తాలిబన్ల చేతుల్లోకి పంజ్‌షిర్.. అమ్రూల్లా సలేహ్ ఇంటిపై పాకిస్తాన్ బాంబు దాడి
posted on Sep 6, 2021 @ 12:30PM
ఆప్ఘనీస్థాన్ లోని పోరాట గడ్డ పంజ్‌షిర్ కూడా తాలిబన్ల కైవసం అయిపోయింది. ఆప్ఘనిస్థాన్‌లోని పంజ్‌షీర్ ప్రావిన్స్ మొత్తాన్ని తమ అధీనంలోకి తెచ్చుకున్నామని తాలిబన్లు ప్రకటించారు. అహ్మద్ మసూద్ మేనల్లుడు అబ్దుల్ తో పాటు పలువురు ముఖ్యనేతలు మృతి చెందారని ప్రకటించారు. తాలిబన్ల దాడి నేపథ్యంలో ప్రతిఘటన బృందం నాయకుడు, ఆఫ్ఘనిస్థాన్ మాజీ ఉపాధ్యక్షుడు అమ్రుల్లా సలేహ్ వేరే సురక్షిత ప్రాంతానికి వెళ్లినట్లు తెలుస్తోంది.పంజ్‌షిర్‌లోని గవర్నర్ కార్యాలయం దగ్గర వైట్ ఫ్లాగ్ ఎగరవేసిన తాలిబన్ సేనల ఫోటో మనం ఇక్కడ చూడొచ్చు.మరోవైపు మొత్తం స్వాధీనం అయిపోయింది కాబట్టి.. అంతర్జాతీయ సమాజం తాలిబన్ రాజ్యాన్ని గుర్తించేలా ఓ రిక్వెస్ట్ చేశారు తాలిబన్లు. ఐక్యరాజ్యసమితి నుంచి పాలనా పరమైన సాయం కోరారు.
ఆప్గన్‌ను లాగేసుకున్న తాలిబన్లు, పంజ్‌షిర్ విషయంలో మాత్రం తడబడ్డారు. ఇన్నాళ్లు పంజ్‌షీర్‌లోకి తాలిబన్లు ప్రవేశించలేకపోయాయి. పంజ్‌షీర్‌లోని ప్రతిఘటన దళం, ప్రజలు చేస్తోన్న పోరాట ఫలితంగా తాలిబన్లకు ఇన్ని రోజులు ముచ్చెమటలు పట్టాయి. అయితే అక్కడి లోయను కైవసం చేసుకోవడంలో 20ఏళ్ల క్రితం విఫలమైన తాలిబన్లు ఈసారి మాత్రం జులుం చూపించారు. తాలిబన్లకు వ్యతిరేకంగా పోరాడిన నార్తన్ అలయెన్స్ బలగాలు ఎట్టకేలకు వెనక్కి తగ్గాయి. దీనికి కారణం.. పంజ్‌షిర్ సైన్యాన్ని నడిపిస్తున్న అమ్రూల్లా సలేహ్ ఇంటిని తాలిబన్లు డ్రోన్‌లతో పేల్చేయడమే.
ఇంకా లొంగకపోతే.. అంతం చేస్తాంటూ వార్నింగ్‌లు ఇచ్చారు. తిరుగుబాటు బలగాలను నడిపిస్తున్న కమాండర్‌ను కూడా తాలిబన్లు చంపేశారు.ఈ పరిస్థితుల్లో చేసేదేమీ లేక పంజ్‌షిర్ లొంగింది. తాలిబన్లతో చర్చలకు సిద్దమని ప్రకటించింది. ఆ మేరకు తాలిబన్లు ఓ అధికారిక పత్రాన్ని కూడా విడుదల చేశారు. అంతేకాదు.. పంజ్‌షిర్ నాయకులు కోరినట్లుగా చర్చలకు సిద్ధమంటూ లోకల్‌గా ఉన్న గవర్నర్ కార్యాలయంపై తెల్ల జెండా ఎగురవేశారు.
పంజ్‌షీర్ లోని కొంత భూభాగాన్ని ఆక్రమించామంటూ తాలిబన్లు ఇటీవల ప్రకటన చేసినప్పటికీ పంజ్‌షీర్ దళ సభ్యులు మాత్రం ఆ వార్తలను ఖండించారు. ఇప్పుడు పంజ్‌షీర్ మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నట్లు తాలిబన్లు ప్రకటించడం గమనార్హం. పంజ్‌షీర్ ఆక్రమణలో తాలిబన్లకు ఇతర ఉగ్రమూకలు కూడా సహకరించినట్లు తెలుస్తోంది. పంజ్‌షీర్‌లో విజయంతో ఇక ఆఫ్ఘనిస్థాన్ మొత్తం తమ హస్తగతమైందని తాలిబన్ ప్రతినిధి జాబిహుల్లా ముజాహిద్ ఓ ప్రకటనలో తెలిపారు. అక్కడి మందుగుండు సామగ్రి, ఆయుధాలన్నింటినీ కూడా స్వాధీనం చేసుకున్నామని చెప్పారు.