తెదేపా-బీజేపీల మధ్య దూరం పెరుగుతోందా?
posted on Jan 8, 2015 @ 10:29AM
తెలుగుదేశం-బీజేపీ పార్టీల మధ్య సంబంధాలు పైకి దృడంగానే కనిపిస్తున్నప్పటికీ వాటి మధ్య క్రమంగా దూరం పెరుగుతున్నట్లు కనబడుతోంది. తెదేపా-బీజేపీల మధ్య దూరం పెరుగుతుండటానికి కారణాలు అందరికీ తెలిసినవే. రాష్ట్రంలో బీజేపీ బలపడాలని ప్రయత్నిస్తుండటం, రాష్ట్రానికి హామీ ఇచ్చిన అనేక పధకాలు, ప్రాజెక్టులు, ప్రత్యేక హోదా, రైల్వే జోన్ ఏర్పాటు, నిధులు విడుదల వంటి అంశాలపై ఎన్డీయే ప్రభుత్వంలో ఎటువంటి కదలిక లేకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం కొంత అసహనానికి లోనవడం చాలా సహజమే. అయితే వాటి అమలుకు అనేక సాంకేతిక సమస్యలు అవరోధంగా నిలుస్తున్న సంగతి రాష్ట్ర ప్రభుత్వానికి కూడా తెలుసు కనుక కేంద్రాన్ని నిందించలేదు.
రాష్ట్రంలో ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదిగేందుకు బీజేపీ చేస్తున్న ప్రయత్నాలు బహుశః తెదేపాను కలవరపరుస్తూ ఉండవచ్చును. కానీ ఒక రాజకీయ పార్టీగా బీజేపీకి ఆ హక్కు ఉంటుంది గనుక ఈ విషయంలో కూడా దానిని తప్పు పట్టలేదు. బహుశః ఈ పరిణామాలతో తెదేపా ఒత్తిడికి గురవుతుండవచ్చును.
అదేవిధంగా రాష్ట్రంలో ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదగాలని తహతహలాడుతున్న బీజేపీ, ప్రజాధారణ పొందాలంటే రాష్ట్రాభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అన్ని విధాల సహాయం చేస్తోందనే విషయం ప్రజలకి నొక్కి చెప్పడం చాలా అవసరం. బీజేపీకి చెందిన కేంద్రమంత్రులు వెంకయ్యనాయుడు, నిర్మలా సీతారామన్, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు కె.హరిబాబు తదితరులు అదే విషయాన్ని పదేపదే నొక్కి చెప్పడానికి కారణం కూడా అదే. కానీ కేంద్ర ప్రభుత్వ సహాయంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న, అమలుచేస్తున్న అనేక పధకాలు, ప్రాజెక్టులు, కార్యక్రమాలలో మిత్రపక్షమయిన తమకు ఎటువంటి ప్రాధాన్యత ఈయకపోవడం వలన రాష్ట్ర బీజేపీ నేతలు అసంతృప్తికి గురవుతున్నారనే విషయం మొన్న పురందేశ్వరి వ్యాఖ్యలతో బహిర్గతం అయింది.
ప్రజలకు మరింత చేరువయ్యి వారి అభిమానం పొందే ప్రయత్నంలో రాష్ట్ర ప్రభుత్వం బీజేపీని మరిచిన మాట వాస్తవం. అయితే అది ఉద్దేశ్యపూర్వకంగా చేసింది కాదని అందరికీ తెలుసు. కానీ రాష్ట్రంలో బలపడాలనుకొంటున్న బీజేపీ మిత్రపక్షమయిన తెదేపాను విమర్శిచడం సబబు కాదు. కానీ రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాలలో తమకూ ప్రాధాన్యత కల్పించినపుడే ప్రజాధారణ పొందగలుగుతుంది కనుక ఆ విధంగా విమర్శించి ఉండవచ్చును.
ఎయిమ్స్; ఐ.ఐ.టి.; ఐ.ఐ.యం., కాకినాడ నుండి చెన్నై వరకు అంతర్గత జలరవాణ వ్యవస్థ ఏర్పాటు వంటి వాటికి కేంద్రం చొరవ చూపిన కారణంగానే త్వరలోనే ఆ పనులు మొదలవ్వబోతున్నాయి. రాష్ట్రాభివృద్ధికి కేంద్రం అందిస్తున్న ఈ సహాయ సహకారాల గురించి చెప్పుకొని బీజేపీ ప్రజలకు చేరువవ్వాలని భావిస్తోంది. కానీ ఆ పార్టీ నేతలెవరూ కూడా ఇంతకాలంగా ఆ విషయాల గురించి గట్టిగా చెప్పుకోకుండా నిర్లక్ష్యం ప్రదర్శించారు. అందువలన వారు ఇప్పుడు మీడియా ముందుకు వచ్చి రాష్ట్ర ప్రభుత్వాన్ని నిందించడం కంటే ఇటువంటి విషయాలను నేరుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకు వచ్చి పరిష్కరించుకొంటే మంచిది. అదేవిధంగా రాష్ట్రాభివృద్ధికి కేంద్రం సహాయ సహకారాలు చాలా అవసరం కనుక రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర బీజేపీ నేతలకి తగినంత ప్రాధాన్యం ఇవ్వడం మంచిది. రాష్ట్రంలో తమ పార్టీ బలపడాలని వారు గట్టిగా కోరుకొంటున్నట్లయితే కేంద్రంపై ఒత్తిడి తెచ్చి రాష్ట్రాభివృద్ధికి వీలయినంత సహాయ సహకారాలు దక్కేలా చేయగలిగితే ప్రజలు వారిని కూడా ఆదరిస్తారు.
అయినా ఎన్నికలకి ఇంకా నాలుగున్నరేళ్లు మిగిలి ఉండగా ఇప్పటి నుండి ఒకరిపై మరొకరు కత్తులు దూసుకోవడం వలన ఇరు పార్టీలకి, రాష్ట్రానికి కూడా నష్టమే తప్ప ఎటువంటి లాభమూ ఉండబోదు. ఒకవేళ ఆ రెండు పార్టీలు మిగిలిన ఈ నాలుగున్నరేళ్ళలో రాష్ట్రాభివృద్ధి చేయడంలో ఏ మాత్రం విఫలమయినా వేరెవరో దాని వలన లబ్ది పొందే అవకాశం ఏర్పడుతుందనే సంగతి గ్రహిస్తే మంచిది.