రాజుకుంటున్న రిజర్వేషన్ల చిచ్చు!
posted on Feb 25, 2016 8:59AM
- ఈ ఏడాది తునిలో మొదలైన రిజర్వేషన్ల గొడవ నెల నెలా గడిచేసరికి యావత్ భారతదేశాన్నే కమ్ముకుంటున్నట్లు ఉంది.
- గత వారం రోజులుగా హర్యానాలో తగలబడుతున్న ప్రభుత్వ ఆస్తుల సాక్షిగా, పాలకోసం అలమటిస్తున్న పసిపిల్లల సాక్షిగా రిజర్వేషన్ల చిచ్చు మళ్లీ రగులుకున్నట్లే కనిపిస్తోంది.
- అటు హర్యానాలో జాట్ వర్గం ఆందోళన చేస్తోందో లేదో ఇటు గుజరాత్‌లోనూ పటేల్ కులస్తులకు రిజర్వేషన్ కావాలంటూ హడావిడి మొదలైంది. పటేల్ వర్గ నాయకుడు హార్ధిక్ పటేల్ జైల్లోంచే తన నిరసన గళాన్ని వినిపించడం మొదలుపెట్టాడు.
- ఇక రాజస్తాన్‌లోని గుజ్జర్ వర్గ నేతలు కూడా మరోసారి మైకుల ముందుకి వచ్చారు. ప్రస్తుత పార్లమెంటు బడ్జెట్ సమావేశాలలో కనుక తమకు రిజర్వేషన్లకు కల్పించే విధంగా తగిన చట్టాలను రూపొందించకపోతే తిరిగి తమ ఉద్యమాన్ని మొదలుపెడతాం అంటూ హెచ్చరించారు.
రిజర్వేషన్లు కావాలంటే వేర్వేరు వర్గాలవారు ఆందోళనలకి దిగుతుంటే, అడిగినవారందరికీ కోటాను విస్తరిస్తూ పోతుంటే తాము అన్యాయం అయిపోతామంటూ పోటీ మాటలు వినిపిస్తున్నాయి. తెలంగాణకు చెందిన బీసీ నేత ఆర్.కృష్ణయ్య ఇప్పటికే కొత్త రిజర్వేషన్లకు వ్యతిరేకంగా పోరుని మొదలుపెట్టారు. ఇందుకోసం దిల్లీలో భారీ సభలను నిర్వహిస్తామనీ, పార్లమెంటుదాకా తమ ఆందోళనని విస్తరిస్తామనీ చెబుతున్నారు. రిజర్వేషన్లకు వ్యతిరేకంగా మాట్లాడుతున్న ఆర్.కృష్ణయ్య ఒంటరివారని అనుకోవడానికి లేదు. కురుక్షేత్ర నియోజకవర్గానికి చెందిన బీజేపీ ఎంపీ రోజ్ కుమార్ సయానీ సైతం జాట్ వర్గానికి రిజర్వేషన్లను కల్పించడం గురించి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ‘విధ్వంసానికి పాల్పడే ప్రతి వర్గానికీ రిజర్వేషన్లను అమలుచేస్తూ పోతే హర్యానాలో ఉన్న 36 కులాలకీ రిజర్వేషన్ కల్పించాల్సి వస్తుందన్నారు’.
రాజ్ కుమార్ మాటలు ఆవేశంగా కనిపించవచ్చు. కానీ అది కొట్టివేయదగ్గ వాదనేం కాదు. ప్రభుత్వం దిగివచ్చే దాకా విశృంఖలంగా ఆందోళలను చేపట్టడం, ప్రజాజీవితాన్ని అస్తవ్యస్తం చేయడం అన్న వ్యూహానికి ప్రస్తుతం తిరుగులేకుండా పోతోంది. ఆందోళనల సందర్భంగా జరుగుతున్న విధ్వంసానికి సుప్రీంకోర్టు సైతం ముక్కునవేలేసుకునే పరిస్థితి వచ్చింది. ఉద్యమం ముసుగులో ప్రభుత్వ లేదా పౌరుల ఆస్తులకు నష్టం కలిగించేవారిని శిక్షించేందుకు కఠినమైన చర్యలు తీసుకోవలసిన అవసరం ఉందంటూ నిన్న సుప్రీం కోర్టు పేర్కొంది. న్యాయస్థానాల నుంచి ఇలాంటి మొట్టికాయలు పడతాయనే ఉద్యమకారులు కూడా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రభుత్వం తన హామీలను అమలుపరచడంతో పాటుగా, ఉద్యమం సందర్భంగా పెట్టిన కేసులను ఎత్తివేస్తేనే ఆందోళనలను విరమిస్తాం అంటూ కొత్త కోరిక కోరుతున్నారు.
ఏది ఏమైనా రోజురోజుకీ పెరిగిపోతున్న గొడవలకి సంబంధించి కేంద్రప్రభుత్వమూ న్యాయవ్యవస్థా ఒక కార్యాచరణను రూపొందించాల్సిన అవసరం వచ్చింది. రిజర్వేషన్ల కోసం కులాలను తిరిగి విభజించడమా లేకపోతే కొత్తగా వస్తున్న వాదనలన్నింటినీ ఒకేసారి ఆలకించేందుకు ఏదన్నా సంఘాన్ని ఏర్పాటు చేయడమా అన్నది ప్రభుత్వం చూడాలి. అన్నింటికీ మంచి ఒక వర్గానికి నూతనంగా రిజర్వేషన్ కల్పించడం అనే విధానానికి ఒక ప్రాతిపదిక ఉండాలి. మరో మాటలో చెప్పాలంటే రిజర్వేషన్ కల్పించేస్తామంటూ ఒక రాజకీయ పార్టీ హడావుడిగా ప్రకటించేంత తేలికగా కానీ, మేం ఆందోళనకు దిగితే రిజర్వేషన్ వచ్చేస్తుందన్న భ్రమలో వివిధ వర్గాలు కానీ ఉండకుండా... పారదర్శకమైన, కఠినమైన విధివిధానాలకు అనుగుణంగా రిజర్వేషన్లలో మార్పులు జరగాలి.