హరీశ్‌రావు ఆగమాగం.. కేసీఆర్ స్కెచ్‌కు అల్లుడు బలి?
posted on Nov 2, 2021 @ 5:34PM
హుజురాబాద్ ఎపిసోడ్ మొత్తంలో బకరా ఎవరంటే అది హరీశ్‌రావునే అంటున్నారు. ఉప ఎన్నికల బరిలో బలయ్యేది.. బలి అయిందీ.. ఆయనేనని చెబుతున్నారు. గెలిస్తే ఆ క్రెడిట్ అంతా కేసీఆర్‌కు వెళ్లేలా.. ఓడితే అల్లుడిని బలిపశువు చేసేలా.. గులాబీ బాస్ వేసిన స్కెచ్‌కు హరీశ్‌రావు కొనఊపిరితో గిలగిల కొట్టుకుంటున్నారు. ప్రచార సమయంలోనే హరీశ్‌రావు కళ్లల్లో..మాటల్లో ఆ భయం కొట్టొచ్చినట్టు కనిపించింది. ఇప్పుడు ఫలితాల తర్వాత తన రాజకీయ భవిష్యత్తుపై ఆందోళన మొదలైంది అంటున్నారు. గతంలో మామ కుర్చీకే ఎర్త్ పెడదామని అల్లుడు కుట్ర చేస్తే.. ఇప్పుడు అల్లుడిని ఎందుకూ పనికిరానివాడిలా మార్చేసి మరీ పార్టీ నుంచి వెళ్లగొట్టేందుకు కేసీఆర్ రంగం సిద్ధం చేశారని చర్చ నడుస్తోంది. హుజురాబాద్ టార్గెట్‌తో హరీశ్‌రావుకు ఇచ్చిన చివరాఖరి లైఫ్ లైన్ సైతం ఆయన్ను కాపాడలేకపోయింది.
ఈటల-హరీశ్.. రెండు దశాబ్దాలుగా కేసీఆర్ వెంటే ఉన్నారు. కుడి-ఎడమ భుజాల్లా మెదిలారు. వారిద్దరూ మంచి స్నేహితులుగా నడిచారు. కట్‌చేస్తే.. కేసీఆర్ ఆడిన రాజకీయ జూదంలో ఈటల-హరీశ్‌లు పాము-ముంగీసలా ప్రాణంపెట్టి పోట్లాడుకున్నారు. తనకు కంట్లో నలుసుగా మారిన ఈటలను ఓడించేందుకు.. రాజేందర్‌కు ప్రాణ స్నేహితుడైన హరీశ్‌నే అస్త్రంగా ప్రయోగించి తన రాజకీయ చాణక్యాన్ని ప్రదర్శించారు కేసీఆర్. టూ బర్డ్స్ ఎట్ వన్ షాట్..స్ట్రాటజీ ఇది అంటున్నారు. ఈటల ఓడితే ఓ శత్రువు కనుమరుగు. ఈటల గెలిస్తే.. మరో అడ్డు తొలగింపు. ఇలా హుజురాబాద్‌లో ఎవరు గెలిచినా.. తన రాజకీయ ప్రయోజనం నెరవేరేలా కేసీఆర్ ఖతర్నాక్ స్క్రిప్ట్ రచించారు. ఆ స్క్రీన్‌ప్లేలో చిక్కుకొని హరీశ్‌రావు ఆగమాగమయ్యారు.
రెండు నెలలుగా హరీశ్‌రావు బాహ్య ప్రపంచం చూడలేదు. హుజురాబాదే ఆయన లోకంగా మారింది. పగలు, రాత్రి తేడా లేకుండా పని చేశారు. తన స్నేహితుడైన ఈటల రాజేందర్‌ను ఓడించేందుకు శాయశక్తులా కృషి చేశారు. ఈటల అనుచరులను చీల్చారు. వర్గాల వారీగా, కులాల వారీగా.. వ్యూహాలు పన్నారు. డబ్బు, అధికారం వెదజల్లి.. టీఆర్ఎస్ గెలుపునకు బాగా ట్రై చేశారు. కానీ, ఓటర్లు ఇచ్చిన తీర్పు.. హరీశ్‌రావుకు పొలిటికల్ క్లైమాక్స్‌గా మారింది..అంటున్నారు.
హరీశ్‌రావు. ఒకప్పుడు పార్టీలో ట్రబుల్ షూటర్. కేసీఆర్ తర్వాత నెంబర్ 2. కానీ, కేటీఆర్ ఎంట్రీతో హరీశ్‌రావు ఇమేజ్ దారుణంగా పతనమైంది. ఆయన పరపతి సిద్ధిపేటకే పరిమితమైంది. కేటీఆర్‌ను వర్కింగ్ ప్రెసిడెంట్ చేసి.. హరీశ్‌రావును వట్టి ఎమ్మెల్యేగా కొన్నాళ్లు పనిష్ చేశారు. పార్టీ శ్రేణులెవరూ హరీశ్ వెంట లేకుండా కట్టడి చేశారు. ఆ తర్వాత ఈటల బెదిరింపులతో హరీశ్‌రావుకు మంత్రి పదవి ఇవ్వాల్సి వచ్చింది. పదవి పడేసినా.. ఆయన ఇమేజ్ పెరగకుండా.. దుబ్బాకతో అగ్నిపరీక్ష పెట్టారు. ఆ పరీక్షలో ఓడిపోయి.. రాజకీయంగా దహించిపోయారు. అలా, ట్రబుల్ షూటర్ అనే ముద్రను చెరిపేశారు కేసీఆర్.
ఇక ఈటల రాజేందర్‌పై భూకబ్జా కేసులు పెట్టి పార్టీ నుంచి సక్సెస్‌ఫుల్‌గా పంపించేసిన గులాబీ బాస్.. నెక్ట్స్ టార్గెట్ హరీశ్‌రావునే. అందుకే, దుబ్బాక తరహాలోనే హుజురాబాద్ గెలుపు బాధ్యతలనూ అల్లుడి భుజాలపైనే మోపగా.. ఆ బరువుకు ఓటమితో కుప్పకూలిపోయారు హరీశ్‌రావు. ఇప్పుడిక కేసీఆర్.. హరీశ్‌ను వామనపాదంతో తొక్కేసేందుకు సిద్ధమయ్యారని తెలుస్తోంది. గజ్వేల్ ఎలక్షన్‌లో తనను ఓడించేందుకు ప్రయత్నించి.. పార్టీని చీల్చే కుట్ర చేసిన.. అల్లుడు హరీశ్‌రావును హుజురాబాద్ ఓటమి తర్వాత ఇటు ప్రభుత్వం నుంచి అటు పార్టీ నుంచి సాగనంపనున్నారని అంటున్నారు. కొడుకు కేటీఆర్ కోసం.. కూతురు కవితనే పక్కనపెట్టేసిన కేసీఆర్‌కు.. వరుసకు అల్లుడైన హరీశ్‌రావును అటకెక్కించేయడం ఓ లెక్కా? అంటున్నారు. మరి, ఈటలను భూకబ్జా ఆరోపణలతో వెళ్లగొడితే.. మరి, హరీశ్‌రావును తరిమేసేందుకు ఏ వివాదం ఎంచుకుంటారో చూడాలి...