కల్వకుంట్ల వారసుడికి కొత్త తలనొప్పులు!
posted on Jul 19, 2023 @ 11:21AM
తెలంగాణ ముఖ్యమంత్రి, కారు పార్టీ అధినేత కేసీఆర్ వంశాంకురం, మున్సిపల్, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్ కుమారుడు హిమాన్ష్ రావుకి కొత్త తలనొప్పులు మొదలైయ్యాయి. అది కూడా హైదరాబాద్ మహనగరం నడిబొడ్డు నారాయణగూడ నుంచే కావడంతో.. ఈ అంశం అటు మీడియాలో ఇటు సోషల్ మీడియాలో ఓ రేంజ్‌లో వైరల్ అవుతోంది.
గచ్చిబౌలి కేశవనగర్‌లోని ప్రభుత్వ పాఠశాలను హిమాన్ష్ దత్తత తీసుకొని.. కోటి రూపాయిల నిధులు సేకరించి.. సదరు పాఠశాలను అభివృద్ధి చేయడంతో.. అదే తరహాలో తమ పాఠశాలను కూడా దత్తత తీసుకోవాలంటూ.. నారాయణ గూడలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ప్లకార్డులు ప్రదర్శిస్తూ.. ఆందోళనకు దిగారు. అంతేకాదు.. తమ పాఠశాలను సైతం దత్తత తీసుకోవాలంటూ వారు విజ్జప్తి చేశారు.
అక్కడితో ఆగకుండా.. ప్రభుత్వ పాఠశాలలపైన హిమాన్ష్ అన్నయ్యకు ఉన్న శ్రద్ధ విద్యాశాఖ మంత్రికి లేదంటూ సబితా ఇంద్రరెడ్డికి విద్యార్థులు చురకలంటించేశారు. ఏఐవైఎప్, బాల సంఘం ఆధ్వర్యంలో విద్యార్థులు ప్లకార్డలతో హిమాన్షు అన్నయ్య.. తమ పాఠశాలను బాగు చేయాలంటూ బిగ్గరగా నినాదాలు చేశారు. తమ బాత్‌రూమ్ డోర్లు విరిగిపోయాయని.. పాఠశాలకు ప్లే గ్రౌండ్ కూడా లేదని.. కంప్యూటర్లు సైతం లేవని విద్యార్థలు.. తమ సమస్యలను ఈ ఆందోళనలో ఏకరువు పెట్టారు. ఈ నేపథ్యంలో తమ పాఠశాలను కూడా దత్తత తీసుకొని తాము చదువుకునేందుకు సహకరించాలంటూ హిమాన్ష్‌కు విద్యార్థులంతా ముక్కుమ్మడిగా విజ్జప్తి చేశారు.
మరోవైపు రాష్ట్రంలో 24 వేల పాఠశాలలు ఉన్నాయని.. వాటి పరిస్థితి దాదాపుగా ఇలాగే ఉన్నాయని విద్యార్ధి సంఘాల నేతలు ఆరోపించారు. మన బస్తీ.. మన బడి పేరుతో ఈ ప్రభుత్వం కార్యక్రమం చేపట్టిన.. నిధులు మాత్రం పలువురికి పలహారంగా మారాయని వారు విమర్శించారు.
మరోవైపు సీఎం కేసీఆర్ మనవడు హిమాన్ష్ రావు.. ప్రభుత్వ పాఠశాలను దత్తత తీసుకొని.. దానిని అభివృద్ది చేయడం.. ఆ క్రమంలో నూతనంగా తయారైన పాఠశాల ప్రారంభ కార్యక్రమంలో.. హిమాన్ష్ మాటలకు ప్రపంచంలోని తెలుగు వారంతా ఫిదా అయిపోయారన్న సంగతి అందరికీ తెలిసిందే.
అయితే హిమాన్ష్ చేసిన ఈ చిరు ప్రయత్నంపై విమర్శలు సైతం గుప్పించి వారు తెలంగాణ సమాజంలో లేకపోలేదు. తెలంగాణ వచ్చి 9 ఏళ్లు అయిందని.. నిన్న కాక మొన్న రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలు సైతం అంగరంగ వైభవంగా నిర్వహించారని.. అలాంటి హిమాన్ష్ తాతగారి ఏలుబడిలో.. తండ్రి ప్లస్ మంత్రి కేటీఆర్ గారి హయంలో ప్రభుత్వ పాఠశాలల దుస్థితి ఇలా ఉందంటూ సోషల్ మీడియాలో సైతం నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు.
ఇక హైటెక్ సిటీకి కూత వేటు దూరంలో.. అదీ గచ్చిబౌలిలోని ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి ఇలా ఉంటే.. రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతంలో.. మారుమూల ప్రాంతంలోని ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి ఎలా ఉంటుందని నెటిజన్లు ఓ విధమైన సందేహాన్ని వ్యక్తం చేస్తున్నారు. అదీకాక హిమాన్ష్ అభివద్ధి చేసిన పాఠశాల పరిస్థితి పూర్వం ఎలా ఉందో.. సాక్షాత్తూ తెలంగాణ విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమక్షంలోనే అతడు చెప్పిన మాటల ద్వారా తేటతెల్లమవుతోందని.. ఇదేనా బంగారు తెలంగాణ అంటూ.. నెటిజన్లు సోషల్ మీడియా సాక్షిగా ప్రశ్నిస్తున్నారు.
ఓ ప్రభుత్వ పాఠశాలను ఓ ఎన్నారై లేదా ఓ ఎన్జీవో సంస్థ ఇంతలా అభివృద్ధి చేస్తే.. దానికి ఇంత హైప్ ఇస్తారా? ఇవ్వరని.. ప్రభుత్వాధినేత మనవడు కనుక హిమాన్ష్‌కు అటు మీడియాలో ఇటు సోషల్ మీడియాలో ఇంతగా ప్రచారం చేస్తున్నారనే ఓ టాక్ సైతం వైరల్ అవుతోంది.
ఏదీ ఏమైనా శ్రీమంతుడు సినిమాలో మహేష్ బాబులాగా ఊరు మొత్తన్ని కాకపోయినా.. ఓ పాఠశాలను హిమాన్ష్ దత్తత తీసుకోవడం.. వల్ల ఓ మంచి పని జరిగినా.. ఆతడి తాతగారి పాలనలో గత తొమ్మిదేళ్లుగా బంగారు తెలంగాణ అంటూ తెగ గప్పాలు కొట్టుకొన్నా.... తెలంగాణ రాష్ట్ర పరిస్థితి మాత్రం పైన పటారం..లోన లోటారం అన్న చందంగా ఉందని.. అదీకూడా కేసీఆర్ ఫ్యామిలీ ద్వారానే అది బహిర్గతమైందనే ఓ అబిప్రాయం సైతం తెలంగాణ సమాజంలో ఊపందుకోవడం గమనార్హం.