రాయలసీమకి తీరని నష్టం
posted on Oct 30, 2012 @ 12:55PM
కేంద్రమంత్రివర్గంలో రాష్ట్రానికి పది అంకెలు దక్కాయి. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న శుభపరిణామమే ఇది. అందరికీ సంతోషంగానే ఉంది. ఒక్క రాయలసీమ వాసులకు తప్ప. ఎందుకంటే ఉత్తరాంధ్ర, కోస్తా, రాయలసీమ, తెలంగాణ జిల్లాలనుంచి ప్రాతినిధ్యాన్ని లెక్కలోకి తీసుకుంటే అటు కోస్తాకీ, ఇటు తెలంగాణకీ గట్టి న్యాయమే జరిగినట్టు లెక్క. రాయలసీమకి మాత్రం నామమాత్రపు ప్రాధాన్యం ఇచ్చినట్టుగా స్పష్టంగా కనిపిస్తోంది.
కోస్తా ప్రాంతంనుంచి పురంధేశ్వరి, కిషోర్ చంద్రదేవ్, కిల్లి కృపారాణి అవకాశం దక్కించుకున్నారు. ఉత్తరాంధ్రలో చిరంజీవికి, పనబాకలక్ష్మికి, పళ్లంరాజుకీ బెర్తులు దక్కాయి. తెలంగాణ ప్రాంతంనుంచి జైపాల్ రెడ్డి, సర్వేసత్యనారాయణ, బలరాం నాయక్.. కాంగ్రెస్ కంచుకోటలో పాగావేశారు. రాయలసీమనుంచి మాత్రం ఒక్క కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డికి మాత్రమే ఛాన్స్ దక్కింది. అదికూడా యాంటీ జగన్ వర్గం కాబట్టి.
భవిష్యత్తులో జగన్ కి చెక్ పెట్టాల్సొస్తే ముందునుంచీ వై.ఎస్ వర్గానికి వ్యతిరేకంగా ఉన్న కోట్ల వర్గమే కరెక్టని అధిష్ఠానం లెక్కలేసుకునిమరీ కోట్లకి సీటిచ్చారుతప్ప ప్రాంతాలవారీ న్యాయప్రాతిపదిక కన్నుపొడుచుకున్నా కనిపించని పరిస్థితి. అయినా దీనిగురించి మాట్లాడడానికి ఎవరూ సాహసించడంలేదు.. ఎందుకంటే వీర విధేయులకు మాత్రమే మంత్రివర్గ విస్తరణలో చోటు కల్పించిన అధిష్ఠానం.. కామ్ గా ఉండే వాళ్లకే ప్రాథాన్యమిస్తామన్న విషయాన్ని చెప్పకనే చెప్పింది కనక పల్లెత్తు మాట అనడానిక్కూడా ఎవరూ సాహసించరన్న విషయం అందరికీ తెలిసిందే..