ఎంపీ గారి జోస్యం!
posted on Nov 6, 2013 @ 1:27PM
నిజామాబాద్ ఎంపీ మధు యాస్కి గౌడ్ అబద్ధాలతో జనాల చెవుల్లో పూలు పెట్టడంలో కేసీఆర్‌ని మించిపోయేట్టున్నాడు. నెలకోసారి మీడియా ముందుకు వచ్చి సీమాంధ్ర ప్రజల కడుపు మండేలా ఏదో ఒక మాట మాట్లాడి వెళ్ళపోయే ఆయన తాజాగా మరోసారి మీడియా ముందుకు వచ్చాడు. ఆ రావటం కూడా మామూలుగా రాలేదాయన. బోలెడన్ని అబద్ధాలు మూట కట్టి తెచ్చి మీడియా ముఖాన పారేసి చక్కా పోయారు.
ఇంతకీ ఈసారి ఆయన చెప్పిన అబద్ధాలు, ఊహాగానాలు, జోస్యాలు ఏమిటంటే, తెలంగాణ వచ్చుడు ఖాయమట. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లోనే తెలంగాణ బిల్లు ఆమోదమైపోతుందట. సరే, ఇంతవరకూ తెలంగాణ వాదులందరూ చేసే ఊహాగానాలే అని సరిపెట్టుకోవచ్చు. కానీ యాస్కి మరింత ముందడుగు వేశాడు. సీమాంధ్ర ఎంపీలందరూ రాజీనామాలు చేసినా, బిల్లుకి బీజేపీ మద్దతు ప్రకటించకపోయినా, జాతీయ స్థాయిలో వున్న ఇతర పార్టీలు సహకరించకపోయినా పార్లమెంటులో బిల్లు ఆమోదం పొందుతుందట. ఇంకో రెండు నెలల్లో అంటే జనవరిలో రెండు రాష్ట్రాలు ఏర్పడతాయట.
సీమాంధ్ర ఎంపీలు రాజీనామా చేస్తే కేంద్రంలో ప్రభుత్వమే ఉండే అవకాశం లేదు. సరే ఎంపీగారు చెబుతున్నారు కాబట్టి ఏమీ కాదనుకుందాం. బీజేపీ, ఇతర జాతీయ పార్టీలు మద్దతు ప్రకటించకుండా పార్లమెంటులో బిల్లు ఎలా ఆమోదం పొందుతుంది? ఆ లెక్కలేవో ఎంపీగారు వివరంగా చెబితే తెలంగాణ ప్రజలతోపాటు సీమాంధ్ర ప్రజలు కూడా ధన్యులైపోతారు. ఏదో ఒకటి మాట్లాడి వార్తల్లో ఉండే ప్రయత్నమే తప్ప మధు యాస్కి చెప్పిన జోస్యం ఫలించేది కాదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. వచ్చే ఎన్నికలలో మధు యాస్కీకి నిజామాబాద్ పార్లమెంట్ స్థానం టిక్కెట్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చే అవకాశాలు కనిపించడం లేదు. తనలాగే అబద్ధాలు, ఫలించని జోస్యాలు చెప్పే కేసీఆర్ దృష్టిని ఆకర్షించడానికే యాస్కి ఇలాంటి జోస్యాలు చెబుతూ ఉండవచ్చు.