ఏపీ ఫర్ సేల్.. సీఎం జగన్ ఏం చేస్తున్నట్టు? కేంద్రానికి తాకట్టు పెట్టేశారా?
posted on Sep 6, 2021 @ 1:29PM
విశాఖ ఉక్కును అడ్డగోలుగా అమ్మేస్తున్నారు. వందకు వంద శాతం ప్రైవేటీకరిస్తున్నారు. ఆంధ్రుల హక్కును అంగట్లో పెట్టేసి ఏపీకి తీరని అన్యాయం చేస్తున్నారు. ప్రజలు వద్దంటున్నా.. కార్మికులు, ఉద్యోగులు ఉద్యమిస్తున్నా.. ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతున్నా.. వెనక్కి తగ్గడం లేదు. జగన్ సర్కారు చేతగానితనం వల్లే విశాఖ ఉక్కు మనకు కాకుండా పోతోందనే విమర్శ. వైసీపీ ప్రభుత్వం లోపాయికారి సహకారంతోనే స్టీల్ ప్లాంట్‌ను కరిగించేస్తున్నారనే ఆరోపణ. ఇది చాలదన్నట్టు.. ఆంధ్రులో నోట్లో మట్టి కొట్టేలా.. మరో అడుగు ముందుకు వేస్తోంది కేంద్రం. ఎప్పటిలానే రాష్ట్రం చూస్తూ ఉండటం.. చేతులెత్తేయడం మినహా ఏమీ చేయలేక, చేవలేక పడుటోందని అంటున్నారు.
విజయవాడ ఎయిర్‌పోర్ట్ ఫర్ సేల్. దాదాపు 10 వేల కోట్ల విలువైన విమానాశ్రయం ఆస్తులను.. డెడ్ చీప్‌గా కేవలం 600 కోట్లకు అమ్మకానికి పెట్టడం దారుణం. విమానాశ్రయంతో పాటు దానికి సంబంధించిన ఆస్తులనూ సేల్‌కి పెడుతున్నారు. అమ్మడమే అన్యాయమంటే.. అడ్డగోలుగా అతితక్కువ ధరకు తమ అస్మదీయులకు కట్టబెట్టాలని చూడటం మరింత దుర్మార్గం అంటున్నారు. ఇలా ఏపీలోని కేంద్ర సంస్థలన్నిటినీ ఒక్కోటిగా వదిలించుకోవాలని కేంద్రం చూడటం.. అందుకు ఏపీ సర్కారు ఇతోదికంగా సహకరిస్తోందనే ఆరోపణలతో రచ్చ రాజుకుంటోంది.
ఇప్పటికే ఏపీ రాజధాని అమరావతికి తీవ్ర అన్యాయం చేసింది కేంద్రం. జగన్ సర్కారుతో కుమ్మక్కై కేపిటల్‌తో డబుల్ గేమ్ అడుతోందనే విమర్శ ఉంది. తాజాగా, విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని కేంద్రం అమ్మకానికి పెట్టింది. రూ.3వేల కోట్ల పెట్టుబడులు, రూ.6వేల కోట్ల స్థిర, చరాస్తులతో ఉన్న ఈ ఎయిర్‌పోర్టును కారుచౌకగా కేవలం రూ.600 కోట్లకు అప్పగించేందుకు కేంద్రం నిర్ణయించింది. 2024 నాటికి ప్రైవేటీకరణ బాట పట్టించే ప్రైవేటుకు విమానాశ్రయాల్లో రెండోదిగా విజయవాడ ఎయిర్‌పోర్ట్ పేరును జాబితాలో చేర్చారు. దేశీయంగానూ, అంతర్జాతీయంగానూ ఎంతో వృద్ధిని సాధించటానికి అవకాశం ఉన్న విజయవాడ ఎయిర్‌పోర్టును కార్పొరేట్ సంస్థల కోసం కారుచౌకగా తెగనమ్మే ప్రతిపాదన తీసుకురావటం విమర్శలకు దారి తీస్తోంది. కాగా, కేంద్ర ప్రకటనపై ఎయిర్‌పోర్ట్ ఉద్యోగులు భగ్గుమంటున్నారు. కేంద్ర నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకోవాలని, తమ పోరాటానికి మద్దతుగా నిలవాలని కోరుతున్నారు. న్యాయపోరాటం చేస్తామని హెచ్చరిస్తున్నారు.
చంద్రబాబు హయాంలో నవ్యాంధ్ర రాజధానిగా అమరావతిని ప్రకటించడంతో ఒక్కసారిగా విజయవాడ ఎయిర్‌పోర్టుకు డిమాండ్ పెరిగింది. టీడీపీ ప్రభుత్వం 700 ఎకరాల భూములను సేకరించి ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ)కు అప్పగించింది. రెండుసార్లు రన్‌వేను అభివృద్ధి చేశారు. రాష్ట్రంలోనే అతిపెద్ద రన్‌వే కలిగిన ఎయిర్‌పోర్టుగా విజయవాడ నిలిచింది. డబుల్ లేన్ రోడ్ల విస్తరణ, ల్యాండ్ స్కేపింగ్, బ్యూటిఫికేషన్, టాక్సీవే, ఆఫ్రాన్, పార్కింగ్ బేలు, నైట్ ల్యాండింగ్ సాంకేతికత, ఇలా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు జరిగాయి. దేశంలోని మెట్రోపాలిటన్ ఎయిర్‌పోర్టులకు ధీటుగా విజయవాడ విమానాశ్రయం వృద్ధిని నమోదు చేసింది. గడిచిన పదేళ్లలో సుమారు రూ.3వేల కోట్ల మేర విజయవాడ ఎయిర్‌పోర్టులో కేంద్రం పెట్టుబడులు పెట్టింది. ప్రస్తుతం రూ.600 కోట్లతో డొమెస్టిక్ అండ్ ఇంటర్నేషనల్ బిల్డింగ్ పనులు ప్రారంభమయ్యాయి. ఈ అత్యాధునిక భారీ టెర్మినల్ బిల్డింగ్ 2023 నాటికి అందుబాటులోకి వస్తుంది. అయితే, ఈ పెట్టుబడులన్నీ ప్రయాణికుల కోసం కాదని, కార్పొరేట్ సంస్థలకు కల్పించే ప్రయోజనాలేనని ఇప్పుడు తెలుస్తోంది. విజయవాడ ఎయిర్‌పోర్ట్ ప్రైవేటీకరణ ప్రకటనపై విమానాశ్రయ ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. మరి, విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని అడ్డుకోలేకపోయిన జగన్‌రెడ్డి సర్కారు, కనీసం విజయవాడ విమానాశ్రయం ప్రైవేటీకరణను అయినా అడ్డుకోగలదా?