సుబ్బిరామిరెడ్డి బిజినెస్ లాజిక్
posted on Oct 30, 2012 @ 1:28PM
నెల్లూరులో సీటు కచ్చితంగా పోతుందని కాంగ్రెస్ పార్టీకి తెలుసు. తెలిసితెలిసీ అధిష్ఠానం పరువును నిలబెట్టడానికే అన్నట్టుగా తిక్కవరపు సుబ్బిరామిరెడ్డి బరిలోకి దిగారు. అనధికారికి లెక్కలప్రకారం ఆయనకు ఎలక్షన్ పుణ్యమా అని రమారమీ.. ఓ వందకోట్లకి బొక్కపడ్డట్టు సమాచారం. దానివల్ల ఒరిగిందికూడా ఏమీ లేదు.
కనీసం తన త్యాగాన్ని దృష్టిలో ఉంచుకుని అధిష్ఠానం కేంద్రమంత్రిపదవినో లేక టిటిడి చైర్మన్ గిరీనో లేక కనీసం తన భార్యకైనా టిటిడి కుర్చీనో ఇస్తారని ఆశించిన సుబ్బిరామిరెడ్డికి ఆశలు అడియాసలే అయ్యాయి. డబ్బూపోయే శనీ పట్టె అన్న సామెత ఆయన విషయంలో రుజువయ్యిందని రాజకీయవర్గాలు బాహాటంగానే అనుకుంటున్నాయ్.
సుబ్బిరామి రెడ్డి మాత్రం పెదవి కదపడం లేదు. ఎందుకంటే రాజకీయపరమైన లబ్ధిని చేకూర్చలేకపోయిన అధిష్ఠానం వ్యాపారపరంగా మంచి లాభసాటి బేరాల్ని అప్పజెప్పాలన్న నిర్ణయానికి వచ్చిందని విశ్వసనీయ వర్గాల భోగట్టా. అందుకే తిక్కవరపు తన అసంతృప్తిని ఎక్కడా వెళ్లగక్కలేదనేది రాజకీయ పండితుల మాటల సారాంశం.