రైల్వే బడ్జట్ నిజంగా విఫలమైందా!
posted on Feb 26, 2016 @ 9:47AM
రైల్వే మంత్రి సురేష్ ప్రభు నిన్న ప్రవేశపెట్టిన బడ్జట్‌ను ప్రతిపక్షాలన్నీ ఏకగ్రీవంగా పనికిమాలినదంటూ తేల్చిపారేశాయి. ఇలాంటి సీదా బడ్జట్‌ను ఇంతవరకూ చూడలేదంటూ అటు ఉద్యోగ సంఘాలు, ఇటు ప్రతిపక్ష నేతలూ పెదవి విరిచేశారు. నిజంగానే రైల్వే బడ్జట్ దారుణంగా సాగిందా?
జాతీయ ఆదాయంలో రైల్వేలది ముఖ్యపాత్రగా భావించి 1924 నుంచే రైల్వేలకు ప్రత్యేక బడ్జట్‌ను అమలుచేయడం మొదలుపెట్టారు. లాల్‌బహదూర్ శాస్ర్తి, జగ్‌జీవన్‌రాం వంటి ప్రముఖులెందరో రైల్వే బడ్జట్‌లను ప్రవేశపెట్టినా వాటిగురించి సామాన్యులు అంతగా పట్టించుకునేవారు కాదు. 1999లో మమతా బెనర్జీ రైల్వే మంత్రి కావడంతో రైల్వేలలో ఆర్థిక సంస్కరణలు మొదలయ్యాయి. మమతా బెనర్జీ తరువాత నితీశ్, లాలూలు రైల్వే మంత్రులుగా సాగడంతో రైల్వే బడ్జట్‌కు జనాకర్షణ తోడైంది. ప్రపంచీకరణ వల్లనైతేనేం, మారుతున్న జీవనశైలి వల్లనైతేనేం.... దేశప్రజలంతా రైల్వేల గురించీ, రైల్వే బడ్జట్ల గురించీ ఆసక్తి కనబరచడం మొదలుపెట్టారు.
ఏటా రైల్వే బడ్జట్‌ను ప్రవేశపెట్టిన ప్రతిసారీ ఈసారి కొత్తగా ఎన్ని రైళ్లు వేశారు? వాటిలో మన రాష్ట్రానికి ఎన్ని దక్కాయి? ఏ రాష్ట్రానికి ఏఏ ప్రాజెక్టులు లభించాయి? అనే పత్రికలు చూసేవారు. కానీ గత బడ్జట్లో ఇచ్చిన హామీలు ఏమయ్యాయి? ప్రాజెక్టులు ఏ దశకు చేరుకున్నాయి? అని ఎవరూ పెద్దగా పట్టించుకునేవారు కాదు. దానికి అనుగుణంగానే రైల్వే మంత్రులంతా కూడా ప్రజాకర్షక బడ్జట్లను రూపొందించేందుకు ప్రయత్నించేవారు. పనిలో పనిగా నిర్మొహమాటంగా తన రాష్ట్రానికి వీలైనన్ని రైళ్లు, అదే చేత్తో కావల్సినన్ని ప్రజెక్టులు కేటాయించేవారు. సమీపంలో ఎక్కడన్నా ఎన్నికలు జరుగుతుంటే ఆ రాష్ట్రంవారిని కాస్త బుజ్జగించేందుకు అక్కడ కూడా కొన్ని వరాలను విదిల్చేవారు. సురేష్ ప్రభు ఇలాంటి వరాల జోలికి పోలేదు. తన స్వరాష్ట్రమైన మహారాష్ట్రకి పెద్దపీటా వేయలేదు. త్వరలోనే అయిదు రాష్ట్రాలలో ఎన్నికలు జరగనున్నప్పటికీ తొందరపడలేదు.
రైల్వేలను పునర్‌వ్యవస్థీకరించడానికీ; రైల్వేలలో ప్రయాణ సౌకర్యాలను మెరుగుపరచడానికీ; యువతకు చేరువకావడానికీ; స్త్రీలకు, వృద్ధులక అధిక సౌకర్యాలు కల్పించడానికే మంత్రి పెద్దపీట వేశారు. అన్నింటికీ మించి పేరుకుపోతున్న ప్రాజెక్టులను పూర్తిచేయడమే తన లక్ష్యం అని స్పష్టం చేశారు. కాస్త జాగ్రత్తగా గమనిస్తే తెలుగురాష్ట్రాలలో పెండింగ్ ప్రాజెక్టులను పూర్తిచేసేందుకు వందలాది కోట్లను కేటాయించినట్లు తెలుస్తుంది. ఆంధ్రప్రదేశ్‌లో నంద్యాల- ఎర్రగుంట్ల మార్గాన్ని పూర్తిచేసేందుకు 100 కోట్లు, తెలంగాణలో జగ్గయ్యపేట-జానపహాడ్ మార్గాన్ని పూర్తిచేసేందుకు 110 కోట్లు కేటాయించడం ఒక ఉదాహరణ మాత్రమే!
అలాగని సురేష్ ప్రభు బడ్జట్ అద్భుతంగా ఉందనీ చెప్పుకోవడానికి లేదు. విశాఖను ప్రత్యేక జోన్‌గా ప్రకటించాలని, కాజీపేటకు డివిజన్ హోదాను కల్పించాలనీ... రైల్వే మంత్రికి అందించిన వినతులన్నింటినీ కూడా తుంగలో తొక్కినట్లు కనిపిస్తోంది. తెలంగాణ ప్రభుత్వం ఖర్చుని భరించేందుకు ముందుకు వచ్చిన ఎంఎంటీఎస్ ప్రాజెక్టుకి మాత్రమే బడ్జట్ ఆమోదం తెలిపింది. కొత్త రైళ్ల సంగతి అటుంచితే తెలుగు రాష్ట్రాలు ఎప్పటినుంచో అడుగుతున్న వ్యాగన్ వర్కషాప్, కోచ్ ఫ్యాక్టరీ వంటివి ఏవీ కూడా ఈసారి మనకు దక్కలేదు. మంత్రివర్యులు సెలవిచ్చినట్లుగా ఈ బడ్జెట్ దీర్ఘకాలికంగా లాభాలను చేకూర్చనుంది కాబట్టి అందుకోసం మిగతా రాష్ట్రాలతో పాటు మనం కూడా త్యాగం చేయవలసి వచ్చినట్లుంది.