మోడీ కేబినెట్ లో తెలుగుదేశంకు దక్కే బెర్తులెన్ని? శాఖలేమిటి?
posted on Jun 6, 2024 @ 9:30AM
ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం కూటమి ఘన విజయం.. జాతీయ రాజకీయాలలో ఒక్క సారిగా చంద్రబాబు ప్రాధాన్యతను పెంచేసింది. 16 మంది ఎంపీలతో తెలుగుదేశం ఎన్డీయే కూటమిలో రెండో అతి పెద్ద పార్టీగా అవతరించింది. మరో వైపు బీజేపీకి సొంతంగా ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన స్థానాలు లభించకపోవడంతో కేంద్రంలో బీజేపీ నేతృత్వంలో ఎన్డీయే కూటమి ఏర్పడాలన్నా, ఏర్పడినా సుస్థిరంగా కొనసాగాలన్నా భాగస్వామ్య పక్షాలపై ఆధారపడక తప్పని పరిస్థితి. దీంతో ఎన్డీయేలో బీజేపీ తరువాత అత్యథిక స్థానాలున్న తెలుగుదేశం పార్టీ అధినేతగా చంద్రబాబు కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వ ఏర్పాటు, ఆ ప్రభుత్వ మనుగడకు అత్యంత కీలకంగా మారారు. దీంతో కేంద్ర కేబినెట్ లో తెలుగుదేశం పార్టీకి ఎన్ని బెర్తులు ఉంటాయి. అలాగే ఏ మంత్రిత్వ శాఖలు దక్కే అవకాశం ఉంది అన్న విషయంపై దేశ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది.
గతంలో ప్రధాని మోడీ, బీజేపీ అగ్రనేతలు తెలుగుదేశం పార్టీ ఎన్డీయే కూటమి భాగస్వామ్య పక్షం అయినా సరైన ప్రాధాన్యత ఇవ్వలేదు. విభజన సమస్యల పరిష్కారం కోసం అడిగితే ఎగతాళి చేశారు. ముఖ్యమంత్రి హోదాలో అప్పాయిట్ మెంట్ అడిగినా ఇవ్వలేదు. ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యింది. చంద్రబాబే కింగ్ మేకర్ అయ్యారు. ఏపీ ఎన్నికలలో ఘన విజయం తరువాత ఎన్డీయే సమావేశంలో పాల్గొనేందుకు వెళ్లిన చంద్రబాబుకు అఘండ స్వాగతం లభించింది. నాడు అప్పాయింట్ మెంట్ కూడా ఇవ్వకుండా దూరం పెట్టిన మోడీ ఇప్పుడు స్వయంగా ఆయనను ఆహ్వానించి పక్కన కూర్చోపెట్టుకున్నారు. ఎన్డీయే కన్వీనర్ గా బాధ్యతలు చేపట్టి సంకీర్ణ ప్రభుత్వం సజావుగా నడిచేందుకు సహకరించమని విజ్ణప్తి చేశారు. చంద్రబాబుగారూ మాట్లాడండి అంటూ ఎన్డీయే సమావేశంలో ఆయనకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు.
ఇక కేంద్ర కేబినెట్ లో తెలుగుదేశం కనీసం ఆరు బెర్తులు అడిగే అవకాశం ఉందని అంటున్నారు. ముఖ్యంగా ఐటీ, గ్రామీణాభివృద్ధి, ఆర్థిక శాఖ సహాయ మంత్రి పదవులను తెలుగుదేశం కోరే అవకాశం ఉందని అంటున్నారు. మొత్తం మీద తెలుగుదేశం పార్టీకీ, ఆంధ్రప్రదేశ్ కు గోల్డెన్ డేస్ వచ్చినట్లేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.