బీజేపీ ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఒక లెక్క.. నెల్లూరులో ఒక లెక్క
posted on Nov 7, 2019 @ 5:32PM
భారతీయ జనతా పార్టీ ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఒకెత్తయితే నెల్లూరులో మాత్రం మరో ఎత్తు అని రాజకీయ విశ్లేషకులు అంటుంటారు. ప్రస్తుతం నెల్లూరు బీజేపీలో రెట్టింపు ఉత్సాహం నెలకొంది, జిల్లాకు చెందిన ముప్పవరపు వెంకయ్యనాయుడు ఓ సాధారణ ఏబివిపి కార్యకర్తగా రాజకీయ రంగ ప్రవేశం చేసి ఉపరాష్ట్రపతి వరకు ఎదిగారు. సింహపురికి తిరుగులేని పేరు ప్రతిష్టలు తెచ్చి పెట్టారు. జిల్లాకు చెందిన చాలా మంది నేతలకు రాష్ట్ర పదవవులు ఇప్పించారు. కాని, నెల్లూరులో బీజేపీ బలోపేతానికి కృషి చేసినా జిల్లాలో అంతగా పార్టీ పుంజుకోలేకపోయింది. ప్రస్తుతం ప్రాంతీయ పార్టీల కార్యకర్తలు ప్రజల ఆలోచనల్లో అనూహ్యంగా మార్పులొస్తున్నాయట. మెల్లమెల్లగా కమలం పార్టీకి దగ్గరయ్యే వారి సంఖ్య పెరుగుతోందట. అందుకే ఇప్పుడు నెల్లూరులో భారతీయ జనతా పార్టీకి ఒకప్పుడున్న పరిస్థితి వేరు, ఇప్పటి పరిస్థితి వేరుగా ఉందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
నెల్లూరు జిల్లా ప్రజలు ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి పదికి పది సీట్లు ఇచ్చారు. అయితే ప్రభుత్వ నిర్ణయాల పట్ల ప్రజల్లో నిరాసక్తి కనిపిస్తోందని వినికిడి. మరోవైపు ప్రత్యక్ష దాడులు ఆ పార్టీకి నష్టం కలిగిస్తున్నాయని విమర్శలు వినిపిస్తున్నాయి, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ బాధితులకు టిడిపి నుంచి సపోర్ట్ కూడా అంతగా లేదన్న భావనతో వారిలో పలువురు బిజెపి వైపు చూస్తున్నారని తెలుస్తోంది. టిడిపిలో ఎంతో కాలం పని చేసిన వారికి అక్కడ సరైన ఆదరణ కరువవడంతో బిజెపిలో చేరుతున్నారట. అలాంటి వారికి కమలం పార్టీ ముఖ్య నేతలు అండదండలు అందిస్తున్నారు. ఇలాంటి పరిస్థితులు టిడిపికి మైనస్ గా కనిపిస్తుండగా మరోవైపు అవే బిజెపికి ప్లస్ గా మారుతున్నాయని స్థానికంగా చర్చ జరుగుతోంది. కావలిలో టిడిపి ఓట్లు వేసినవారి ఇళ్లూ, దుకాణాలూ కూల్చివేసినప్పుడు బిజెపి నేతలే అండగా నిలిచారు. ఈ విషయంలో కమలం పార్టీ నాయకుల మధ్య పోటీ నెలకొంది, పార్టీ కార్యక్రమాలు ప్రజా పోరాటాల్లో వారు చాలా ఉత్సాహంగా పాల్గొంటున్నారు.
సీనియర్ నేత కందుకూరి వెంకట సత్యనారాయణకు జాతీయ స్థాయిలో పలుకబడి ఉంది. అయినప్పటికీ ప్రస్తుతం నెలకొన్న పోటీతత్వంతో ఆయన పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. జిల్లాలో సుమారు నూట ఎనభై కిలోమీటర్ల మేర పాదయాత్ర చేపట్టారు. గాంధీజీ సంకల్ప యాత్రలో భాగంగా జిల్లాలో చేపట్టిన ఈ పాదయాత్రకు మంచి స్పందనే వచ్చింది. దీంతో కమలం పార్టీ కేడర్ లో జోష్ పెరిగింది, స్థానిక నాయకులతో పాటు జిల్లాకొచ్చిన నేతలు వయసు మీద పడినా లెక్క చేయక పాదయాత్రను విజయవంతం చేశారన్న టాక్ వినిపించింది.
ఇదిలా ఉండగా కాంగ్రెస్, టిడిపిల్లో కీలకంగా వ్యవహరించిన ఎమ్మెల్సీ వాకాటి నారాయణ రెడ్డి ఇటీవలే బిజెపి తీర్థం పుచ్చుకున్నారు. జిల్లాలోని గూడూరు, సూళ్లూరుపేట ప్రాంతాల్లో వాకాటికి పెద్ద సంఖ్యలోనే అనుచరులున్నారు, వారంతా ఇప్పుడు టచ్ లోకి రావడమే కాకుండా బిజెపి లోకి వెళ్లేందుకు సన్నద్ధమయ్యారు. ఇప్పటికే ఆయన అనుచరులు చాలా మంది బీజేపీ కండువాలు కప్పేసుకున్నారు, పార్టీలో తగిన ప్రాధాన్యత ఇస్తుండటంతో అతి తక్కువ కాలంలోనే పార్టీలో కుదురుకున్నారు. దీంతో జిల్లాలోని తీరం వెంబడి తడ నుంచి సూళ్లూరుపేట, గూడూరు, నెల్లూరు, కోవూరు, కావలి వరకు పార్టీ ఓ రేంజ్ లో పుంజుకున్నట్టు కనిపిస్తోంది.
ఇక బిజెపి నుంచి గతంలో ఒంగోలు పార్లమెంట్ నుంచి పోటీ చేసిన కొండపల్లి గురవయ్యనాయుడు వంటి పాతతరం నేతలు కూడా ఇప్పుడు ఫుల్ యాక్టివ్ అవుతున్నారు. జిల్లా నేతలతో కలిసి మెట్ట ప్రాంతాల్లోనూ కమలం పార్టీని పటిష్టం చేసేందుకు సన్నాహాలు మొదలెట్టారు. మెట్ట ప్రాంతాలైన ఉదయగిరి, ఆత్మకూరు, వెంకటగిరి విషయానికొస్తే ఉదయగిరిలో గత ఎన్నికల్లో పోటీ చేసిన గుండ్లపల్లి భరత్ కుమార్ జోష్ కొనసాగిస్తున్నారు. ఇక ఆత్మకూరు వెంకటగిరి లోనూ పార్టీ అభివృద్ధికి జిల్లా ముఖ్య నేతలు, పాతతరం నేతలు గట్టిగానే కృషి చేస్తున్నారు. ఏకంగా పార్టీ జాతీయ అధ్యక్షుడు కేంద్ర మంత్రి అమిత్ షాని ఆత్మకూరుకు తీసుకొచ్చి భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారని సమాచారం.
ఇటీవల నెల్లూరుకు వచ్చిన ఎంపీ సుజనా చౌదరి, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సత్యకుమార్, రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణలు జిల్లాలో పార్టీ బలపడుతుండటాన్ని చూసి ముచ్చట పడ్డారు. వారు లోలోపల చాలా ఆనందపడ్డారట. ఇదే జోష్ తో ముందుకు సాగితే పార్టీకి తిరుగే ఉండదని, ప్రాంతీయ పార్టీల వల్ల కలిగే నష్టాలను అధిగమించటానికి గాంధీజీ ఆశయాలను కొనసాగించడానికి ప్రధాని నరేంద్ర మోదీ చేస్తున్న కృషిని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని పార్టీ నేతలు సూచించారట. మొత్తం మీద నెల్లూరు జిల్లాకు సంబంధించి గతంలో బిజెపిలో చేరికలు పెద్దగా ఉండేవి కావు కానీ, ఇప్పుడు కార్యకర్తల దగ్గర నుంచి నేతల వరకు చేరికలు బాగా పెరిగాయి. ఆ పార్టీకి ఇది శుభ పరిణామమే ఇదే విధంగా ముందుకెళ్తే పార్టీకి మంచి రోజులే ఉండొచ్చని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.