మేలో కేసీఆర్ కేబినెట్ ప్రక్షాళన! ఐదారుగురు మంత్రులు అవుట్
posted on Apr 3, 2021 @ 5:16PM
తెలంగాణ ప్రభుత్వంలో మార్పులు జరగనున్నాయా? కేబినెట్ ను కేసీఆర్ పునర్వ్యవస్థీకరించనున్నారా? అంటే టీఆర్ఎస్ వర్గాలు మాత్రం అవుననే అంటున్నాయి. తన మంత్రివర్గంలో కేసీఆర్ మార్పులు చేయబోతున్నారని చాలా కాలంగా ప్రచారం జరుగుతోంది. అయితే ఈసారి మాత్రం పక్కా అంటున్నారు గులాబీ లీడర్లు. దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నిక, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో బీజేపీ దూకుడుతో కారు పార్టీ కంగారు పడింది. అయితే రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయంతో మళ్లీ అధికార పార్టీలో జోష్ వచ్చింది. దీంతో కేబినెట్ లో మార్పులు చేసి.. వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు బలమైన టీమ్ తో వెళ్లాలని కేసీఆర్ డిసైడ్ అయ్యారని అంటున్నారు.
ఏప్రిల్ 17న నాగార్జున సాగర్ ఉప ఎన్నిక జరుగుతుంది. మేలో ఏడు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నిక జరగనుంది.ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీలుగా ఉన్న సుఖేందర్ రెడ్డి, డిప్యూటీ ఛైర్మన్ నేతి విజయసాగర్, ఆకుల లలిత, కడియం శ్రీహరి, మహ్మద్ ఫరీదుద్దీన్, చీఫ్ విప్ బోడుకూడి వెంకటేశ్వర్లు కాల పరిమితి జూన్ మొదటి వారానికి ముగుస్తుంది. జూన్ 17కు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా ఎంపికైన మాదిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి పదవి కాలం ముగియనుంది. ఈ ఖాళీలను భర్తీ చేసిన వెంటనే మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణ ఖాయం అంటున్నాయి ప్రభుత్వ వర్గాలు. ఇందుకోసం ఇప్పటికే కేసీఆర్ కసరత్తు కూడా మొదలు పెట్టారని చెబుతున్నారు.
2018 డిసెంబర్ లో రెండో సారి అధికారం చేపట్టారు కేసీఆర్. అప్పుడు తన కేబినెట్ లో 11 మందికి చోటు కల్పించారు. 2019 సెప్టెంబర్‌లో జరిపిన విస్తరణలో... కేసీఆర్... ఆరుగురు మంత్రులను అదనంగా కేబినెట్‌లో చేర్చుకున్నారు. ప్రస్తుతం తెలంగాణ మంత్రివర్గంలో ఖాళీలు లేవు. కొత్త వారిని తీసుకోవాలంటే కొందరిని తొలగించాల్సిందే. వేటు పడే మంత్రుల జాబితాలో మేడ్చల్ జిల్లాకు చెందిన మల్లారెడ్డి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. మల్లారెడ్డి పనితీరు, ఆయన వస్తున్న భూదందా ఆరోపణలతో ఆయనను తప్పించడం ఖాయమంటున్నారు. మల్లారెడ్డి స్థానంలో అదే సామాజిక వర్గానికి చెందిన, ఇటీవల జరిగిన నల్గొండ ఎమ్మెల్సీ స్థానంలో రెండో సారి గెలుపొందిన పల్లా రాజేశ్వర్ రెడ్డిని తీసుకోవడం దాదాపుగా ఫైనల్ అయిందంటున్నారు. కేసీఆర్ కు పల్లా అత్యంత సన్నిహితుడు కావడంతో ఆయనకు బెర్త్ ఖాయమని రాజకీయ వర్గాల్లోనూ చర్చ జరుగుతోంది. కొన్ని నెలల క్రితం ఆరోపణలు ఎదుర్కొన్న కరీంనగర్ జిల్లాకు చెందిన గంగుల కమలాకర్ కు వేటు తప్పదంటున్నారు. ఆయన్ని తొలగిస్తే.. ప్రభుత్వ చీఫ్ విప్ గా ఉన్న దాస్యం వినయ్ భాస్కర్ కేబినెట్ లోకి వస్తారంటున్నారు. వరంగల్ కార్పొరేషన్ ఎన్నికలు జరగాల్సి ఉండటంతో.. వినయ్ భాస్కర్ కు ప్రమోషన్ ఖాయమని అంటున్నారు.
కరీంనగర్ జిల్లాకే చెందిన సీనియర్ మంత్రి ఈటల రాజేందర్ ను కూడా తప్పించవచ్చనే చర్చ జరుగుతోంది. ఇటీవల కాలంలో సంచలన కామెంట్లు చేస్తూ అధినాయకత్వాన్ని ఇబ్బందుల్లో పడేస్తున్నారు రాజేందర్. దీంతో ఆయన్ను తప్పించాలని కేసీఆర్ భావిస్తున్నారని సమాచారం. ఈటలను తొలగిస్తే.. ఆయన స్థానంలో బీసీ వర్గానికి చెందిన వ్యక్తికే అవకాశం రానుంది. గ్రేటర్ కు చెందిన దానం నాగేందర్, నిజామాబాద్ జిల్లాకు చెందిన బాజిరెడ్డి గోవర్ధన్ పేర్లు వినిపిస్తున్నాయి. కరీంనగర్ జిల్లాకే చెందిన మరో మంత్రి కొప్పుల ఈశ్వర్ కు గండం ఉందంటున్నారు. కొప్పుల పనితీరుపై కేసీఆర్ తీవ్ర అసంతృప్తిగా ఉన్నారట. కొప్పులను తప్పిస్తే... ఖమ్మం జిల్లాకు చెందిన సండ్ర వెంకట వీరయ్యకు కేబినెట్ బెర్త్ దక్కవచ్చంటున్నారు. చెన్నూరు ఎమ్మెల్యే బాల్కసుమన్, అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు కూడా మంత్రి రేసులో ఉన్నారు. వీళ్లిద్దరు ప్రస్తుతం విప్ లుగా కొనసాగుతున్నారు. సండ్రను కాదనుకుంటే సుమన్, బాలరాజులో ఒకరికి మంత్రివర్గంలో చోటు ఉండే అవకాశం ఉంది.
హైదరాబాద్ స్థానంలో ఎమ్మెల్సీగా సంచలన విజయం సాధించిన పీవీ నరసింహరావు కూతురు సురభీ వాణిదేవీకి ప్రమోషన్ ఖాయమంటున్నారు. అయితే ఆమెను కేబినెట్ లోకి తీసుకుంటారా లేక మండలి చైర్మెన్ చేస్తారా అన్నది సస్పెన్స్ గా ఉందని తెలుస్తోంది. విధాన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి పదవి కాలం జూన్ తో ముగియనుంది. ఆయనకు ఎమ్మెల్సీగా మరో అవకాశం ఇస్తే.. ఆయనే మండలి చైర్మెన్ గా ఉండే అవకాశం ఉంది. అప్పుడు వాణిదేవీని మండలి డిప్యూటీ చైర్మెన్ చేయవచ్చంటున్నారు. గుత్తాను కేబినెట్ లోకి తీసుకుని... సురభిని మండలి చైర్మెన్ చేసే అవకాశాలు ఉన్నాయంటున్నారు. అయితే గుత్తాను కేబినెట్ లోకి తీసుకుంటే.. జగదీశ్ రెడ్డి పదవికి ముప్పు రావొచ్చని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. ఖమ్మం మాజీ ఎంపీ శ్రీనివాస్ రెడ్డి, మాజీ మంత్రి, జడ్జెర్ల ఎమ్మెల్సీ సీ లక్ష్మా రెడ్డి, ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖా నాయక్ పేర్లు మంత్రివర్గ రేసులో వినిపిస్తున్నాయి.
కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవిత పేరు కూడా తెరపైకి వచ్చింది. ఆమె ఈమధ్యే నిజామాబాద్ స్థానిక నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. కవితను కేబినెట్ లోకి తీసుకుంటే మాత్రం... నిజామాబాద్ జిల్లాకు చెందిన వేముల ప్రశాంత్ రెడ్డికి ఉద్వాసం ఖాయమే. అయితే ప్రస్తుతం కేసీఆర్ కుటుంబం నుంచి కొడుకు కల్వకుంట్ల తారాక రామారావు , మేనల్లుడు టి.హరీశ్ రావు... కేబినెట్‌లో మంత్రులుగా సేవలు అందిస్తున్నారు. ఇప్పుడు కవితకు కూడా ఛాన్స్ ఇస్తే... కుటుంబ పాలన అంటున్న కాంగ్రెస్ లాంటి ప్రతిపక్షాలు మరింతగా విమర్శల దాటిని పెంచే అవకాశం ఉంది. ఈ లెక్కన కవితను కేబినెట్ లోకి తీసుకోకపోవచ్చనే అభిప్రాయం విశ్లేషకుల నుంచి వినిపిస్తోంది.