జగన్ ఏజెంట్ గా సీఐడీ సునీల్ కుమార్!
posted on May 15, 2021 @ 8:01PM
ఆంధ్రప్రదేశ్ లో సీబీసీఐడీ వ్యవహరిస్తున్న తీరు దారుణంగా ఉందన్నారు టీడీపీ మాజీ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్. సీఎం జగన్ ఏజెంట్ గా సీఐడీ చీఫ్ సునీల్ కుమార్ వ్యవహరిస్తున్నాయని ఆయన ఆరోపించారు.ఆల్ ఇండియా సర్వీసులనుంచి వచ్చే అధికారులు నిష్పక్షపాతంగా, నిర్భయంగా, నిజాయితీతో వ్యవహరించాలని.. కాని దురదృష్టవశాత్తూ ఆంధ్రప్రదేశ్ లో అలా జరగడంలేదని అన్నారు. ఐపీఎస్, ఐఏఎస్ లుగా ఉన్నవారు తమకులభించే పదవులు, రిటైర్మెంట్ తర్వాత ఒనగూరే ప్రయోజనాల గురించి ఆలోచిస్తూ, పాలకుల రాజకీయ కక్షసాధింపుల్లో భాగస్వాములవుతున్నారని విమర్శించారు. సీబీసీఐడీ అధికారి సునీల్ కుమార్ పై అతని భార్య పెట్టిన కేసులను ప్రభుత్వం తనకు అనుకూలంగా మార్చుకొని, అతన్ని ఆయుధంగా చేసి కక్షసాధింపులకు వాడుకుంటోందని శ్రావణ్ కుమార్ ఆరోపించారు.
సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారని 60ఏళ్ల మహిళపై అత్యుత్సాహం చూపిన సీబీసీఐడీ, న్యాయస్థానాలను అవమానించేలా, న్యాయమూర్తులనుదూషిస్తూ మాట్లాడినవారిపై ఇప్పటివరకు ఎందుకు చర్యలు తీసుకోలేదని తెనాలి శ్రావణ్ కుమార్ ప్రశ్నించారు. ప్రభుత్వ ఆదేశాలతో దూకుడుగా వ్యవహరించే సీబీసీఐడీ, రాష్ట్ర హైకోర్ట్ ఆదేశాలనుఎందుకు ఖాతరు చేయడంలేదని ఆయన నిలదీశారు. కులాల ప్రస్తావనచేసిన ముఖ్యమంత్రి, మంత్రులు, ఇతర ప్రభుత్వ పెద్దలపై సీబీసీఐడీ ఎందుకుచర్యలు తీసుకోలేదని అన్నారు.
దళితులకు శిరోముండనాలుచేసి, వారిని అవమానించిన వారిని సీబీసీఐడీ ఏంచేసిందని శ్రావణ్ కుమార్ ప్రశ్నించారు. సునీల్ కుమార్ సీబీసీఐడీ అధికారిగా పనికిరాడని, ఆయన్ని తక్షణమే ఆ బాధ్యతలనుంచి తప్పించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి కొమ్ముకాసే సునీల్ కుమార్ లాంటి అధికారులంతా ఒక్కసారి వారు భవిష్యత్ తో ఎదుర్కోబోయే సమస్యల గురించి ఆలోచిస్తే మంచిదని శ్రావణ్ కుమార్ సూచించారు.