పది నిమిషాల్లో రిజిస్ట్రేషన్లు.. ఇకపై లంచం ఇవ్వాల్సిన అవసరం రాదు
posted on Sep 14, 2020 @ 2:47PM
తెలంగాణ శాసనసభ, మండలి సమావేశాలు కొనసాగుతున్నాయి. కొత్త రెవెన్యూ చట్టంపై శాసనమండలిలో సీఎం కేసీఆర్ ప్రసంగించారు. రాష్ట్రంలో రెవెన్యూ సంస్కరణలకు శ్రీకారం చుట్టామని, వీఆర్వో వ్యవస్థను రద్దు చేశామని చెప్పారు. పాత రెవెన్యూ చట్టంతో రైతులు ఇబ్బందులు పడ్డారన్నారు. పాత రెవెన్యూ చట్టంతో చాలా దారుణాలు చూశామని.. వీఆర్వోల విశేషాధికారాలతో చాలా మంది నష్టపోయారని కేసీఆర్ తెలిపారు.
రాష్ట్రం వచ్చాక భూముల రేట్లు అద్భుతంగా పెరిగాయని, ఎక్కడో రిమోట్ ఏరియాలో తప్ప ఎకరం రూ.10 లక్షలకు కూడా దొరకట్లేదన్నారు. భూముల రేట్లు పెరగడంతో లాండ్ మాఫియా కూడా పెరిగిందన్నారు. రైతుబంధు పథకం భూస్వాముల కోసం కాదని, రాష్ట్రంలో భూస్వాములు లేనేలేరని, రాష్ట్రంలో 98 శాతం మంది పది ఎకరాల లోపు ఉన్న వాళ్లేనని అన్నారు. 25 ఎకరాల పైబడి ఉన్న రైతులు కేవలం 6 వేల మంది ఉన్నారని సీఎం కేసీఆర్ తెలిపారు.
కొత్త రెవెన్యూ చట్టం సామాన్యుల కోసమే. పలు చట్టాల సమాహారంగా ఈ కొత్త రెవెన్యూ చట్టం ఉంటుందని కేసీఆర్ తెలిపారు. రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో అవినీతికి ఆస్కారం ఉండదని, ఇకపై భూముల రిజిస్ట్రేషన్‌కు లంచం ఇవ్వాల్సిన అవసరం రాదని తెలిపారు. వ్యవసాయ భూములకు సంబంధించి ధరణి పోర్టల్ పారదర్శకంగా పనిచేస్తుంది అన్నారు. ఎవరైనా, ఎప్పుడైనా ఓపెన్ చేసి చూసుకోవచ్చు. తహసీల్దార్లు కూడా ట్యాంపర్ చేయలేని విధంగా సాఫ్ట్‌వేర్ రూపొందించాం అని కేసీఆర్ స్పష్టం చేశారు. బయోమెట్రిక్, ఐరిస్, ఆధార్, ఫోటోతో రిజిస్ర్టేషన్లు చేస్తామని, ఈ వివరాలన్నీ లేకుండా తహసీల్దార్లకు పోర్టల్ తెరుచుకోదన్నారు. రిజిస్ట్రేషన్‌కు మాత్రమే ఎమ్మార్వోకు ధరణి పోర్టల్‌ను ఓపెన్ చేసే అవకాశం ఉందని, సబ్ రిజిస్ట్రార్లకు ఎలాంటి విచక్షణాధికారం లేదని తెలిపారు. పది నిమిషాల్లో రిజిస్ట్రేషన్లు పూర్తయ్యేలా ఏర్పాట్లు చేస్తున్నామని, ధరణి పోర్టల్‌లో అప్‌డేట్ కాగానే రిజిస్ట్రేషన్, మ్యూటేషన్, ఆప్‌డేషన్ కాపీలు వస్తాయని కేసీఆర్ తెలిపారు.
రెవెన్యూ కోర్టులను రద్దు చేశామని, కావాలని వివాదాలు పెట్టుకునే వారి కోసం ప్రభుత్వం సమయం వృథా చేయదని తేల్చిచెప్పారు. కావాలని గొడవలు పెట్టుకుంటే సివిల్ కోర్టులోనే తేల్చుకోవాలి. కొత్త రెవెన్యూ చట్టంతో భూవివాదాలు తగ్గుతాయి అని అన్నారు. కౌలుదారులను పట్టించుకోవాల్సిన అవసరం లేదు. రైతు తనకు నచ్చిన వ్యక్తికి భూమిని కౌలుకు ఇచ్చుకుంటాడు అని కేసీఆర్ వ్యాఖ్యానించారు.