టీ-ముసాయిదాతో తేదేపాకు మరో అగ్ని పరీక్ష
posted on Nov 6, 2013 @ 2:05PM
తెదేపా రాష్ట్ర విభజనకు అనుకూలంగా లేఖ ఇచ్చినప్పటికీ, సీమాంధ్రలో కూడా పార్టీని కాపాడుకోక తప్పని పరిస్థితుల్లో కర్ర విరగకుండా పాము చావకుండా అన్నట్లు వ్యవహరిస్తూ రోజులు నెట్టుకొస్తోంది. అఖిలపక్ష సమావేశం గండాన్ని కూడా ఎలాగో గట్టెక్కినా మళ్ళీ త్వరలోనే తెలంగాణా ముసాయిదా లేదా వేరొకటి శాసనసభకు వచ్చినప్పుడు మరో అగ్ని పరీక్ష ఎదుర్కోక తప్పదు. అయితే అప్పుడు కూడా మళ్ళీ అటువంటి వ్యూహాన్నే అమలుచేయవచ్చును. అయితే తెలంగాణపై స్పష్టమయిన వైఖరి అనుసరించక పోవడం వలన ఆ పార్టీకి తెలంగాణాలో కోలుకోనంతగా నష్టం జరుగుతోంది.
ఇప్పటికే, పార్టీలో ఎర్రబెల్లి దయాకర్ రావు వంటి తెలంగాణా నేతలు పార్టీ అనుసరిస్తున్న తీరుపై గుర్రుగా ఉన్నారు. కడియం శ్రీహరి, నాగం జనార్ధన్ రెడ్డి వంటి తెలంగాణా నేతలు దైర్యం చేసి బయటకుపోయి పడుతున్న ఇబ్బందులను చూస్తున్న కారణంగానే పార్టీలో నేతలు బయటకి వెళ్లేందుకు జంకుతున్నారు. నేటికీ తెలంగాణాలో తెరాస, కాంగ్రెస్ పార్టీలు మినహా వేరే బలమయిన పార్టీలు లేకపోవడం కూడా తేదేపాకు వరంగా ఉందని చెప్పవచ్చును. కానీ వారు ఎల్లకాలం అలాగే పార్టీని అంటిపెట్టుకొని ఉంటారని చెప్పలేము.
త్వరలో తెలంగాణా ముసాయిదా రాష్ట్ర శాసనసభకు వచ్చినప్పుడు కూడా తమ పార్టీ ఇదే విధంగా వ్యవహరిస్తే కొంతమంది తెదేపాను వీడవచ్చును. అయితే వారు వెంటనే ఏ పార్టీలో చేరకుండా రానున్న ఎన్నికలలో స్వతంత్ర అభ్యర్ధులుగా పోటీ చేసేందుకే మొగ్గు చూపవచ్చును. పరిస్థితులు అంతవరకు రానీయకూదదని తెదేపా భావిస్తే రాష్ట్ర విభజన వ్యవహారంలో స్పష్టమయిన వైఖరి ప్రకటించవలసి ఉంటుంది. లేకుంటే రాజకీయ నేతలెవరూ కూడా పార్టీ కోసం తమ రాజకీయ భవిష్యత్తుని పణంగా పెట్టరనే సత్యం గ్రహించేసరికి సమయం మించిపోవచ్చును.