వ్యాక్సిన్ వేయించుకోని వాళ్లకు నో ఎంట్రీ..?
posted on Sep 6, 2021 @ 11:36AM
మీకు కొవిడ్ వ్యాక్సిన్ వేసుకున్నారా? వేసుకుంటే ఫర్వాలేదు.. కాని టీకా ఇప్పటిదాకా తీసుకోకపోతే మాత్రం మీకో బ్యాడ్ న్యూస్. కొవిడ్ వ్యాక్సిన్ వేసుకోని వాళ్లపై ఆంక్షలు విధించే దిశగా తెలంగాణ సర్కార్ కసరత్తు చేస్తోంది. రాష్ట్రంలో కరోనా ఆంక్షలు ఎత్తేసిన సర్కార్.. వ్యాక్సినేషన్ ఆంక్షలు అమలు చేయాలని భావిస్తోంది. వ్యాక్సిన్ వేయించుకున్న వాళ్లను మాత్రమే హోటళ్లు, మాల్స్, పార్కులు, పబ్బులు, థియేటర్లు, ప్రభుత్వ ఆఫీసుల్లోకి అనుమతివ్వాలని యోచిస్తోంది. టీకా వేయించుకోని వాళ్లకు ‘నో ఎంట్రీ’ ఆంక్షలు పెట్టే ఆలోచన చేస్తోంది. ఈ మేరకు ప్రభుత్వానికి హెల్త్ డిపార్ట్‌మెంట్ ప్రతిపాదనలు పంపింది.
రాష్ట్రమంతా కాకుండా మొదటగా గ్రేటర్ హైదరాబాద్‌లో ఈ ఆంక్షలు అమలు చేసే యోచనలో తెలంగాణ ప్రభుత్వం ఉంది. అందుకే గ్రేటర్‌లో ప్రస్తుతం స్పెషల్ వ్యాక్సినేషన్ డ్రైవ్ కొనసాగిస్తోంది. బస్తీలు, కాలనీలు తిరుగుతూ వ్యాక్సినేషన్ డ్రైవ్‌లు నిర్వహిస్తున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో ఇప్పటికే 95 శాతం మంది తొలి డోసు వ్యాక్సిన్ తీసుకున్నట్లు అధికారులు చెబుతున్నారు. మిగిలిన ఐదు శాతం మందికి కూడా టీకా వేసేందుకు మున్సిపల్, హెల్త్ స్టాఫ్ తిరుగుతున్నారు. ఈ నెల 9వ తేదీ నాటికి గ్రేటర్‌లో వంద శాతం వ్యాక్సినేషన్ పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అప్పటికీ వ్యాక్సిన్ వేయించుకోని వాళ్ల కోసం మరో 15 రోజుల గడువు ఇవ్వనున్నారు. ఆ తర్వాతి నుంచి ఆంక్షలు అమలు చేయనున్నట్టు సమాచారం.
ఆంక్షలు అమలు చేయడానికి వారం రోజుల ముందే అధికారికంగా ప్రకటిస్తామని బల్దియా హెల్త్ ఆఫీసర్లు చెబుతున్నారు. గ్రేటర్ హైదరాబాద్‌లో 95 శాతం మంది కనీసం ఒక్క డోసు అయినా వేసుకున్నారు. కానీ జిల్లాల్లో ఇప్పటికీ 80 లక్షల మంది కనీసం ఒక్క డోసు కూడా వేసుకోలేదు. చాలా మంది వ్యాక్సిన్ వేయించుకునేందుకు వెనుకాడుతున్నారు. వ్యాక్సిన్ సెంటర్లలో ఇంతకుముందులా రద్దీ ఉండడం లేదు. గ్రేటర్‌లో రిస్ర్టిక్షన్స్ అమలు చేస్తే.. జిల్లాల్లో జనాలు వ్యాక్సిన్ వేసుకునేందుకు ముందుకొస్తారని అధికారులు భావిస్తున్నారు. దసరా నాటికి రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికీ కనీసం ఒక్క డోసు వ్యాక్సిన్ వేయాలని హెల్త్ డిపార్ట్‌మెంట్ లక్ష్యంగా పెట్టుకుంది. సెప్టెంబర్, అక్టోబర్‌లో కలిపి తెలంగాణకు కోటి పది లక్షల డోసులను కేంద్రం కేటాయించింది. జనాలు ముందుకొస్తే దసరా నాటికి వంద శాతం (సింగిల్ డోసు) వ్యాక్సినేషన్ కంప్లీట్ చేయడం పెద్ద కష్టమేమీ కాదని ఆఫీసర్లు చెబుతున్నారు.