కాంగ్రెస్‌లో సిఎం కిరణ్ కరివేపాకూ ఒక్కటేనా?
posted on Oct 29, 2012 @ 3:24PM
రాష్ట్రముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీలో కరివేపాకులా మారారు. ఆయన ఏ నిర్ణయం తీసుకోవాలన్నా కేంద్రస్థాయిలో ఆమోదం తీసుకోవాలి. కాంగ్రెస్ అధిష్టానం, కేంద్రం తీసుకునే నిర్ణయాలు శిరసావహించాలి. అంతేకానీ, ఎదురుతిరిగితే పదవి పోయినట్లే! అలా అని కేంద్రం నిర్ణయాలు తెలుసుకోవాలని ప్రయత్నిస్తే అధిష్టానం ఆగ్రహిస్తుంది. దీంతో కుడితిలో పడ్డ....చందాన్న సిఎం కిరణ్ మౌనంగా కేంద్రాన్ని ఫాలో అవుతున్నారు. అంతేకాకుండా కేంద్ర స్థాయిలో జరిగే మార్పు కాంగ్రెసు కార్యకర్తతో సమానంగా తెలుసుకునే స్థితిలో సిఎం ఉన్నారు. దీంతో వంటల్లో కరివేపాకును వాడినట్లే సిఎంను కాంగ్రెసు చూస్తోందన్న విషయం తేలిపోయింది. తాజాగా కేంద్ర మంత్రుల నియామకం విషయంలోనూ సిఎంకు ఎటువంటి సమాచారం లేదు. పైగా, ఆయన తన ప్రతిపాదనలైన నామినేటెడ్ పోస్టుల భర్తీ, రాష్ట్ర మంత్రి వర్గ విస్తరణ తరువాతే కేంద్ర మంత్రుల నియామకం జరుగుతుందని బలంగా నమ్మారు. అయితే అధిష్టానం మాత్రం ముందుగా నిర్ణయం తీసుకుని నేరుగా అభ్యర్థులతో మాట్లాడి మంత్రి పదవులను కట్టబెట్టింది. నేరుగా క్యాబినెట్ కార్యదర్శి ఫోన్లు చేయటం, రాహుల్‌గాంధీ ప్రత్యేకశ్రద్ధ తీసుకోవటం వంటి అంశాలు తెరపైకి వచ్చాయి. మంత్రుల ప్రమాణస్వీకార సమయంలోనూ సిఎం వెటకారంగా మాట్లాడి వారి దృష్టిలో ఏమీ తెలియని వ్యక్తిగా మిగిలిపోయారు. పరోక్షంగా కాంగ్రెస్ అధిష్టానం తాము చేయాలనుకుంటే రాష్ట్ర ముఖ్యమంత్రులనైనా కిరణ్‌కు ఎటువంటి సమాచారం ఇవ్వకుండానే మార్చేయగలమని కేంద్రమంత్రుల నియామకం ద్వారా హెచ్చరించింది. ఇప్పటి దాకా తన పోస్టు భద్రం అనుకుంటున్న సిఎం సర్దుకోవాల్సిన సమయం వచ్చిందని సన్నిహితులతో అంటున్నారట.