ఇంట్లో షుగర్ టెస్ట్ చేసుకునేవారు చేసే బిగ్ మిస్టేక్స్ ఇవే..!


డయాబెటిస్ రోగులు క్రమం తప్పకుండా రక్తంలో చక్కెరను తనిఖీ చేసుకోవడం చాలా ముఖ్యం. దీని సహాయంతో మందులను సక్రమంగా తీసుకుంటూ ఉండటమే కాకుండా ,  ఆహారాన్ని బ్యాలెన్స్ చేసుకోవడానికి,    తీవ్రమైన సమస్యలను నివారించడానికి సహాయపడుతుంది. ఈ రోజుల్లో చాలా మంది ఇంట్లో గ్లూకోమీటర్‌తో చక్కెర స్థాయిని తనిఖీ చేసుకుంటూ ఉంటారు.  ఇది ఆరోగ్యానికి మంచిదే.  కానీ చాలాసార్లు ఈ పరీక్ష తప్పుగా జరుగుతోందని డయాబెటిస్ నిపుణులు అంటున్నారు.  దీని కారణంగా రీడింగ్ కూడా తప్పుగా వస్తుంది. ఇంట్లో రక్తంలో చక్కెరను తనిఖీ చేసేటప్పుడు  చాలామంది చేస్తున్న తప్పులేంటి? వాటిని ఎలా నివారించాలి?తెలుసుకుంటే..

చేతులు కడుక్కోకపోవడం..

చాలా మంది చేతులు కడుక్కోకుండానే పరీక్షలు చేసుకుంటారు. చెమట, నూనె లేదా చేతులపై చిన్న ఆహారం ముక్క కూడా తప్పుడు రీడింగ్ ఇస్తుంది. అందువల్ల, రక్తంలో చక్కెరను తనిఖీ చేసే ముందు ఎల్లప్పుడూ  చేతులను సబ్బుతో కడుక్కోవాలి.  చేతులు పూర్తీగా ఆరిన తరువాత పరీక్ష చేసుకోవాలి.  

వేలు గుచ్చడానికి ప్రతిసారీ ఒకే వేలును ఉపయోగించడం..

ప్రతిసారీ ఒకే ప్రదేశం నుండి రక్తాన్ని తీయడం వల్ల అక్కడి చర్మం కఠినంగా మారుతుంది. దీని వల్ల  రక్తాన్ని తీయడం కష్టమవుతుంది. వేళ్లను మారుస్తూ ఉండాలి.  ఒకే వేలును పదే పదే ఉపయోగించకూడదు.

పాత స్ట్రిప్స్ వాడకం..

టెస్ట్ స్ట్రిప్స్ కు గడువు తేదీ ఉంటుంది. చాలా సార్లు  పాత లేదా తేమతో కూడిన స్ట్రిప్స్ వాడతారు. ఇది తప్పు రీడింగ్ లను ఇస్తుంది. స్ట్రిప్స్ ను ఎల్లప్పుడూ పొడి,  చల్లని ప్రదేశంలో ఉంచాలి.  అలాగే  గడువు తేదీని తనిఖీ చేసుకుంటూ ఉండాలి.

రక్త నమూనా తీసుకోవడానికి ఎక్కువ ఒత్తిడి తీసుకురావడం..

కొన్నిసార్లు రక్తం బయటకు రానప్పుడు,  వేలిని చాలా గట్టిగా నొక్కుతారు, ఇది కణజాల ద్రవాన్ని రక్తంతో కలిపి రీడింగ్‌ను ప్రభావితం చేస్తుంది. మృదువుగా  గుచ్చాలి.  అవసరమైతే చేతిని కొద్దిగా రబ్ చేయాలి,  లేదా క్రిందికి వంచాలి.

తప్పు సమయంలో తనిఖీ చేయడం..

ఖాళీ కడుపుతో, భోజనం చేసిన 2 గంటల తర్వాత లేదా నిద్రపోయే ముందు రక్తంలో చక్కెరను తనిఖీ చేయడానికి సరైన సమయం. తప్పు సమయంలో తనిఖీ చేయడం వల్ల నివేదిక గందరగోళంగా మారే అవకాశం ఉంటుంది. ఇది తీసుకునే ఆహారం గురించి, వాడాల్సి మందుల గురించి కూడా గందరగోళం క్రియేట్ చేస్తుంది.

                                *రూపశ్రీ.

గమనిక:
ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు..

Teluguone gnews banner