స్వర్ణ ప్యాలెస్ కేసు విచారణకు సుప్రీం గ్రీన్ సిగ్నల్.. కండిషన్స్ అప్లై!!
posted on Sep 14, 2020 @ 2:16PM
స్వర్ణ ప్యాలెస్ కేసులో డాక్టర్ రమేష్ బాబును విచారణ చేసేందుకు సుప్రీం కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే, విచారణ చేసేందుకు అనుమతి ఇస్తూనే షరతులు పెట్టింది. డాక్టర్ రమేష్ బాబును నిర్బంధంలోకి తీసుకోకుండా విచారణ చేయాలని షరతు విధించింది.
గతంలో స్వర్ణ ప్యాలెస్ కేసులో హైకోర్టు స్టే విధించిన సంగతి తెలిసిందే. దీంతో ఏపీ సర్కార్ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై స్టే విధించాలని ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ పై సోమవారం జస్టిస్ నారీమన్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. ప్రమాద దర్యాప్తును నిలిపివేయడం సరికాదని అభిప్రాయపడిన సుప్రీం కోర్టు.. దర్యాప్తు చేసేందుకు అనుమతి ఇచ్చింది. అయితే, డాక్టర్ రమేష్ ను నిర్బంధించకుండా విచారించుకోవచ్చునని ప్రభుత్వానికి సూచించింది. రమేష్ కూడా దర్యాప్తుకు సహకరించాలని సుప్రీం కోర్టు ఆదేశించింది.
కాగా, విజయవాడలోని స్వర్ణప్యాలస్ ను కోవిడ్ కేంద్రంగా మార్చిన సంగతి తెలిసిందే. ఈ కోవిడ్ కేంద్రంలో అగ్నిప్రమాదం జరగడంతో 10మంది ప్రాణాలు కోల్పోయారు. దీనిపై విచారణ జరిపిన ఏపీ హైకోర్టు.. డాక్టర్ రమేష్, నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ సీతా రామ్మోహన్ రావులపై నమోదు చేసిన కేసులో తదుపరి చర్యలన్నింటినీ నిలుపుదల చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. స్వర్ణ ప్యాలెస్ ఘటనలో ప్రభుత్వ నిర్లక్ష్యం సంగతేమిటని ఉత్తర్వులు జారీ చేసిన సందర్భంలో హైకోర్టు ప్రశ్నించింది. అదే హోటల్‌లో అంతకుముందు ప్రభుత్వం క్వారంటైన్ కేంద్రాన్ని నిర్వహించిన నేపథ్యంలో.. స్వర్ణ ప్యాలెస్ సురక్షితం కాదని తెలిసినప్పుడు అక్కడ క్వారంటైన్ కేంద్రం ఏర్పాటుకు అధికారాలు ఎలా అనుమతిచ్చారు? అని నిలదీసింది. ఈ వ్యవహారానికి సంబంధించి కృష్ణా జిల్లా కలెక్టర్, సబ్ కలెక్టర్, డీఎంహెచ్‌వోలను నిందితులుగా ఎందుకు చేర్చలేదని ప్రశ్నించిన హైకోర్టు.. వారిని నిందితులుగా చేర్చేదాకా ఈ కేసులో ముందుకెళ్లడానికి వీల్లేదని స్పష్టం చేసింది. దీంతో, హైకోర్టు ఉత్తర్వులను సవాలు చేస్తూ ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.