టీడీపీ కార్యాలయాలు, నేతల ఇండ్లపై వైసీపీ దౌర్జన్యకాండ.. జగన్ రెడ్డి అరాచక పాలన!
posted on Oct 19, 2021 @ 7:16PM
ఆంధ్రప్రదేశ్ రౌడీ రాజ్యంగా మారిపోయిందా? అరాచకాలకు కేరాఫ్ గా మారిందా? అటవిల పాలన సాగుతోందా? అంటే కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలు అవుననే చెబుతున్నాయి. మంగళవారం ఏపీలో చోటు చేసుకున్న ఘటనలతో జగన్ రెడ్డి పాలనలో ఆంధ్రప్రదేశ్ లో అరాచక రాజ్యం సాగుతుందనే ఆరోపణలు వస్తున్నాయి. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తున్న నేతలే టార్గెట్ గా వాళ్ల ఇండ్లపై వైసీపీ కార్యకర్తలు దాడులకు దిగారు. టీడీపీ కార్యాలయాలపైనా దాడికి పాల్పడి బీభత్సం స్పష్టించారు.
ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అధికార వైసీపీ నేతలు కార్యకర్తలు రెచ్చిపోయారు. బహిరంగంగానే దౌర్జన్యకాండకు దిగారు. టీడీపీ కార్యాలయాలు, నేతలపై వైసీపీ శ్రేణులు దాడులకు దిగాయి. పక్కా ప్రణాళికతో టీడీపీ కార్యాలయాలు, నేతల ఇళ్లపై దాడులు చేశారు. టీడీపీ కేంద్ర కార్యాలయంపై వైసీపీ నేతలు దాడి చేశారు. గేట్లు నెట్టుకొని టీడీపీ కేంద్ర కార్యాలయం లోపలికి వైసీపీ శ్రేణులు వెళ్లారు. కార్యాలయంలో కనపడినవారిపై దాడి, అద్దాలు పూర్తిగా ధ్వంసం చేశారు. విశాఖ, తిరుపతి, గుంటూరులోని టీడీపీ కార్యాలయాలపైనా వైసీపీ శ్రేణులు దాడులు చేశారు.
నెల్లూరు జిల్లా టిడిపి కార్యాలయం పై వైసీపీ కార్యకర్తలు దాడికి యత్నించారు. 200 మంది మారణాయుదాలతో టిడిపి కార్యాలయం ముట్టడించారు, అప్రమత్తం అయిన నెల్లూరు టిడిపి నాయకులు వైసీపీ కార్యకర్తలను ధీటుగా ఎదుర్కొన్నారుటీడీపీ కార్యాలయాల పై దాడిని నపుంసక చర్యగా అభివర్ణించారు టిడిపి జిల్లా అధ్యక్షుడు అజీజ్. రాష్ట్ర ప్రజల సమస్యల పై మాట్లాడటం ప్రతిపక్షం హక్కన్నారు. గంజాయి, హెరాయిన్ పై మాట్లాడితే దాడికి పాల్పడటం పిరికి పంద చర్య అన్నారు అజీజ్.
ఇక విజయవాడలో టీడీపీ నేత పట్టాభి నివాసంపై కూడా దాడి జరిగింది. అతని ఇంట్లోని పలు విలువైన వస్తువులు ధ్వంసం చేశారు. హిందూపురం లో బాల కృష్ణ ఇంటి మీద, కడప లో వైసీపీ సీనియర్ నేత అమీర్ ఇంటి మీద దాడులు జరిగాయి. విషయం తెలుసుకున్న టీడీపీ అధినేత చంద్రబాబు టీడీపీ కేంద్ర కార్యాలయానికి బయల్దేరారు. టీడీపీ కార్యాలయంపై దాడి జరగడంతో చంద్రబాబు హుటాహుటిన బయల్దేరారు.
హిందూపురంలో ఎమ్మెల్యే బాలకృష్ణ ఇంటి ముట్టడికి వైసీపీ నేతల యత్నించారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డిపై టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి వ్యాఖ్యలను నిరసిస్తూ బాలకృష్ణ ఇంటి ముందు బైఠాయించారు. బాలకృష్ణకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ఇక రేణిగుంటలో విద్యుత్ ఛార్జీలపై టిడిపి చేపట్టిన నిరసన ర్యాలీ రసాబసగా మారింది. ప్రశాంతంగా ర్యాలీ నిర్వహిస్తున్న టిడిపి నాయకుల పై వైసీపీ కార్యకర్తలు దాడి చేశారు. టిడిపి ర్యాలీలో పాల్గొన్న తిరుపతి పార్లమెంట్ టిడిపి అధ్యక్షుడు నరసింహ యాదవ్, శ్రీకాళహస్తి టిడిపి నియోజకవర్గ ఇన్చార్జ్ బొజ్జల సుధీర్ రెడ్డి పై చెప్పులను విసిరారు వైసీపీ నాయకులు. చీపుర్లతో చెప్పులను టిడిపి నాయకుల పై విసిరేశారు వైసీపీ మహిళా కార్యకర్తలు. వైసీపీ కార్యకర్తలు నిలువరించడంలో పోలీసులు పూర్తిగా విఫలమయ్యారు. వైసీపీ కార్యకర్తల దాడులతో భయాందోళనకు గురైన వ్యాపారులు.. షాపులను మూసేశారు.