తూతూమంత్రంగా అసెంబ్లీ! బహిష్కరించిన టీడీపీ
posted on May 18, 2021 @ 6:14PM
ఏపీ శాసనసభ సమావేశాలు రాజకీయ రచ్చగా మారాయి. ఒక రోజు మాత్రమే సభ నిర్వహించాలన్న జగన్ ప్రభుత్వ నిర్ణయంపై ప్రతిపక్ష తెలుగు దేశం పార్టీ మండిపడుతోంది. అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించాలని టీడీపీ నిర్ణయం తీసుకుంది. తూతూమంత్రంగా ఒక రోజు జరిపే అసెంబ్లీ సమావేశాలకు తాము హాజరుకాలేమని టీడీపీ నేతలు స్పష్టం చేశారు. 6 నెలలు సమావేశాలు నిర్వహించకపోతే ప్రభుత్వం కుప్పకూలుతుందన్న.. ఆందోళనతో అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తున్నారని టీడీపీ శాసనసభా పక్ష ఉపనేత అచ్చెన్నాయుడు విమర్శించారు. 2 లక్షల 11 వేల ఏపీలో బడ్జెట్‌పై విపులంగా చర్చ జరగాలని, తూతూమంత్రంగా చేయాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోందని తప్పుబట్టారు. అందుకే సమావేశాలను బహిష్కరించాలని నిర్ణయించామని అచ్చెన్నాయుడు తెలిపారు. కరోనా కట్టడి కోసం సీఎం జగన్.. రాష్ట్రంలో వైద్య నిపుణులతో ఒక్కసారి అయినా మీటింగ్ పెట్టారా అని ప్రశ్నించారు. వ్యాక్సిన్ పంపిణీలోనూ ప్రభుత్వం ఘోరంగా ఫెయిలైందని విమర్శించారు. మందులు, బెడ్స్, ఆహారం లేక ప్రజలు చేస్తున్న ఆర్తనాదాలు వినిపించడం లేదా అని ప్రశ్నించారు. కరోనా సమస్యలు వెలుగులోకి వస్తాయనే భయంతోనే.. అసెంబ్లీ జరగకుండా ఒక్కరోజుకే పరిమితం చేస్తున్నారని అచ్చెన్నాయుడు ఆరోపించారు.
కరోనా యాక్టివ్ కేసులు ఉన్న సమయంలో అసెంబ్లీ సమావేశాలను ఎలా నిర్వహిస్తారు?.. మార్చిలో 900 కేసులు ఉంటే అప్పుడెందుకు నిర్వహించలేదు? అని టీడీపీ శాసనమండలి ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు అయ్యిందని.. ఈ రెండేళ్లలో ఎన్నిసార్లు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించారని ఆయన ప్రశ్నించారు. బడ్జెట్ సమావేశాలు పెట్టి బిల్లు ఆమోదించుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనే ఉంటుందని.. కానీ ఆర్డినెన్స్ ద్వారా బడ్జెట్ సమావేశాలను గతంలో చూశాం.. మరి మార్చిలోనే బడ్జెట్ పెట్టాలి. అప్పుడు టీడీపీ కూడా సమావేశాలు పెట్టమని చెప్పినా.. ప్రభుత్వం పట్టించుకోలేదని గుర్తు చేశారు. అప్పుడు కరోనా పేరు చెప్పి అసెంబ్లీ సమావేశాలను వాయిదా వేసిన ప్రభుత్వం.. ఇప్పుడు కరోనా సమయంలో ఎలా సమావేశాలు నిర్వహిస్తోందని యనుమల ప్రశ్నించారు.
గురువారం అసెంబ్లీలో ఏపీ ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశ పెట్టనుంది. ఇప్పటికే మూడు నెలల కాలానికి ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ను ఆర్డినెన్స్ ద్వారా అమలు చేస్తోన్న ప్రభుత్వం… మిగిలిన 9 నెలల కాలానికి ఈ నెల 20వ తేదీన అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. బడ్జెట్ రూపకల్పనపై ప్రభుత్వం ఇప్పటికే కసరత్తు పూర్తి చేసింది. 2.28 లక్షల కోట్ల రూపాయల నుంచి 2.38 లక్షల కోట్ల రూపాయల మధ్యలో బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. గతేడాది ఆదాయ అంచనాలను చేరుకోలేకపోయింది ఏపీ ప్రభుత్వం. గతేడాదిసుమారు 1.82 లక్షల కోట్ల వ్యయం కాగా.. ఆదాయం కేవలం 77,560 కోట్లు మాత్రమే అంటున్నారు అధికారులు. గతేడాది 1 లక్ష కోట్లకు పైగా బడ్జెట్ లోటు ఉందంటున్నారు ఆర్ధిక శాఖ అధికారులు. ఈ ఆర్ధిక సంవత్సరంలోనూ ఆదాయ-వ్యయాలు గతేడాది రీతినే ఉండొచ్చంటోంది ఆర్ధిక శాఖ. బడ్జెట్ లోటును ఏ మేరకు చూపాలనే దానిపై అధికారుల తర్జన భర్జన పడుతున్నారు.