అపరిచితుడి పాత్రలో లగడపాటి రాజగోపాల్
posted on Dec 6, 2013 @ 9:38PM
పాలక ప్రభుత్వంపై ప్రతిపక్షాలు అవిశ్వాస తీర్మానం పెట్టడం, కూల్చేయాలని ప్రయత్నించడం పాత పద్ధతి. ఇప్పుడు అధికార పార్టీ నేతలే తమ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకొని కూల్చేస్తామని చెప్పుకోవడం లేటెస్ట్ ట్రెండ్. కాంగ్రెస్ యంపీ లగడపాటి రాజగోపాల్ ఈ హెచ్చరిక చేసారు. బహుశః ఇది కూడా ఒట్టొట్టి రాజీనామాలు చేసి ప్రజలను మభ్యపెట్టినట్లే పలుకుతున్న ప్రగాల్భాలేమో! ఎందుకంటే లగడపాటి ప్రకటించిన ఏ నిర్ణయానికి మిగిలిన కాంగ్రెస్ యంపీలు, కేంద్రమంత్రులు కట్టుబడిన దాఖలాలు లేవు. ఈవిషయం రాజీనామాల విషయంలోనే బయటపడింది.
ప్రస్తుతం మళ్ళీ సీమాంధ్రలో సమైక్య ఉద్యమాలు ఊపందుకోవడంతో ఇటువంటి ఆవేశపూరితమయిన ప్రకటనలే సీమాంధ్ర ప్రజల చెవికింపుగా ఉంటాయని వారికి తెలుసు. ఇటువంటివి మాట్లాడటంలో మంచి పేరు సంపాదించుకొన్న లగడపాటి ఇప్పుడు ప్రభుత్వాన్ని కూల్చుతామని చెప్పడంలో ఆశ్చర్యపడాల్సిందేమీ లేదు. ఒకవిధంగా చెప్పాలంటే ఆయన ఒక ‘అపరిచితుడి పాత్ర’ పోషిస్తూ సీమాంధ్ర ప్రజల ఆగ్రహావేశాలను మంచి రసవత్తరంగా ప్రతిభింబిస్తున్నారని చెప్పవచ్చును. ప్రజల ఆవేశాలను, కోపాన్ని చక్కగా ప్రదర్శించినందుకు ‘అపరిచితుడు’ సినిమా ఏవిధంగా సూపర్ హిట్ అయ్యిందో, ఇప్పుడు సీమాంధ్ర ప్రజల ఆగ్రహావేశాలను చక్కగా ప్రతిబింబిస్తున్న ఈ రాజకీయ సుపరిచితుడు కూడా తన పంచ్ డైలాగులతో అంతే ఇదిగా ప్రజలను ఆకట్టుకొంటున్నారని ఒప్పుకోక తప్పదు..
రాష్ట్ర విభజన జరిగితే తను రాజకీయాల నుండి తప్పుకొంటానని భీకర ప్రతిజ్ఞ చేసిన ఆయన విభజన ప్రక్రియ ఇంత సజావుగా సాగిపోతున్నాఇంకా రాజకీయాలను, తన కాంగ్రెస్ పార్టీని కూడా వదిలిపెట్టలేదు. పైగా ఈవిధంగా మాట్లడుతూ తానే కాంగ్రెస్ పార్టీకి కవచంగా నిలుస్తున్నారు. ఆయనే స్వయంగా పార్టీని, తిడుతుంటే, కూల్చేస్తానని హెచ్చరికలు జారీ చేస్తుంటే, ఇక అందరి దృష్టి ఆయనపైనే ఉంటుంది తప్ప కాంగ్రెస్ మీద ఎందుకు ఉంటుంది?
ఒకవేళ నిజంగా లగడపాటికి రాష్ట్ర విభజన అడ్డుకోవాలనే తాపత్రయమే ఉండి ఉంటే, తన అధిష్టానంపై నిజంగా కోపమే ఉండి ఉంటే, ఆయన ఈవిధంగా మీడియా ముందుకు వచ్చి చిందులు వేయనవసరం లేదు. ముందుగా పార్టీకి, పదవికి రాజీనామా చేసి బయటపడి ఉండాలి. కానీ ఆయన ఆ రెండు మాత్రం చేయలేదు. ఇకముందు కూడా చేస్తారనే నమ్మకం లేదు. ఎందుకంటే, పదవి వదులు కొంటే మళ్ళీ ఎన్నికలలో పోటీ చేసి గెలవచ్చును. కానీ పార్టీని వీడితే రాష్ట్రంలో ఆయనను భరించగల రాజకీయ పార్టీ ఏది లేదు. ఒకవేళ కిరణ్ కుమార్ రెడ్డి కొత్త పార్టీ పెడితే అందులో జేరుతారేమో? కానీ పెట్టకపోతే? అందువల్ల లగడపాటి హెచ్చరికలను సీరియస్ గా తీసుకోవలసిన అవసరం లేదు. అదే మాట ఏ పురందేశ్వరో అంటే తప్పక నమ్మవలసిందే!