ఆ ముగ్గురితో బీజేపీకి సంబంధం లేదు.. కిషన్ రెడ్డి
posted on Nov 4, 2022 @ 2:22PM
కేసీఆర్ పేల్చిన బాంబుతో బీజేపీ పూర్తిగా డిఫెన్స్ లో పడినట్లు కనిపిస్తోంది. ప్రత్యర్థులపై మాటల తూటాలతో విరుచుకుపడే కమలం నేతలు ఇప్పుడు తమను తాము డిఫెండ్ చేసుకోవడానికి నానా ఇక్కట్లూ పడుతున్నారు. కేసీఆర్ గురువారం(నవంబర్ 3)న మీడియా మీట్ పెట్టి వెల్లడించిన విషయాలు, విడుదల చేసిన వీడియోలోని అంశాలతో బీజేపీకి దిమ్మతిరిగి మైండ్ బ్లాక్ అయ్యిందని పిస్తోంది.
ఢిల్లీలో మీడియా సమావేశం పెట్టి మరీ కమలం పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జ్ తరుణ్ ఛుగ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిలు కేసీఆర్ విమర్శించడానికే పరిమితమయ్యారు, ఆ వీడియోలో ఎమ్మెల్యేలతో బేరసారాలు ఆడిన వారితో తమకు సంబంధం లేదని చెప్పుకోవడానికే ప్రాధాన్యత ఇచ్చారు తప్ప.. ఇన్ని రాష్ట్రాలలో ఇంత పెద్ద ఎత్తున ఎమ్మెల్యేల కొనుగోలుకు ప్రణాళికలు రూపొందించిన ఆరోపణలను సమర్ధంగా తిప్పి కొట్టడంలో విఫలమయ్యారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అయితే కేసీఆర్ కు, ఆయన కుటుంబానికి ప్రజల్లో ఆదరణ తగ్గుతుండటంతోనే ఆ ఫ్రస్ట్రేషన్ లోనే ఎమ్మెల్యేల కొనుగోలు డ్రామాకు తెరతీశారని, ఆయన ప్రెస్ మీట్ లో చెప్పినవన్నీ అబద్ధాలు, అవాస్తవాలని కిషన్ రెడ్డి చెప్పారు.
ఆ వీడియోలో ఉన్న వారితో బీజేపీకి ఎలాంటి సంబంధం లేదని అన్నారు. కిరాయి ఆర్టిస్టులతో, పార్టీ నేతలతో కేసీఆర్ ఒక అబద్ధాన్ని సృష్టించి.. అదే నిజమని ప్రజలను నమ్మించడానికి ప్రయత్నిస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో కేసీఆర్ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారనీ, అటువంటి వ్యక్తి దేశంలో ప్రజాస్వామ్యానికి ప్రమాదం ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేయడం దొంగే దొంగ దొంగ అని అరవడంలా ఉందన్నారు. కేసీఆర్ గురించి ఆయన రాజకీయ ప్రత్యర్థులను కాదు ఆయనతో తెలంగాణ ఉద్యమంలో కలిసి నడిచని ఎవరిని అడిగినా చెబుతారని కిషన్ రెడ్డి అన్నారు.
ఇంత కాలం కేసీఆర్, కేసీఆర్ కుటుంబం, తెరాస సర్కార్ అవినీతిపై విమర్శలు గుప్పిస్తూ వచ్చిన బీజేపీ తొలిసారిగా కేసీఆర్ పకడ్బందీ స్టింగ్ ఆపరేషన్ తో వీడియోలు బయటపెట్టి మరీ చేస్తున్న ఆరోపణలను తిప్పి కొట్టేందుకు నానాయాతనా పడుతోంది. వీడియోలో కనిపిస్తున్న వ్యక్తులు, వారి నొటి వెంట బీజేపీ అగ్రనాయకులు మోడీ, అమిత్ షా, నడ్డాల కనుసన్నలలోనే తాము పని చేస్తున్నామన్న మాట్లాడిన విషయాలను కేసీఆర్ బయటపెట్టడంతో ఆ వీడియోలో కనిపిస్తున్న వ్యక్తులతో సంబంధం లేదని చెప్పుకోవడానికే బీజేపీ పరిమితమైన పరిస్థితి స్పష్టంగా గోచరిస్తోందని పరిశీలకులు అంటున్నారు. యాదగిరి గుట్టలో ప్రమాణం అంటూ బండి సంజయ్ వంటి వారు సవాళ్లు చేయడం ఏదో ఫేస్ సేవింగ్ వ్యవహారంలాగ ఉంది తప్ప కేసీఆర్ ఆరోపణలకు దీటుగా జవాబు మాత్రం కాదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
ఫోన్ ట్యాపింగ్ వ్యక్తిగత గోప్యతకు భంగకరమని అంటున్నారే తప్ప.. ఎమ్మెల్యేల కొనుగోలు కోసం జరిగిన సంభాషణ అబద్ధమని మాత్రం అనడం లేదు. బీజేపీ అగ్రనాయకత్వం పేరు ప్రస్తావిస్తూ కొనుగోళ్లకు వారి అనుమతి, ప్రోత్సాహం ఉందని వీడియోల్లో స్పష్టంగా కనిపిస్తూ, వినిపిస్తుంటే.. వారితో సంబంధం లేదని చెబుతున్నారే తప్ప.. అక్రమంగా అగ్రనేతల పేర్లు ఉపయోగించి వసూళ్లకు పాల్పడుతున్నారంటే కేసు ఎందుకు నమోదు చేయలేదని పరిశీలకులు బీజేపీని ప్రశ్నిస్తున్నారు. అలాగే ఈడీ దర్యాప్తునకు సిద్ధమా అంటూ సవాల్ చేస్తున్నారే కానీ.. ఆ వీడియో ఫుటేజ్ ను ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపాలని ఎందుకు డిమాండ్ చేయడం లేదని ప్రశ్నిస్తున్నారు. మొత్తం మీద ఫామ్ హౌస్ వ్యవహారం బీజేపీని డిఫెన్స్ లోకి నెట్టేసిందనీ, ఇప్పట్లో ఆ పార్టీ పూర్వపు దూకుడును అందిపుచ్చుకోవడం అంత సులువు కాదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.