దాడి చేసి.. మర్డర్ కేసు పెట్టి.. ఇదేమి రాజ్యం!
posted on Jul 28, 2021 @ 11:14AM
అధికారం ఉంటే ఇంత భయంకరంగా బరితెగిస్తారా అని ఆశ్చర్యపోవాల్సిన పరిస్ధితి ఆంధ్రప్రదేశ్ లో కనిపిస్తోంది. మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుపై దాడి, ఆ తర్వాత పోలీసుల నిర్బంధం..అరెస్టు వ్యవహారాలు చూస్తుంటే... చట్టం పోలీసుల చేతిలో లేదని.. వైసీపీ నేతల చేతిలో ఉందేమోనని అనిపిస్తోంది. తనపై దాడి జరిగిందని దేవినేని ఉమ ఆందోళన చేస్తే.. పోలీసులు ఆయనపైనే హత్యాయత్నం కేసు నమోదు చేయడం వైసీపీ దుర్మార్గ పాలనను సాక్ష్యంగా నిలుస్తోంది. అందరిని విస్మయ పరుస్తోంది.
అర్ధరాత్రి మొత్తం హైడ్రామా సాగగా.. చివరికి నందివాడ పోలీస్‌స్టేషన్‌లో మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుపై పలు సెక్షన్ల కింద కేసు నమోదైంది. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, 307 సెక్షన్లు కింద పోలీసులు కేసు నమోదు చేశారు. దేవినేని హత్యాయత్నానికి పాల్పడినందుకు 307 సెక్షన్ కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. దేవినేని ఉమాతో పాటు మొత్తం 18మంది తెదేపా వర్గీయులపై కేసులు నమోదు చేశారు పోలీసులు.
తనపై దాడి చేసిన వైసీపీ నేతలను అరెస్ట్ చేయాలంటూ.... తన ఫిర్యాదును తీసుకోవాలంటూ... దేవినేని ఉమా జీ.కొంండూరు పోలీస్‌స్టేషన్ వద్దకు ఆందోళనకు దిగారు. ఫిర్యాదు తీసుకునే దాక తాను కదిలేది లేదంటుూ కారులోనే కూర్చున్నారు. కానీ ఆయన ఫిర్యాదు తీసుకోలేదు పోలీసులు. అయితే.. అర్ధరాత్రి తర్వాత ఆయన్ను బలవంతంగా అదుపులో తీసుకున్నారు. కారు అద్దాలు పగులగొట్టి డోరు తెరిచి అదుపులో తీసుకున్నారు. అక్కడ నుంచి పెదపారుపూడి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. దాదాపు ఆరు గంటల పాటు కారులోనే ఉమ ఆందోళన చేశారు. పోలీసుల తీరుపై మండిపడ్డారు టీడీపీ నేతలు. ఫిర్యాదు తీసుకోకుండా... అదుపులో తీసుకోవడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు.
జిల్లా ఎస్పీగా కొత్తగా వచ్చిన సిద్ధార్ధ్ కౌశల్.. ప్రజల కోసమే పని చేస్తున్నట్లుగా చేసిన ప్రకటనలన్నీ ఇప్పుడేమయ్యాయో తెలుసుకోవాలని ఉంది. ఫిర్యాదులు తీసుకునే దగ్గర సంస్కరణలు, రోజూ స్పందన కార్యక్రమం పెట్టించిన ఎస్పీ.. ఇక్కడ మాత్రం వైసీపీ నేతలు చెప్పినట్లు చేయాల్సి వస్తుందా అని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు.
అక్రమ మైనింగ్ జరుగుతుందని బయటి ప్రపంచానికి తెలిసేలా చేయటానికే దేవినేని ఉమామహేశ్వరరావు కొండపల్లి రిజర్వ్ ఫారెస్టులోకి వెళ్లారు.. అక్కడి నుంచే మీడియాతో మాట్లాడారు. ఈ విషయంపై ఎప్పటి నుంచో వాదనలు, ఛాలెంజులు నడుస్తున్నాయి. ఈసారి వైసీపీ నేతలు సీరియస్ గా తీసుకున్నట్లున్నారు. ఏమైనా సరే దాడి చేయాలని డిసైడ్ అయినట్లున్నారు. అందుకే పక్కా ప్లాన్ ప్రకారం వందలమందితో కలిసి దాడి చేశారు.. టీడీపీ శ్రేణులు కూడా ఎదురుతిరగడంతోనే దేవినేని ఉమా దెబ్బలు తగలకుండా తప్పించుకోగలిగారు.. ఇప్పుడు అక్కడ అంటించకుండానే నిప్పు చెలరేగేలా ఉంది పరిస్దితి.
ఇదంతా ఒక ఎత్తు అయితే.. పోలీసులు గొడవలు అవుతాయనే పేరు చెప్పి దేవినేనిని తమ నిర్బంధంలో పెట్టుకుని పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పడం.. తెలుగుదేశం కీలక నేతలను గృహ నిర్బంధంలో పెట్టడం.. తెలుగుదేశం కార్యకర్తలపైనే లాఠీఛార్జి చేయడం చూస్తుంటే.. వైసీపీ నేతలు తమ అధికారాన్ని ఏ రేంజులో వాడుతున్నారో అర్ధమవుతూనే ఉంది.మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ తన బలాన్ని, బలగాన్ని అన్నిటిని వాడుతున్నారని ఈ ఘటనలు చూస్తుంటే తెలుస్తోంది. ఆఖరికి అక్రమ మైనింగ్ అడ్డుకోవాలని చూసిన ఫారెస్ట్ ఆఫీసర్ ని కూడా బదిలీ చేయించేశారంటే... అధికార యంత్రాంగం అంతా తెలిసి కళ్లు మూసుకుందని అర్ధమవుతోంది. అటవీ సంపదను అక్రమంగా అలా దోచుకుంటుంటే ఆపాల్సిన అధికారులు, పోలీసులు... దేవినేనిని అక్కడకు వెళ్లకుండా ఆపటానికి.. ఆయన మాట్లాడకుండా ఆపటానికే ప్రయత్నిస్తున్నారు.
ఇప్పటివరకు మాటల యుద్ధమే నడిచింది ఆ నియోజకవర్గంలో ఈ దెబ్బతో బాహాబాహీ నడుస్తోంది. ఇంత ఘర్షణపూరిత వాతావరణం ఏర్పడినా..ఇప్పటివరకు ఎస్పీ స్పాట్ కు రాకపోవడం గమనించాల్సిన విషయం. ఒత్తిడి తట్టుకోలేక.. రాలేదా..లేక వచ్చినా అధికార పార్టీ నేతలు చెప్పిందే చేయాలని తప్పించుకున్నారా అనేది తెలియటం లేదు. పోలీసులు మాత్రం వన్ సైడు వ్యవహారం నడిపిస్తున్నారు. కేవలం టీడీపీ శ్రేణులు అలర్ట్ గా ఉండి ఎదురు తిరగడంతోనే.. పరిస్దితి ఇంతటితో ఆగింది.. లేదంటే ఎంత దూరం వెళ్లేదో చెప్పలేం.