232 మందిని బలితీసుకున్న ప్రత్యక్ష దైవం
posted on Jun 14, 2014 8:13AM
యావత్ ప్రపంచానికి సూర్య భగవానుడు ప్రత్యక్ష దైవం. ఈ భూగోళం మీద జీవకోటి మనగలుగుతూ వుందంటే దానికి కారణం సూర్యభగవానుడే. అయితే సృష్టికి కారణమైన ఆయన లయానికి కూడా కారణం అవుతున్నాడు. తాను సృష్టించిన జీవుల్ని ఆయనే మాడ్చేస్తున్నాడు. ప్రచండుడి ఎండ ధాటికి ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 222 మంది మరణించగా, తెలంగాణలో పదిమంది కన్నుమూశారు. రోజురోజుకూ పెరుగుతున్న వడగాడ్పుల తీవ్రత తట్టుకోలేక వృద్ధులు, బాలలు పిట్టల్లా రాలిపోతున్నారు. ఎండని తట్టుకోలేక శుక్రవారం ఒక్కరోజే 160 మంది మృత్యువాత పడ్డారు. గురువారం 62 మంది కన్నుమూశారు. దీంతో రెండు రోజుల్లో 222 మంది ఎండలకు బలైనట్లయింది. శుక్రవారం పలుజిల్లాల్లో శుక్రవారం ఉష్ణోగ్రతలు 41 నుంచి 43 డిగ్రీల మధ్య నమోదయ్యాయి. తూర్పుగోదావరి జిల్లా తునిలో రికార్డుస్థాయిలో 45 డిగ్రీలకు చేరుకుంది. రుతుపవనాల రాక కొంత ఆలస్యం కావడంతో ఎండవేడిమి తట్టుకోలేని స్థాయికి చేరిపోయింది. అలాగే తెలంగాణలోని వివిధ జిల్లాల్లో శుక్రవారం వడదెబ్బకు 10 మంది మృతి చెందారు.