కరోనా ఖర్చు తలకు లక్షన్నర..
posted on May 18, 2021 @ 7:16PM
కరోనా సెకండ్ వేవ్, ఆరోగ్య పరంగానే కాదు, ఆర్థిక పరంగాను, కుటుంబాలను పిండేస్తోంది. సెకండ్ వేవ్’లో కేసుల సంఖ్య ఎక్కువగా ఉండడం ఒకటైతే, కుటుంబంలో ఒకరి సోకితే, ఇంటిల్లి పాదినీ చుట్టేస్తోంది. అంతే కాదు, ఈ సారి హాస్పిటల్ కేసులు కూడా ఎక్కువగా ఉంటున్నాయి. ఒకే కుటుంబానికి చెందిన వ్యక్తులు ఒకరు ఒక ఒక ఆసుపత్రిలో ఇంకొకరు ఇంకొక ఆసుపత్రిలో, ఒకరు ఐసీయులో ఇంకొకరు ఆక్సిజన్ బెడ్ మీద ఇలా ... ఎవరు ఎలా ఉన్నారో తెలుసుకునే వీలు లేని బాధాకరమైన పరిస్థితుల్లో ఎన్నో కుటుంబాలు, కుమిలిపోతున్నాయి.
కుటుంబాల మీద పడుతున్న ఆర్థిక భారం కూడా పేద ప్రజలే కాదు, మధ్య తరగతి ప్రజలకు కూడా భరించ లేని భారంగా మారింది. ఇందుకు సంబంధించి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం కరోనా సెకండ్ వేవ్’లో సాధారణ ప్రజలపై వైద్య భారం చాలా ఎక్కువగా వుంది. సెకండ్ వేవ్’లో కరోనా సోకినా వారిలో 30 శాతం మందికి పైగా, అనివార్యంగా ఆసుపత్రులలో చేరుతున్నారు. ప్రైవేటు అసుపత్రులలలో చేరిన ప్రతి ఒకరికి, రూ. లక్షన్నర రూపాయల వరకు ఖర్చవుతున్నట్లు బ్యాంక్ అధ్యయనంలో తేలింది. మరోవంక కుటుంబ ఆరోగ్య వ్యయం 11 శాతం పెరిగింది.ఇదే సమయంలో రోజురోజుకు పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరల భారాన్ని సాధారణ ప్రజలు భరించాల్సి ఉంటుంది. కేంద్రం, రాష్ట్రాలు పెట్రోల్, డీజిల్‌పై పన్ను తగ్గించనిపక్షంలో.. రాబోయే రోజుల్లో ఇంధన వ్యయం మరింత పెరుగుతుందని, దీని ప్రభావం ఇతర ప్రాంతాల్లో కూడా కనిపిస్తుందని నివేదిక పేర్కొన్నది.
రాబోయే నెలల్లో ఆరోగ్య ఖర్చులు కూడా పెరుగుతాయని నివేదిక స్పష్టం చేసింది. ఖరీదైన మందులు, వైద్య ఉత్పత్తుల కారణంగా భారతీయ కుటుంబాలు మొత్తం రూ.15 వేల కోట్లు ఖర్చు చేస్తాయని, కరోనా బాధితుల్లో సగటున 30 శాతం మందికి ఆసుపత్రీ చికిత్స అనివార్యం అవుతుందని నెవేదిక పేర్కొంది.ఈ 30 శాతం మంది ప్రైవేటు ఆసుపత్రుల సేవలను తీసుకున్నందుకు అదనంగా రూ.35 వేల కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుందని పేర్కొన్నది. ఇవే కాకుండా, లాక్‌డౌన్‌లో ఉపాధి కోల్పోవడం వల్ల ప్రజల ఆదాయం రూ.16 వేల కోట్లు తగ్గుతుందని ఎస్‌బీఐ తన నివేదికలో తెలిపింది. ఈ విధంగా కరోనా సెకండ్ వేవ్ కారణంగా మొత్తం సాధారణ భారతీయ కుటుంబాలపై రూ. 6 వేల కోట్ల భారం పడుతుందని ఈ నివేదిక అంచనా వేసింది.