విశాఖలో నేడు మంత్రివర్గ సమావేశం
posted on Jun 12, 2014 8:18AM
ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మొట్ట మొదటి మంత్రివర్గ సమావేశం విశాఖనగరంలో గల ఆంద్ర విశ్వవిద్యాలయంలో జరగబోతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరి కొద్ది సేపటిలో వైజాగ్ విమానాశ్రయానికి చేరుకొని అక్కడి నుండి నేరుగా సింహాచలం వెళ్లి దైవ దర్శనం చేసుకొంటారు. ఆ తరువాత అక్కడి నుండి ప్రభుత్వ అతిధి గృహం చేరుకొని కాసేపు విశ్రాంతి తీసుకొని ఆంద్ర విశ్వవిద్యాలయంలోగల టీ.యల్.యన్. రెడ్డి సమావేశ మందిరం చేరుకొని మంత్రివర్గం సమావేశం మొదలుపెడతారు. ఉదయం 10 నుండి మధ్యాహ్నం 2గంటల వరకు సమావేశం జరుగుతుంది. ఈరోజు సమావేశంలో ప్రధానంగా వ్యవసాయ రుణాల మాఫీకి కమిటీ ఏర్పాటు, ఉద్యోగుల పదవీ విరమణ వయసును పెంచుతూ చంద్రబాబు చేసిన ప్రతిపాదనకు ఆమోదం తెలపడం, ప్రభుత్వపాలనా విధానం, ఆర్ధిక లోటుని భర్తీ చేసుకొనే మార్గాలు, కొత్త రాజధాని నిర్మాణం, కేంద్రం నుండి నిధులు రాబట్టేందుకు మంత్రులతో కూడిన ప్రత్యేక కమిటీని నియామకం వంటివి చర్చకు రావచ్చును. మంత్రివర్గ సమావేశం తరువాత ముఖ్యమంత్రి చంద్రబాబు మళ్ళీ ప్రభుత్వ అతిధి గృహానికి చేరుకొని అక్కడ ప్రభుత్వ ఉన్నతాధికారులతో సమావేశమవుతారు. అనంతరం రాత్రి తిరిగి హైదరాబాదు చేరుకొంటారు.