భారతీయులకు స్వామి వివేకానంద చెప్పిన మాటలు ఇవీ..!
posted on Jan 10, 2024 9:29AM
భారతదేశ యువతకు ఆధ్యాత్మికతను, స్వాతంత్ర్య పోరాట పటిమను, దేశభక్తిని సమపాళ్లలో రగిలించిన వ్యక్తి స్వామి వివేకానంద. ఆయన భారతదేశాన్ని, భారతీయులను గూర్చి ఇలా చెప్పారు..
వివేకి స్వాతంత్ర్యాన్ని కోరుతాడు. ఇంద్రియ సుఖాలన్నీ నిస్సారాలని అతడు గుర్తిస్తాడు. సుఖదుఃఖాలకు అంతు లేదని తెలుసుకొంటాడు. ఎందరో ధనికులు క్రొత్త క్రొత్త సుఖాలు కావాలని ఆత్రపడుతున్నారు? ఉన్న సుఖాలన్నీ పాతబడి పోయాయి. కాబట్టి వారికి క్రొత్తరకమైన సుఖాలు కావాలి. క్షణకాలం పాటు పొందే తృప్తి కోసం వారెన్నెన్ని పిచ్చి వస్తువులను కొనుగోలు చేస్తున్నారో? ఆ తృప్తి కలిగిన వెంటనే దానికి విపరీత ఫలం కూడా ఎలా కలుగుతోందో అందరూ చూస్తూనే ఉన్నారు.
ప్రజలలో అధిక సంఖ్యలో గొఱ్ఱెల మంద లాంటివారు ఉన్నారు. ముందుపోతున్న గొఱ్ఱె గోతిలో పడితే, వెనుక వస్తున్న గొఱ్ఱెల కూడా ఆ గోతిలోకే దూకుతాయి. అదేవిధంగా సంఘంలోని ఒక పెద్ద, ఏ పని చేస్తాడో ఆ పనినే తక్కిన వారంతా గుడ్డిగా చేస్తారు. తాము ఏం చేస్తున్నదీ వారు ఆలోచించరు. ప్రాపంచిక విషయాలు అసారాలని గుర్తించడం ప్రారంభించగానే, తాను మాయ చేతి ఆటబొమ్మగా గానీ, మాయాకర్షణలకు లోబడి గానీ ఉండకూడదన్న భావం మనిషికి కలుగుతుంది. దయతో నాలుగు మాటలు చెప్పగానే, మానవుడు నవ్వడం ప్రారంభిస్తాడు. కటువైన మాటలు నాలుగు చెవిన పడగానే ఏడవడం మొదలు పెడతారు. పేరుకూ, ప్రతిష్టకూ బానిస అవుతారు. ఈ బానిసతనానికి లోపల యథార్థమైన మనిషి పూడుకొనిపోయి ఉంటాడు. ఈ బానిసతనాన్ని గుర్తించినప్పుడు స్వాతంత్ర్యం కావాలన్న తీవ్రమైన కోరిక కలుగుతుంది.
నిప్పు కణికను నెత్తి మీద పెట్టినప్పుడు దాన్ని తోసివేయడానికి మనిషెంత అల్లాడిపోతాడో.. మాయకు తాను బానిసగా ఉన్నానని నిజం తెలుసుకొన్నవాడు కూడా బంధ విముక్తుడు కావడానికి అంతగా ఆత్రపడతాడు.
ముముక్షత్వం పొందాలన్న కోరికను మనుషులు ఇప్పుడిప్పుడే గుర్తిస్తున్నారు. అన్ని విషయాలలో వివేకంగా ఉండటం. ఏది సత్యమో, ఏది అసత్యమో, ఏది నిత్యమో, ఏది తాత్కాలికమో ఆలోచించడం. దేవుడొక్కడే నిజం, ఆయనే శాశ్వతం.. మిగిలినదంతా క్షణభంగురమే! అంతా నశించి పోతుంది. మనుషులు మరణిస్తారు. పశువులు, భూములు అంతరిస్తాయి. సూర్యచంద్రులు, నక్షత్రాలు, ప్రతి వస్తువు. అనుక్షణం మారిపోతూ ఉంటుంది. ఈరోజు పర్వతాలుగా ఉన్నవి నిన్న సముద్రాలుగా ఉన్నాయి. మళ్ళీ అవి రేపు సముద్రాలవుతాయి. సమస్త విశ్వం మార్పుల కుప్ప, కానీ ఏనాటికీ మార్పు చెందని వాడొకడున్నాడు. అతడే భగవంతుడు! మనం ఆయనను ఎంతగా సమీపిస్తే, మన మీది మాయ ప్రభావమంత తగ్గిపోతుంది. మనం ఆయనను సమీపించినప్పుడు, ఆయనతో కూడా నిలిచినప్పుడు మాయను జయిస్తాం. ఈ దృశ్యమాన ప్రకృతి మన అధీనమవుతుంది. మనపై దాని ప్రభావం ఉండదు. ఇదీ వివేకానందుడు భారతీయులకు చెప్పిన మాట.
*నిశ్శబ్ద.