కేటీఆర్ ఈవెన్ ఆంధ్రప్రదేశ్ వ్యాఖ్యలతో బీఆర్ఎస్ కు కొత్త కష్టాలు?
posted on Mar 10, 2025 @ 12:27PM
తెలంగాణ అసెంబ్లీకి 2023లో జరిగిన ఎన్నికలలో బీఆర్ఎస్ పరాజయం పాలు కావడానికి ప్రధాన కారణాలలో కచ్చితంగా ఆ పార్టీ అగ్రనాయకత్వం అహంకారం, నోటి దురుసు ఒకటి. అయితే పరాజయం తరువాత కూడా ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారకరామారావులో ఇసుమంతైనా మార్పు రాలేదు. ఎదుటి వారినీ, పొరుగు రాష్ట్రాలనూ చులకనగా మాట్లాడే తీరు మారలేదు. గతంలో ఇలాంటి వ్యాఖ్యల కారణంగానే గత ఎన్నికలలో బీఆర్ఎస్ భారీ మూల్యం చెల్లించుకుంది. ప్రతిపక్షంగా తీరు మార్చుకుని, ఓటమికి కారణాలపై సమీక్ష జరుపుకుని మళ్లీ ప్రజాభిమానాన్ని ప్రొది చేసుకునే దిశగా అడుగులు వేయాల్సిన బీఆర్ఎస్.. అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నది. ముఖ్యంగా ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్.. సోషల్ మీడియా వేదికగా అధికార కాంగ్రెస్ పైనే కాకుండా, పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ పై కూడా ఇష్టారీతిగా చేస్తున్న వ్యాఖ్యలు ఆ పార్టీకి తీరని నష్టం చేస్తున్నాయి. అయినా ఆయన తన తీరు మార్చుకోవడం లేదు. తాజాగా...
తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తన తాజా పోస్ట్ తో ఇబ్బందులు కొని తెచ్చుకున్నారు. ప్రీమియర్ ఎనర్జీస్ తన కార్యకలాపాలను ఆంధ్రప్రదేశ్ కు తరలించాలనే నిర్ణయంపై అధికార కాంగ్రెస్ పార్టీని లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించేందుకు ట్వీట్టర్ వేదికగా కేటీఆర్ చేసిన ప్రయత్నం బూమరాంగ్ అయ్యింది. సదరు పోస్టులో ఆయన వాడిన ఆఖరికి ఆంధ్రప్రదేశ్ కూడా (ఈవెన్ ఆంధ్రప్రదేశ్) అన్న పదంపై కేటీఆర్ పై నెటిజనులు దుమ్మెత్తి పోస్తున్నారు.
విషయమేంటంటే రంగారెడ్డి జిల్లాలోని సీతారాంపూర్ ఇండస్ట్రియల్ పార్క్ లో ప్రీమియర్ ఎనర్జీస్ ఏర్పాటు చేయాలనుకున్న రూ. 1,700 కోట్ల విలువైన 4 గిగావాట్ల సోలార్ ఫోటోవోల్టాయిక్ సెల్ తయారీ ప్లాంట్ ఆంధ్రప్రదేశ్ దక్కించుకుందనే వార్తల క్లిప్పింగ్ ను శనివారం కేటీఆర్ తన ఎక్స్ ఖాతాలోకి షేర్ చేస్తూ.. తెలంగాణ ఒకప్పుడు పెట్టుబడులకు అయస్కాంతంలా ఉండేది, బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రఖ్యాత కంపెనీలను ఆకర్షించింది. ఇప్పుడు కాంగ్రెస్ పాలనలో పెట్టుబడిదారులు తెలంగాణ కంటే గుజరాత్, తమిళనాడు, చివరికి ఆంధ్రప్రదేశ్ ను కూడా ఎంచుకుంటున్నారు అంటూ వ్యాఖ్యానించారు. ఎందుకంటే రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ సర్కార్ కమిషన్ సర్కార్ లేదా ఆర్ఆర్ టాక్స్ సర్కార్ గా మారిపోయింది అంటూ ఆ పోస్టులో పేర్కొన్నారు.
ఆ పోస్టుకు కాంగ్రెస్ ఫెయిల్డ్ తెలంగాణ అన్న హ్యాష్ టాగ్ ను జోడించారు. ఈ పోస్టు వెంటనే వైరల్ అయ్యింది. అదే సమయంలో ఏపీ నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. కేటీఆర్ వాడిన ఈవెన్ ఆంధ్రప్రదేశ్ అన్న మాటను నెటిజనులు తప్పుపట్టారు. గత అసెంబ్లీ ఎన్నికలలో ఘోర పరాజయం తరువాత కూడా కేటీఆర్ లో అహంకారం, ఏపీ పట్ల వివక్ష ఇసుమంతైనా తగ్గలేదంటూ విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు సీఎం చంద్రబాబు పాలనలో ఉంది.. వైఎస్ జగన్ పాలనలో కాదు అంటే ఓ నెటిజన్ కేటీఆర్ కు ఘాటు రిప్లై ఇచ్చారు.
గతంలో జగన్ సర్కార్ చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేసిన సమయంలో కేటీఆర్ చేసిన అహంకారపూరితమైన వ్యాఖ్యలను ఉటంకిస్తూ.. దాని పర్యవశానమే.. ఇప్పుడు బీఆర్ఎస్ ప్రతిపక్షంలో కూర్చుందని ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా తీరు మార్చుకోకుంటే.. బీఆర్ఎస్ ఎప్పటికీ తెలంగాణలో అధికారంలోకి వచ్చే అవకాశం ఉండదని దుయ్యబట్టారు. అదలా ఉంచితే కేటీఆర్ తాజాగా చేసిన వ్యాఖ్యలు.. త్వరలో జరగనున్న జీహెచ్ఎంసీ ఎన్నికలలో బీఆర్ఎస్ పై ప్రతికూల ప్రభావం చూపడం ఖాయమని అంటున్నారు. హైదరాబాద్ లో పెద్ద సంఖ్యలో నివసించే సెటిలర్లు బీఆర్ఎస్ కు దూరం కావడం ఖాయమని అంటున్నారు.