Read more!

ప్రతిపక్ష నాయకుడు పదవి కోసం టీ-కాంగ్రెస్ నేతల సిగపట్లు

 

కాంగ్రెస్ పార్టీని దేశంలో మరే ఇతర పార్టీ కూడా ఓడించలేదని, కాంగ్రెస్ పార్టీ తనను తాను ఓడించుకొన్నపుడే, ఇతర పార్టీలు గెలుస్తుంటాయని కాంగ్రెస్ నేతలు అందరూ కించిత్ గర్వంగా చెప్పుకొంటుంటారు. అది నూటికి నూరు శాతం నిజమని సోనియా, రాహుల్ గాంధీలు మొన్న జరిగిన ఎన్నికలలో మరోమారు నిరూపించి చూపారు. కాంగ్రెస్ చేసిన ఘోర తప్పిదాల వల్లనే బీజేపీకి విజయావకాశాలు మెరుగుపడ్డాయి. దానికి మోడీ ప్రభంజనం తోడవడంతో కాంగ్రెస్ పార్టీ దేశంలో, ఆంధ్ర తెలంగాణా రాష్ట్రాలలో కూడా పూర్తిగా తుడిచిపెట్టుకు పోయింది.

 

తమ కాంగ్రెస్ పార్టీయే తెలంగాణా రాష్ట్రం ఇచ్చినప్పటికీ, దానిని సరిగ్గా ప్రచారం చేసుకోకుండా, ఎంతసేపూ పదవులు, టికెట్స్ కోసం కీచులాడుకొంటూ తెలంగాణాలో అధికారాన్ని చేజేతులా జారవిడుచుకొన్నారు టీ-కాంగ్రెస్ నేతలు. అయినా వారి ఆలోచనలలో కానీ, పద్దతులలో గానీ ఎటువంటి గొప్ప మార్పులురావు...రాబోవని ఇప్పుడు మరోమారు నిరూపిస్తున్నారు. ఎన్నికలలో పార్టీ గెలిస్తే ముఖ్యమంత్రి అయిపోదామని కలలుగన్న జానారెడ్డి, గీతారెడ్డి, డీకే అరుణ తదితరులందరూ ఇప్పుడు కనీసం పార్టీ శాసనసభా పక్ష నేతగానయినా ఎంపికయితే చాలని పోటీలు పడుతున్నారు. ఉన్నది 21మంది శాసనసభ్యులే అయినా వారిలో కనీసం ఒక డజను మందికి పైగా పోటీలో ఉన్నారు.

 

ఈరోజు జరుగబోయే శాసనసభ, శాసనమండలి ఫ్లోర్ లీడర్ల ఎన్నికకు కేంద్రం నుండి దిగ్వజయ్ సింగ్, వాయిలార్ రవి అధిష్టానం దూతలుగా వచ్చేరు. మామూలు పరిస్థితుల్లో వారు సూచించిన వారినే తమ నేతలుగా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం కాంగ్రెస్ లో పరిపాటి. కానీ, ఈసారి మాత్రం ఈ ఎన్నికలలో వారు జోక్యం చేసుకోవడాన్ని కొందరు టీ-కాంగ్రెస్ నేతలు తీవ్రంగా వ్యతిరేఖిస్తున్నారు. సీయల్పీ నేతను ఎన్నుకొనే బాధ్యతను తమకే విడిచి పెట్టాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అందువల్ల వారిరువురూ ఈ ఎన్నికలలో జోక్యం చేసుకోకపోవచ్చును.

 

అయితే ఇప్పటికీ టీ-కాంగ్రెస్ నేతలలో ఎవరిని తమ నాయకుడిగా ఎన్నుకోవాలనే విషయంలో ఏకాభిప్రాయం రాలేదు, పైగా టీ-కాంగ్రెస్ నేతలు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేతలందరూ ఒక ముటాగా, మిగిలిన వారందరూ మరో ముటాగా విడిపోయి ఎవరికివారు తమ ముటాకు చెందిన వారినే నాయకుడిగా ఎంపిక చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. మళ్ళీ ఆ రెండు ముటాలలో కూడా అనేకమంది పోటీ పడుతుండటంతో వారు కూడా కొత్తగా ఎన్నికయిన యం.యల్యే.లతో రహస్య సమావేశాలు నిర్వహిస్తున్నారు.

 

అందువల్ల కాంగ్రెస్ సంప్రదాయానికి భిన్నంగా మొట్ట మొదటిసారిగా టీ-కాంగ్రెస్ పార్టీలో ప్రజాస్వామ్యబద్దంగా రహస్య బ్యాలట్ ద్వారా ఎన్నిక జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరక మంచిదే అంటే ఇదేనేమో!