Read more!

గంగలో ఉమ్మితే మూడు రోజుల జైలు!

 

 

 

కేంద్ర ప్రభుత్వం కొత్తరకం చట్టాన్ని అమలు చేయడానికి ప్రయత్నాలు చేస్తోందని వార్తలు వస్తున్నాయి. కేంద్ర మంత్రి ఉమాభారతి ఈ చట్టానికి రూపకర్త అని చెబుతున్నారు. ఇంతకీ ఆ చట్టం ఏంటంటే, భవిష్యత్తులో ఎవరైనా గంగానదిలో ఉమ్మినా, చెత్త వేసినా వారికి మూడు రోజుల జైలు శిక్ష పడుతుంది.

 

ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రమాణ స్వీకారం చేయగానే గంగానదిని ప్రక్షాళన చేస్తానని ప్రకటించారు. ఆయన ఆల్రెడీ వారణాశికి ఎంపీ కావడంతో ఈ విషయం మీద చాలా సీరియస్‌గా వున్నారు. గంగా ప్రక్షాళనకు సంబంధించిన యాక్షన్ ప్లాన్‌ని కూడా ఆయన సిద్ధం చేశారు. గంగానదిని శుభ్రం చేయడం, ముందుముందు కలుషితం కాకుండా చూడటం అంతవరకూ ఓకే. దానిని ఎవరూ కాదనరు. ఇంకా ఇంత మంచి పని చేస్తున్నందుకు హర్షిస్తారు. అయితే కేంద్ర మంత్రి ఉమాభారతి ఈ విషయంలో ఎక్కువగా స్పందిస్తున్నట్టు అనిపిస్తోంది. ఎవరైనా గంగానదిలో చెత్త వేసినా, కనీసం ఉమ్ము ఊసినా వారికి మూడు రోజులు జైలు శిక్ష వేయాలన్న ప్రతిపాదనని ఆమె నరేంద్రమోడీ ముందు వుంచినట్టు తెలుస్తోంది.



ఈ ప్రతిపాదనకు అందరి నుంచీ తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోంది. ఉమాభారతి చేసిన ప్రతిపాదనను మోడీ ఆమోదించరాదని, ఇలాంటి చట్టం తేవడం వల్ల దుర్వినియోగమయ్యే అవకాశం వుందని పలువురు అంటున్నారు. పొరపాటుగా ఈ చట్టం కనుక అమల్లోకి వస్తే భవిష్యత్తులో ఎవరైనా గంగాస్నానం చేస్తూ గంగా నది జలాన్ని నోట్లో పోసుకుని తుపుక్కున ఊయడానికి కూడా భయపడాల్సి వస్తుంది.  గంగానదిలో స్నానం చేస్తే పాపం పోవడానికి బదులు విచిత్రమైన అవమానాలు ఎదుర్కునే పరిస్థితి వస్తుంది.