కేసీఆర్ కు కౌంటర్ ఇవ్వడంతో తరుణ్ ఛుగ్ తడబాటు
posted on Nov 4, 2022 @ 1:47PM
ఎమ్మెల్యేల కొనుగోలు బేరసారాల వ్యవహారంలో వీడియోలు విడుదల చేసి కేసీఆర్ బీజేపీకి బిగ్ షాక్ ఇచ్చారా అంటే ఔననే అంటున్నారు పరిశీలకులు. ఈ వీడియోలు విడుదల చేస్తూ కేసీఆర్ గురువారం మీడియా సమావేశంలో వెల్లడించిన అంశాలపై కౌంటర్ ఇవ్వడంలో బీజేపీ తడబాటుకు గురౌతోందని విశ్లేషణలు చేస్తున్నారు. కేసీఆర్ మీడియా సమావేశం తరువాత శుక్రవారం ఉదయం వరకూ బీజేపీ నుంచి ఒక్కరంటే ఒక్కరు కూడా మీడియా ముందుకు వచ్చి మాట్లాడకపోవడమే దీనికి నిదర్శనమని చెబుతున్నారు.
చివరాఖరికి బీజేపీ అగ్రనాయకత్వం కేసీఆర్ కు గట్టి కౌంటర్ ఇవ్వాలని విస్పష్టంగా ఆదేవించడంతో ఒక్కరొక్కరుగా మీడియా ముందుకు వచ్చి ఆ వ్యవహారంతో బీజేపీకి ఎలాంటి సంబంధం లేదని చెప్పుకుంటున్నారు. బీజేపీ తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ తరుణ్ ఛుగ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిలు హస్తినలో వేర్వేరు మీడియా సమావేశాల్లో కేసీఆర్ ఆరోపణలను ఖండించారు. ఎమ్మెల్యేల కొనుగోలు బేరసారాల విషయంలో మెయినాబాద్ ఫామ్ హౌస్ వ్యవహారంపై గురువారం (నవంబర్ 3) తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ మీడియా సమావేశంలో వెల్లడించిన అంశాలపై బీజేపీ తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ తరుణ్ ఛుగ్ కౌంటర్ ఇచ్చారు.
హస్తినలో మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్ ఆరోపణలపై స్పందించడంలో తడబడ్డారు. ఫాం హౌజ్ లో జరిగిన వ్యవహారంలో నిందితులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వారితో బీజేపీకి ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. మొత్తం ఎమ్మెల్యేల కొనగోలు బేరాసారాల వ్యవహారంతో మాకు మాకు ఎటువంటి సంబంధం లేదని చెప్పడం వినా.. విలేకరుల ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడంలో ఆయన తత్తరపాటుకు గురయ్యారు. ప్రశ్నలను దాటవేస్తూ.. కేసీఆర్ పై ఎదురుదాడికే అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారు. తెలంగాణ ప్రజలు కేసీఆర్ కు బైబై చెబుతున్నారన్నారు. కేసీఆర్ పతనం ప్రారంభమైందన్నారు. మరోసారి ఆయన అధికారంలోకి రావడం అసాధ్యమని చెప్పారు. అంతే కానీ ఎమ్మెల్యేల కొనుగోలు బేరసారాల వ్యవహారంలో కేసీఆర్ ఆరోపణలకు సంబంధించి స్పష్టంగా కౌంటర్ ఇవ్వడంలో విఫలమయ్యారు. విలేకరుల ప్రశ్నలకు బదులివ్వడంలో తత్తరపడ్డారు. సమాధానాలు ఇవ్వడం మాని కేసీఆర్ పై, టీఆర్ఎస్ సర్కార్ పై ఎదురుదాడికి దిగారు.
మునుగోడులో తెరాస తీవ్రమైన అధికార దుర్వినియోగానికి పాల్పడిందన్నారు. మునుగోడు ఉప ఎన్నికలో బీజేపీ విజయానికి కృషి చేసిన అందరికీ కృతజ్ణతలు చెప్పారు. విజయం కమలాన్నే వరిస్తుందని చెబుతూనే అక్కడ టీఆర్ఎస్ ధనబలంతో పాటూ, అధికార దుర్వినియోగానికీ పాల్పడిందని ఆరోపించారు. ఓటింగ్ మొదలవ్వడానికి ముందు వరకూ కూడా మంత్రులు, నాయకులు నిబంధనలను తుంగలో తొక్కి మునుగొడులోనే బస చేశారని ఆరోపించారు. కేసీఆర్ ప్రధాని కావాలని కలలు కంటున్నారని ఎద్దేవా చేశారు. మోడీ దేశాన్ని బలోపేతం చేస్తుంటే కేసీఆర్ తెలంగాణను అప్పుల కుప్పగా మార్చారని విమర్శలు గుప్పించారు.
మోడీ హయంలో జరిగిన అభివృద్ధికి ఎక్కడైనా సరే చర్చకు సిద్ధమనీ, కేసీఆర్ చేసిన అభివృద్ధిపై చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు. కేసీఆర్ లాంటి ముఖ్యమంత్రిని తొలిసారి చూస్తున్నామంటూ దుయ్యబట్టారు. ఎమ్మెల్యేల కొనుగోలు బేరసారాల విషయంలో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ సవాల్ చేసి యాదగిరి గుట్టలో ప్రమాణం చేస్తే.. సవాల్ కు సై అనకుండా కేసీఆర్ పిల్లిలా దాక్కున్నారని విమర్శించిన తరుణ్ ఛుగ్ ఎమ్మెల్యేల కొనుగోలుకు తాము కోట్లు వెచ్చిస్తున్నట్లు ఆరోపణలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ఎమ్మెల్యేల కొనుగోలు కు తాము డబ్బు ఖర్చు చేశామనడం శుద్ధ అబద్ధమన్నారు. కేసీఆర్ కు దేవుడిపై నమ్మకం లేకపోతే ఈడీ దర్యాప్తునకు సిద్ధపడాలని సవాల్ విసిరారు. ఫామ్ హౌజ్ వీడియోలకు బీజేపీకి ఎలాంటి సంబంధం లేదు. వీడియోలపై దమ్ముంటే కేసీఆర్ ప్రమాణం చేయాలని తరుణ్ ఛుగ్ అన్నారు.