సంజయ్‌దత్ అదృష్టవంతుడా!
posted on Feb 27, 2016 @ 9:50AM
1994- ముంబై ఎయిర్‌పోర్టులో ఉన్న పోలీసులు సంజయ్‌దత్‌ను టాడా చట్టం కింద అరెస్టు చేయడం విని ప్రపంచమంతా ముక్కున వేలేసుకుంది. బాలీవుడ్ ప్రేమ జంట సునీల్‌దత్- నర్గీస్‌ల గారాల పుత్రుడైన సంజయ్ ఏమంత మంచి బాలుడు కాదని దేశానికి తెలుసు. కానీ తీవ్రవాదులతోనే దోస్తీ కట్టి, వారి ఆయుధాలను దాచిపెట్టేందుకు ఉపయోగపడతాడని ఏనాడూ ఊహించలేదు. 1993లో ఆ తీవ్రవాదులు ముంబైలో మారణహోమాన్ని జరిపి వందలాది మంది ప్రాణాలను హరించి ఉండకపోతే, బహుశా ఈ విషయం సద్దుమణిగిపోయేదేమో. కానీ సంజయ్‌కు ఆ తీవ్రవాదులకూ సంబంధాలు హద్దులు దాటి ఉన్నాయనే విషయం సుస్పష్టంగా తేలిపోవడంతో అతన్ని అరెస్టు చేయక తప్పలేదు. పైగా అప్పటికి కఠినమైన టాడా చట్టం అమల్లో ఉండటంతో సంజయ్ తప్పించుకోవడం అంత తేలిక కాలేదు. అయినా సంజయ్‌దత్ అదృష్టవంతుడే అంటారు చాలామంది. ఎందుకంటే...
సంజయ్‌దత్ యవ్వనంలోకి అడుగుపెడుతూనే మాదకద్రవ్యాలకు అలవాటు పడ్డాడు. పాపం తల్లి చనిపోయిన బాధలో ఆ వ్యసనానికి లోనయ్యాడని ప్రపంచమంతా జాలిపడింది. సామాన్యులు ఏదన్నా వ్యసనంలో ఇరుక్కుంటే ఇలాంటి జాలిని పొందడం కష్టమే! తరువాత ఆయనను ముంబై పేలుళ్ల సందర్భంగా అరెస్టు చేస్తే బాలీవుడ్ అంతా కంటతడి పెట్టింది. సంజయ్‌ను విడుదల చేసేందుకు ఏకంగా పార్లమెంటు స్థాయిలోనే పైరవీలు జరిగాయి. సంజయ్ తండ్రి సునీల్ దత్ కాంగ్రెస్ నేత అయినా కూడా పార్టీలకు అతీతంగా బాల్‌థాకరే, శతృఘన్ సిన్హా వంటి వారు ఆయనకు ఈ విషయంలో మద్దతుగా నిలిచారు. సంజయ్‌దత్ కేవలం తన కుటుంబ రక్షణ కోసమే అక్రమ ఆయుధాలను కలిగి ఉన్నాడనీ... అభంశుభం ఎరుగని ఆ పసివాడు, అబూసలీం వంటి తీవ్రవాదుల ఉచ్చులో చిక్కుకున్నాడనీ పెద్దలంతా తెగ బాధపడిపోయారు.
నిజానికి తన కుటుంబ రక్షణ కోసం ఆయుధాలను కలిగి ఉన్నాని చెప్పడం అంత హాస్యాస్పదం మరొకటి ఉండదు. ఎందుకంటే అతని కుటుంబానికి వచ్చిన ప్రమాదం ఏమీ లేదు. ఒకవేళ అలాంటి ప్రమాదం ఉంటే పోలీసులను ఆశ్రయించాలి కానీ తీవ్రవాదులని కాదు. ఒకవేళ ఆశ్రయించినా మరీ మూడు AK-56 తుపాకులూ, 20 గ్రైనేడులూ, 450 బుల్లెట్లూ... కలిగి ఉండాల్సిన అవసరం అసలే లేదు. ఈ జాబితాను చూస్తే ఒక యుద్ధానికి సరిపడా మందుగుండుని సమకూర్చుకున్నట్లు కనిపిస్తోంది. ఆ యుద్ధం ఎలాంటిదో వేరే చెప్పనవసరం లేదు! ఇంతజరిగిన తరువాత కూడా, సంజయ్‌దత్‌కు ఆయుధాలను అందచేసిన డెలివరీ బాయ్‌కి ఎంత శిక్ష పడిందో ఆయనకు కూడా అంతే తేలికపాటి శిక్ష పడింది.
తీవ్రమైన నేరంలో ఇరుక్కున్న సంజయ్‌దత్ తేలికపాటి శిక్షతో తప్పించుకున్నందుకు ఇటు ప్రభుత్వం కానీ, అటు కేసుని విచారిస్తున్న సీబీఐ కానీ ఎలాంటి అప్పీలూ చేయలేదు. కేసుని తిరిగి ఎక్కడా దాఖలు చేయలేదు. పైగా సీబీఐ సంజయ్‌దత్ కేసులో తన నివేదికను చాలా తేలికపాటి పదాలతో కూర్చినట్లు ఆరోపణలు ఉన్నాయి. సంజయ్‌దత్‌ని విచారించిన న్యాయమూర్తులు కూడా స్వల్పకాల శిక్షతో సరిపెట్టేయడం వెనుక ఉన్న మతలబు ఏమిటో కూడా ఎవరికీ అంతుపట్టదు. సంజయ్‌కు విధించిన తేలికపాటి శిక్ష తనని సైతం ఆశ్చర్యానికి గురిచేసిందని అతని న్యాయవాది సతీష్ తరువాత కాలంలో పేర్కొన్నాడు.జైల్లో ఉన్నప్పుడు కూడా సంజయ్‌కి ప్రత్యేకమైన సదుపాయాలను కల్పించేవారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇవి ఎంతవరకూ నిజమో కానీ ఆయన తరచూ పెరోల్ మీద నెలల తరబడి బయటకు వచ్చిన మాట వాస్తవం. ఈ విషయమై సాక్షాత్తూ ముంబై హైకోర్టు ప్రభుత్వాన్ని మందలించాల్సి వచ్చింది.
ఇప్పుడు కూడా సంజయ్‌దత్‌ను ‘సత్ప్రవర్తన’ ఆధారంగా ఎనిమిది నెలల ముందుగా విడుదల చేసింది ప్రభుత్వం. ముంబై పేలుళ్ల సందర్భంగా సంజయ్‌దత్‌లాగానే అక్రమ ఆయుధాలను కలిగి ఉన్నందుకు జైబున్నీసా అనే విధవరాలికి కూడా ఐదేళ్ల శిక్షను విధించారు. ఆమె వయసు 70 సంవత్సరాలు, క్యాన్సర్ రోగి, కిడ్నీలు పాడైపోవడంతో ఈమధ్యే ఆపరేషన్ జరిగింది, ఆమెకు అయిదుగురు కుమార్తెలు.... తన తల్లిని విడుదల చేయమంటూ ఆమె కుమార్తెలు ఎందరి చుట్టూనో తిరుగుతున్నారు. ఇప్పటికీ ఆమె జైళ్లోనే ఉన్నారు. ఇప్పుడు చెప్పండి... సంజయ్‌దత్ అదృష్టవంతుడా కాదా!