రాజ్యసభ ఉపఎన్నిక షెడ్యుల్ ఖరారు
posted on Jun 14, 2014 8:00AM
కాంగ్రెస్ పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యుడు నేదురుమల్లి జనార్ధన రెడ్డి కొద్ది రోజుల క్రితం అనారోగ్యంతో మరణించడంతో, ఆయన స్థానాన్ని మళ్ళీ భర్తీ చేసేందుకు ఎన్నికల కమీషన్ రాజ్యసభ ఉప ఎన్నిక షెడ్యుల్ నిన్న ప్రకటించింది. రాష్ట్ర ప్రధాన ఎన్నికల కమీషనర్ భన్వర్ లాల్ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర విభజన లో భాగంగా ఆంధ్రప్రదేశ్ కు కేటాయింపబడిన ఈ స్థానానికి, ఉప ఎన్నికల నోటిఫికేషన్ జూన్ 16న వెలువడుతుందని తెలిపారు. నామినేషన్లు వేయడానికి గడువు జూన్ 23, వాటి పరిశీలన 24, నామినేషన్ల ఉపసంహరణ జూన్ 26న ముగుస్తుందని తెలిపారు. జూలై 3న ఓట్ల కౌంటింగ్ జరిపి అదేరోజున ఫలితాలు వెల్లడిస్తామని చెప్పారు. అయితే ఈసారి కాంగ్రెస్ పార్టీ నుండి ఒక్క శాసనసభ్యుడు గెలవనందున ఆ పార్టీకి ఈ ఉపఎన్నికలలో పాల్గొనే అవకాశం లేదు. ఇక తెలుగుదేశం, వైకాపాలకు తగినంత మంది శాసనసభ్యులు ఉన్నందున రెండు పార్టీలు ఈ సీటుకోసం పోటీపడవచ్చును. కానీ, వైకాపా కంటే తెదేపాకే ఎక్కువమంది శాసనసభ్యులు ఉన్నందున తెదేపా అభ్యర్ధి గెలుపు ఖాయం. అందువలన ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో ఈ సీటుకోసం అనేకమంది పోటీ పడటం కూడా ఖాయం. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికలలో ఓడిపోయిన అనేకమంది తెదేపా నేతలు ఈ సీటుకోసం పోటీ పడవచ్చును.