డోప్ టెస్టులో దొరికిన పాకిస్తాన్ స్పిన్నర్
posted on Oct 3, 2012 @ 11:51AM
పాకిస్తాన్ కు చెందిన స్పిన్నర్ అబ్దుర్ రెహ్మాన్ ఇంగ్లండ్‌లో నిర్వహించిన డోప్ టెస్టులో దొరికిపోయాడు. దీంతో అతనికి రెండేళ్లు నిషేధం పడే అవకాశం ఉంది. సోమర్ సెట్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న ముప్పయి రెండేళ్ల పాకిస్తాన్ లెఫ్టామ్ స్పిన్నర్ డోప్ టెస్టులో పట్టుబడినట్లు పాకిస్థాన్‌కు చెందిన ఓ స్థానిక పత్రిక పేర్కొంది. ఇంగ్లండ్, వేల్స్ క్రికెట్ బోర్డు ఈ విషయాన్ని పాకిస్థాన్ క్రికెట్ బోర్డుకి తెలియజేసింది. అంతర్జాతీయ క్రికెట్‌లో ఇప్పటి వరకూ డోప్ టెస్టులో పట్టుబడీన వారిలో పాక్ నుంచి ముగ్గురు ఆటగాళ్ళు ఉన్నారు. గతంలో పేస్ బౌలర్లు మహ్మద్ ఆసిఫ్, షోయబ్ అక్తర్‌లు డోపీలుగా తేలారు. ప్రస్తుతం జరుగుతున్న టి-20 ప్రపంచకప్ జట్టులో రెహ్మాన్ సెలెక్ట్ కాలేదు. ఇప్పటి వరకు అబ్దుర్ రెహ్మాన్ 17 టెస్టుల్లో 81, 21 వన్డేల్లో 25 వికెట్లు పడగొట్టాడు. ఇదంతా ఎలా జరిగిందో తనకు తెలియదని, తను ఎలాంటి అనారోగ్యానికి సంబంధించిన మందులు కూడా వాడలేదని అంటున్నాడు.