స్పీడ్ న్యూస్ 1
posted on Jul 19, 2023 @ 12:15PM
1.ఢిల్లీ వాసులను పాములు బెంబేలెత్తిస్తున్నాయి. ఇటీవలి భారీ వర్షాలు, వరదలలో పాములు కొట్టుకు వస్తుండటం ఢిల్లీ వాసులను ఆందోళనకు గురి చేస్తున్నది. రాపిడ్ రెస్పాన్స్ టీమ్ ఓల్డ్ రైల్వే బ్రిడ్జి సమీపంలోనే ఏకంగా పాతిక పాములను పట్టుకున్నారంటే తీవ్రత అర్ధమౌతోంది.
...............................................................................................................................................
2. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పాలనలో గతంలో ఎన్నడూ లేని విధంగా నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయని, టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే వస్తువుల ధరలతో పాటు అడ్డగోలు పన్నులను తగ్గిస్తామని లోకేష్ అన్నారు. .కొండపి నియోజకవర్గంలో జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతూ జగన్ హయాంలో వ్యవసాయం సంక్షోభంలో పడిందన్నారు.
..................................................................................................................................
3. వచ్చే ఎన్నికలలో విజయం సాధించి మళ్లీ ఎన్డీయేనే అధికారంలోకి వస్తుందని ప్రధాని మోడీ అన్నారు. ఢిల్లీలో నిన్న జరిగిన ఎన్డీయే సమావేశంలో మాట్లాడిన ఆయన తాము విపక్షంలో ఉన్నప్పుడూ సానుకూల రాజకీయాలు చేశామే తప్ప విదేశాల నుంచి సహకారం తీసుకోలేదని చెప్పారు.
........................................................................................................................................
4.ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపైఅట్రాసిటీ కేసు నమోదుకు చిత్తూరు కోర్టు ఆదేశించింది. మంత్రి ఎస్సీలను అవమానించేలా మాట్లాడారంటూ చిత్తూరు జిల్లా కోర్టులో మాజీ జడ్డి రామకృష్ణ దాఖలు చేసిన ప్రైవేటు కేసుపై చిత్తూరు కేసు బీ కొత్త కోట పోలీసులకు ఈ మేరకు ఆదేశాలిచ్చింది. కేసుకు సంబంధించి విచారణ నివేదిక అందించాలని ఆదేశించింది.
..................................................................................................................................
5.కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ ప్రయాణిస్తున్న విమానం మంగళవారం సాయంత్రం అత్యవసరంగా భోపాల్ లో ల్యాండ్ అయింది. ప్రతిపక్షాల సమావేశానికి హాజరయ్యేందుకు వారు బెంగళూరు వచ్చి తిరిగి వెళుతుండగా ఈ ఘటన జరిగింది. విమానంలో సాంకేతిక లోపం కారణంగానే విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేయాల్సి వచ్చింది.
..................................................................................................................................
6. కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి శశిథరూర్ ప్రధాని మోడీని ప్రశంసలతో ముంచెత్తారు. ఓ మీడియా సంస్థ నిర్వహించిన సదస్సులో మాట్లాడిన ఆయన ఇస్లామిక్ ప్రపంచానికి, ముఖ్యంగా అరబ్ దేశాలకు ప్రధాని నరేంద్ర మోదీ చేరువకావడం ఆదర్శప్రాయమన్నారు. మోడీ విదేశాంగ విధానం బాగుందన్నారు.
..................................................................................................................................
7. రేవంత్ రెడ్డిని తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షపదవి నుంచి తప్పించాలంటూ బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ కుమార్ కాంగ్రెస్ అధిష్ఠానానికి బహిరంగ లేఖ రాశారు. రేవంత్ రైతులకు మూడు గంటల విద్యుత్ చాలని అవమానించారనీ, అలాగే ప్రజలను కులాల పేరుతో కించపరుస్తున్నారనీ ఆ లేఖలో ఆరోపించారు.
..................................................................................................................................
8. ప్రముఖ రచయత శ్రీరమణ కన్ను మూశారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన నిన్న సాయంత్రం హైదరాబాద్ లో తుది శ్వాస విడిచారు. మిథునం,మరియు ఎన్నో కథలు,నవలల రచయిత శ్రీ శ్రీ రమణ నిన్న సాయంత్రం హైదరాబాద్ లో కన్నుమూశారు. ఆయన రాసిన మిథునం కథ అదే పేరుతో సినీమాగా వచ్చింది.
...................................................................................................................................
9. హైదరాబాద్ నగరాన్ని ముసురు కమ్మేసింది. రుతుపవనాలకు తోడు ఉపరితల ద్రోణి ప్రభావంతో ఇవాళ కూడా జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. నిన్న ఉదయం నుంచీ కురిసిన వర్షానికి పలు తోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ద్రోణి ప్రభావంతో తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి.
..................................................................................................................................
10.తిరుమలలో శ్రీవారి భక్తుల రద్దీ కొనసాగుతోంది. మంగళవారం అంటూ జూలై 18న శ్రీవారిని 64వేల మంది దర్శించుకున్నారు. 24 వేల 659 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. హుండీ ఆదాయం మూడు కోట్ల 6 లక్షలు వచ్చింది.
..................................................................................................................................
11. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏకమైన ప్రతిపక్ష కూటమితోపాటు అధికార ఎన్డీయేకు సమాన దూరం పాటించాలని టీడీపీ నిర్ణయించింది. బీఎస్పీ, బీజేడీ, జేడీఎస్, బీఆర్ఎస్, వంటి పార్టీలు కూడా ఈ రెండు కూటములకు దూరంగా ఉండాలని నిర్ణయించాయి.
..................................................................................................................................
12. టీటీడీ) చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి స్థానంలో ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తిని నియమించాలని వైసీపీ నిర్ణయించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వైవీ సుబ్బారెడ్డి పదవీ కాలం త్వరలో ముగియనుంది. టీటీడీ బోర్డు నియమాకంపై సమీక్ష అనంతరం జగన్ జంగా నియామకాన్ని ప్రకటించే అవకాశం ఉంది.
..................................................................................................................................
13. పరువునష్టం కేసులో సినీ నటులు జీవిత, రాజశేఖర్ దంపతులకు నాంపల్లి కోర్టు ఏడాది జైలు శిక్ష, రూ. 5 వేల జరిమానా విధించింది. చిరంజీవి బ్లడ్‌బ్యాంక్ ద్వారా సేకరించిన రక్తాన్ని అమ్ముకుంటున్నారని జీవిత, రాజశేఖర్ ఆరోపించారు. దీనిపై నిర్మాత అల్లు అరవింద్ కోర్టును ఆశ్రయించారు.
14. తెలంగాణ వ్యాప్తంగా ఐదురోజుల పాటు అతి నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి జిల్లాల కలెక్టర్లు, ముఖ్య అధికారులతో మాట్లాడారు. సీనియర్ అధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.
..................................................................................................................................
15. ఏపీలో పొత్తులపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ క్లారిటీ ఇచ్చారు. ఢిల్లీలో జరిగిన ఎన్డీఏ పక్షాల భేటీ తర్వాత ఆయన విలేకరులతో మాట్లాడిన ఆయన రాబోయే ఎన్నికల్లో ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ కలిసే పోటీచేస్తాయన్నారు.
..................................................................................................................................
16. ప్రయాణికులకు బీమా సదుపాయాన్ని కల్పించాలని రైల్వే శాఖ నిర్ణయించింది. ఇందు కోసం రైల్వే టికెట్ బుకింగ్‌లో మార్పులు తీసుకొచ్చింది. ఐఆర్‌సీటీసీ తాజా నిర్ణయంతో టికెట్ బుక్ చేసుకొనే సమయంలో ట్రావెల్ ఇన్సూరెన్స్ కోసం బీమా ఆప్షన్ ను ఎంపిక చేసుకోవాల్సిన అవసరం ఉండదు.
..................................................................................................................................
17. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితులైన కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఈ నెల 21న బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్న కిషన్‌రెడ్డి నేడు స్వదేశానికి చేరుకోనున్నారు.
..................................................................................................................................
18. ఏపీలో ఇంజినీరింగ్ ప్రవేశాల కోసం ఈ నెల 24 నుంచి కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈనెల 24 నుంచి ఆగస్టు మూడో తేదీ వరకు రిజిస్ట్రేషన్లు, 25 నుంచి ఆగస్టు 4 వరకు ధ్రువపత్రాల పరిశీలన నిర్వహించనున్నట్లు కన్వీనర్ నాగరాణి తెలిపారు.
19. రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ పరిమితి రూ.2 లక్షల నుంచి 5 లక్షల రూపాయలకు పెంచిన నేపథ్యంలో లబ్ధిదారులకు కొత్త డిజిటల్ కార్డులను అందించాలని నిర్ణయించినట్లు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు. ఈ కార్డులను స్థానిక ప్రజాప్రతినిధుల ద్వారా లబ్ధిదారులకు అందించనున్నారు.
......................................................................................................................................................
20. ఏపీలో వచ్చే నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ వాతావరణ శాఖ పేర్కొంది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వానలు పడతాయని పేర్కొంది.