ఏపీలో వైసీపీ అరాచకాలు.. అమిత్ షాకు చంద్రబాబు ఫోన్
posted on Oct 19, 2021 @ 7:25PM
ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ కార్యాలయాలు, టీడీపీ నేతలపై ఇండ్లపై వైసీపీ శ్రేణులు దాడులకు పాల్పడటం తీవ్ర ఉద్రిక్తతలు స్పష్టిస్తోంది. టీడీపీ కేంద్ర కార్యాలయంతో పాటు నెల్లూరు టీడీపీ కార్యాలయంపై దాడి జరిగింది. విజయవాడలోని టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభీ, హిందూపురంలో ఎమ్మెల్యే బాలకృష్ణ, కడపలో సీనియర్ నేత అమీర్ బాబు నివాసాలపై దాడి జరిగింది. వైసీపీ నేతల దాడులతో పార్టీ కేంద్ర కార్యాలయానికి హుటాహుటిన చేరుకున్నారు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు. పట్టాభితో పాటు పార్టీ కార్యకర్తలతోనూ మాట్లాడారు. దాడి వివరాలను చంద్రబాబుకు టీడీపీ శ్రేణులు వివరించారు. చంద్రబాబు వెంట దేవినేని ఉమ, కొల్లు రవీంద్ర, ముఖ్యనేతలు కూడా కేంద్ర కార్యాలయానికి చేరుకున్నారు.
ఇక కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు చంద్రబాబు ఫోన్ చేశారు. టీడీపీ నేతలు, కార్యాలయాలపై పక్కా ప్రణాళిక ప్రకారం దాడులు చేయిస్తున్నారని అమిత్‌షాకు చంద్రబాబు ఫిర్యాదు చేశారు. దాడి విషయం తన దృష్టికి రాలేదని అమిత్ షా తెలిపారు. పార్టీ ప్రధాన కార్యదర్శి ద్వారా లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేస్తే తప్పకుండా చర్యలు తీసుకుంటామని అమిత్ షా హామీ ఇచ్చారు. టీడీపీ కార్యాలయానికి కేంద్ర భద్రతాబలగాల రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఏపీ పోలీస్ అధికారులతో మాట్లాడతానని చంద్రబాబుకు అమిత్‌షా హామీ ఇచ్చారు