పొరుగింటికి నిప్పు పెట్టాలని చూస్తున్న పాకిస్తాన్
posted on Jan 7, 2015 8:51AM
పాకిస్తాన్ ప్రభుత్వం ఉగ్రవాదానికి వ్యతిరేకంగా చేస్తున్న పోరాటానికి మెచ్చి అమెరికా ప్రభుత్వం ఇటీవలే 150కోట్ల డాలర్లు నజరానా ప్రకటించింది. కానీ పాక్ సేనలు, ఉగ్రవాదులు భారత్ కి వ్యతిరేకంగా పన్నుతున్న కుట్రలు, చేస్తున్న గెరిల్లా యుద్ధం చూస్తుంటే అమెరికా ప్రభుత్వం ఇచ్చిన ఆ నిధులన్నీ దానికే ఉపయోగపడుతున్నట్లు కనిపిస్తోంది. తమ పిల్లలని కిరాతకంగా చంపిన తాలిబాన్ల మీద యుద్ధం ప్రకటించిన పాకిస్తాన్ ప్రభుత్వం, భారత్ తో కూడా ఎందుకు యుద్ధం చేయాలనుకొంటోందో, దాని వలన ఆ దేశానికి, ప్రభుత్వానికి ఏమి ప్రయోజనమో తెలియదు. పాకిస్తాన్ ఈవిధంగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసి ఉన్నప్పటికీ అమెరికా ఆ దేశానికి భారీగా నిధులు అందజేయడం అంటే దానిని భారత్ కి వ్యతిరేకంగా ప్రోత్సహిస్తున్నట్లే భావించవలసి ఉంటుంది.
ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్న పాక్ ప్రభుత్వానికి నిధులు అందజేస్తూనే భారత్ తో ద్వైపాక్షిక సంబంధాలు బలపడాలని అమెరికా ఆశించడం చాలా ఆశ్చర్యంగా ఉంది.
పాకిస్తాన్ ఉగ్రవాదంపై చేస్తున్న పోరుని చూసి ముచ్చటపడి ప్రతీ సంవత్సరం భారీగా నిధులు ముట్టజెప్పుతున్నప్పటికీ, భారత గణతంత్ర దినోత్సవ వేడుకలకు అమెరికా అధ్యక్షుడు బారక్ ఒబామా ముఖ్య అతిధిగా వస్తున్నారనే సంగతి తెలిసినప్పటి నుండి పాకిస్తాన్ ఆ వేడుకలను భగ్నం చేసేందుకు శతవిధాల ప్రయత్నిస్తుండటం చాలా ఆశ్చర్యం కలిగిస్తోంది. అంటే ఆ దాడిని భారత్ పై చేస్తున్న దాడిగా భావించాలా? లేక నేరుగా అమెరికా అధ్యక్షుడిపైనే చేస్తున్న దాడిగా భావించాలా?
అమెరికా ప్రభుత్వం పాకిస్తాన్ కి ఏ ఉద్దేశ్యంతో కప్పం కడుతున్నప్పటికీ అది ఖచ్చితంగా దుర్వినియోగం అవుతోందనే విషయం మాత్రం స్పష్టం అవుతోంది. ఉగ్రవాదులపై పోరాటానికి ఆ నిధులు ఖర్చు చేసినా చేయకున్నా కనీసం ఆ దేశంలో ప్రజలకు కనీస సౌకర్యాలు కల్పించేందుకు ఉపయోగించినా నేడు పాక్ పరిస్థితి వేరేలా ఉండేదేమో? పాకిస్తాన్ లో బాల, బాలికలకు కనీసం విద్య, వైద్య,పౌష్టికాహారం వంటి సౌకర్యాలు కూడా కల్పించలేని పాక్ ప్రభుత్వం, భారత్ పై ఉగ్రవాదులను ఉసికోల్పేందుకు, సరిహద్దుల వద్ద భారత సైనిక దళాల మీద, భారత గ్రామాలపైనా దాడులు చేసేందుకు మాత్రం ఖర్చుకి వెనకాడకపోవడం విచిత్రం.
భారత్ ఇప్పుడు అభివృద్ధి మంత్రం పటిస్తుంటే, పాక్ మాత్రం తనను కాటేస్తున్నఉగ్రవాదాన్నే నమ్ముకొన్నట్లుంది. తాలిబాన్ ఉగ్రవాదులు స్కూలు పిల్లలను అతి కిరాతకంగా చంపిన తరువాతయినా దానికి జ్ఞానోదయం కలుగుతుందని అందరూ ఆశించారు. కానీ అది అత్యాసేనని పాక్ నిరూపిస్తోంది.
గత వారం పది రోజులుగా భారత సరిహద్దు గ్రామాలపై, సైనికులపై పాక్ దళాలు కాల్పులు జరుపుతున్నాయి. పాక్ ధాటికి అనేక గ్రామాలను ఖాళీ చేయించక తప్పని పరిస్థితి ఏర్పడిందంటే అక్కడ పరిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చును. పాకిస్తాన్ ప్రభుత్వానికి దాని సైన్యంపై ఎటువంటి నియంత్రణ లేదని చెప్పడానికి ఇదొక ఉదాహరణగా పేర్కొనవచ్చును. లేకుంటే తన సేనలు భారత్ పై దాడులు చేయడాన్ని అది నిలువరించి ఉండేది. ఇది చూస్తుంటే కుక్క తోకని ఊపడం కాక తోకే కుక్కని ఊపుతున్నట్లుంది.
ఉగ్రవాదాన్ని పెంచి పోషిచడం వలన ఇరాన్, ఇరాక్, సిరియా, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ తదితర దేశాల పరిస్థితి ఇప్పుడు ఎంత దయనీయంగా మారిందో అందరూ చూస్తూనే ఉన్నారు. అయినా పాక్ ప్రభుత్వానికి, దాని సైనికాధికారులకి జ్ఞానోదయం కలుగకపోగా పొరుగింటికి కూడా ఆ నిప్పుని అంటించాలని ప్రయత్నించడం చాలా దారుణం. నేడు కాకపోతే రేపయినా అందుకు తగిన ప్రతిఫలం అది అనుభవించక తప్పదు.