రామప్పకు పెను ముప్పు!.. పాలకులకు పట్టదా?
posted on Jul 28, 2021 @ 1:05PM
కాకతీయుల వైభవానికి యునెస్కో గుర్తింపు. ప్రపంచ వారసత్వ సంపదగా రామప్ప. అంతా బాగుంది. అందరికీ సంతోషంగా ఉంది. తెలుగుజాతికి దక్కిన గౌరవంగా అంతా సంబర పడుతున్నారు. ఇకపైనైనా రామప్పకు మంచి జనాదరణ లభిస్తుందని ఖుషీ అవుతున్నారు. అయితే, పాలకుల అవగాహన రాహిత్యంతో రామప్ప ఉనికి ప్రమాదంలో పడింది. ప్రభుత్వాల కాసుల కక్కుర్తికి చారిత్రక వైభవానికి ముప్పు వాటిల్లుతోంది. అవును, రామప్ప టెంపుల్‌కి సింగరేణి ఓపెన్ కాస్టు నుంచి ముప్పు పొంచిఉందని అంటున్నారు. ఆలయానికి జస్ట్ 6 కిలోమీటర్ల దూరంలోనే బొగ్గు ఉత్పత్తికి సన్నాహాలు జరుగుతున్నాయి. బొగ్గు మైనింగ్ కోసం బ్లాస్టింగ్స్ జరిపితే.. ఆ ప్రకంపణలు రామప్ప వరకూ వ్యాపిస్తాయని ఆందోళన వ్యక్తమవుతోంది.
ములుగు జిల్లా వెంకటాపూర్ మండల కేంద్రంలో సింగరేణి సంస్థ తొలిసారిగా బొగ్గు బ్లాక్ ప్రారంభించింది. 315 హెక్టార్ల అటవీ భూములను, 1,483హెక్టార్ల వ్యవసాయ, అసైన్డ్ భూములను సేకరిస్తున్నారు. రానున్న 19 ఏళ్లలో 40.43 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటికే సింగరేణి, రెవెన్యూ శాఖ అధికారులు భూసేకరణ చేపట్టారు. ఈ ఏడాది చివరినాటికి బొగ్గు ఉత్పత్తి ప్రారంభించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే సింగరేణి ఓపెన్ కాస్టు బ్లాస్టింగ్స్ వల్ల రామప్ప ఆలయ పునాదులు దెబ్బతినే ప్రమాదం ఉందని తెలుస్తోంది. టెంపుల్‌కు కేవలం 6 కిలోమీటర్ల దూరంలోనే సింగరేణి సంస్థ మైనింగ్‌కు ముందుకురావడం ఆందోళనకర అంశం.
గతంలోనూ ఇలాంటిదే ఓ ఘటన జరిగింది. 2016లో భూపాలపల్లి జిల్లా భీంగణపురం నుంచి రామప్ప వరకు దేవాదుల నీటిని తరలించేందుకు సొరంగం తవ్వాలని భావించారు. సొరంగం పనులకు బ్లాస్టింగ్ చేయాల్సిన అవసరం ఉండటంతో రామప్ప ఆలయానికి ప్రమాదం పొంచి ఉందని కేంద్ర పురావస్తు శాఖ అధికారులు తీవ్ర అభ్యంతరం చెప్పారు. తెలిపారు. స్థానికులు కూడా సొరంగం పనులను వ్యతిరేకించి ఆందోళనకు దిగారు. దీంతో ఆ పనులను నిలిపి వేసి, పైపులైన్ నిర్మాణంతో దేవాదుల నీటిని తరలిస్తున్నారు.
ఓపెన్ కాస్టులో బొగ్గు ఉత్పత్తి కోసం బాంబులతో బ్లాస్టింగ్ చేస్తారు. ఈ ప్రభావం భూగర్భం గుండా 10 కిలో మీటర్ల దూరం వరకూ ఉంటుందట. అందుకే, 6 కి.మీ. దూరంలో ఉన్న రామప్ప ఆలయానికి ప్రమాదం ఏర్పడవచ్చనే ఆందోళన వ్యక్తం అవుతోంది. వెంకటాపూర్ ఓపెన్‌కాస్టు ప్రభావంపై మరోసారి సర్వే చేసి, రామప్పకు ముప్పు లేదంటేనే కొనసాగించాలని, లేదంటే బొగ్గు తవ్వకాలు రద్దు చేయాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. మరి పాలకులు, అధికారులు ఏం నిర్ణయం తీసుకుంటారో..?
మరోవైపు, రామప్ప చారిత్రక సంపద సంరక్షణపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. యునెస్కో విధించిన గడువులోగా సమగ్ర సంరక్షణ చేపట్టాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఏఎస్ఐ, రాష్ట్ర పురావస్తుశాఖ, కలెక్టర్‌తో కమిటీ వేసి.. క్షేత్రస్థాయిలో కమిటీ పరిశీలించి నివేదిక సమర్పించాలని ఆదేశించింది.