్ద పెద్ద దుంగలతో, కర్రలతో, రాళ్లతో అటాక్ చేశారు. కిలోమీటర్ల మేర టీడీపీ వారి వాహనాన్ని వెంబడించి మళ్లీ మళ్లీ దాడులకు తెగించారు. చివరాఖరికి కారు డ్రైవర్ చాకచక్యంతో అతికష్టం మీద బతుకు జీవుడా అంటూ ప్రాణాలతో విజయవాడ చేశారు. అప్పట్లో ఆ అటాక్ పెను దుమారం రేపింది. టీవీల్లో ఆ దృశ్యాలు చూసి అంతా అవాక్కయ్యారు. ఆ కర్ర గానీ, ఆ రాయి గాని తగిలుంటే ఎంత దారుణం జరిగిపోయేది? వాళ్లు వైసీపీ నాయకులా.. బజారు రౌడీలా అంటూ ప్రజలంతా మండిపడ్డారు. అయినా, వైసీపీ వాళ్ల బుద్ధి మారనేలేదు. దాడుల దారుణాన్ని ఆపనేలేదు. తాజాగా మరోసారి దేవినేని ఉమాను భయభ్రాంతులకు గురి చేసే ప్రయత్నం తీవ్ర స్థాయిలో జరుగుతోంది.
అచ్చెన్నాయుడు, దేవినేని ఉమా, ధూళిపాళ్ల నరేంద్ర, బుద్ధా వెంకన్న, బోండా ఉమా, కొల్లు రవీంద్ర, చింతమనేని ప్రభాకర్.. ఇలా అనేక మంది నోరున్న టీడీపీ నేతలే టార్గెట్‌గా వైసీపీ సర్కారు కేసులు, దాడులతో బరితెగిస్తోంది. జగన్ ప్రభుత్వ అవినీతి, అరాచక పాలనను నిత్యం ప్రజల్లో ఎండగట్టడమే పాలకులకు కళ్లమంటగా మారింది. జగన్‌కు వ్యతిరేకంగా వినిపించే నోళ్లు నొక్కేసేందుకు.. ప్రధాన నేతల పేర్లు రాసుకొని మరీ టార్గెట్ చేస్తున్నారని అంటున్నారు. ఫైర్‌బ్రాండ్ లీడర్ అచ్చెన్నాయుడిని ఈఎస్ఐ కేసులో ఇరికించి నానాతిప్పలు పెట్టారు. ధూళిపాళ్ల నరేంద్రపై పాత కేసును కొత్తగా బయటకు తీసి జైలుకు పంపించారు. ఇలా టీడీపీ నేతలందరినీ ఏదో రకంగా కేసులతో ఇబ్బంది పెడుతున్నారు. ఆఖరికి సొంతపార్టీ ఎంపీ అయిన రఘురామను సైతం వదలకుండా కేసులు, అరెస్టులు, థర్డ్ డిగ్రీతో చుక్కలు చూపిస్తున్నారు.
టీడీపీ టార్గెట్‌గా జరుగుతున్న వరుస దాడులు చూసి.. శాంతికాముకులైన ఆంధ్రులు హడలిపోతున్నారు. కడప ఫ్యాక్షన్‌ను రాష్ట్రమంతా తీసుకొస్తున్నారని మండిపడుతున్నారు. పోలీసులను పావులుగా వాడుకుంటూ.. చట్టాన్ని చుట్టంగా మార్చుకొంటూ.. కేసులు, దాడులతో అంబేద్కర్ రాజ్యాంగాన్ని అపహ్యాస్యం చేస్తూ.. రాజారెడ్డి రాజ్యాంగాన్ని ఏపీవ్యాప్తంగా అమలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఫ్యాక్షన్ మీద స్వారీ ఎప్పటికైనా ప్రమాదకరమే. రాజారెడ్డి దారుణ మరణమే అందుకు నిదర్శనం. మరి, ఆ రాజారెడ్డి అడుగుజాడల్లో నడుస్తున్న నేటి పాలకుల పాపం పండే రోజు దగ్గరలోనే ఉందంటున్నారు. కాలం ఎంతటివాడినైనా శిక్షించకమానదంటూ శపిస్తున్నారు. ఇలా బరితెగించడం దారుణమంటూ మండిపడుతున్నారు.