కిరణ్ టార్గెట్ స్పీకరా లేక టీ-బిల్లు అడ్డుకోవటమా
posted on Nov 21, 2013 @ 10:47AM
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి స్పీకర్ నాదెండ్ల మనోహర్ కి వ్రాసినట్లు చెప్పబడుతున్న లేఖ గురించి వారిరువురూ ఇంతవరకు స్వయంగా స్పందించకపోయినా దానిపై పెద్ద రాజకీయ దుమారమే చెలరేగుతోంది. ముఖ్యమంత్రి తనను తాను గొప్ప సమైక్యవాదిగా నిరూపించుకొనే ఏ అవకాశం వదలకపోవడం మెచ్చుకోదగ్గదే కావచ్చు. కానీ అందుకు ఇతరులను బలిచేయాలనుకోవడమే చాలా తప్పు అని కొందరు కాంగ్రెస్ నేతలు అభిప్రాయపడుతున్నారు.
నిజానికి ప్రభుత్వం జూన్ నెలలో శాసనసభ సమావేశాలు ముగిసిన వారంలోగా సభను ప్రోరోగ్ చేయమని అభ్యర్దిస్తూ స్పీకర్ కి లేఖవ్రాయవలసి ఉంటుంది. కానీ అలా చేయకుండా, ఇప్పుడు స్పీకర్ సంప్రదాయం ప్రకారం సభను వచ్చేనెలలో సమావేశపరిచేందుకు సిద్దపడుతున్నఈ తరుణంలో ముఖ్యమంత్రి సభను ప్రోరోగ్ (నిరవధిక వాయిదా) వేయమని కోరుతూ లేఖ వ్రాయడం తెలంగాణా బిల్లుపై చర్చను జాప్యం చేసేందుకే అయినప్పటికీ, అందుకు స్పీకర్ నాదెండ్ల మనోహర్ ను బలిపశువుని చేయడంపై కాంగ్రెస్ నేతలే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
స్పీకర్ ముఖ్యమంత్రి మాటను మన్నిస్తూ సభను వాయిదా వేయకపోయినట్లయితే ఆయన కూడా తెలంగాణా బిల్లుపై చర్చకు సహకరిస్తున్నారనే తప్పుడు సంకేతాలు ప్రజలలోకి వెళ్తాయని వారు అంటున్నారు. గతంలో కూడా ముఖ్యమంత్రి, స్పీకర్ల మధ్య సభ నిర్వహణ తేదీల విషయంలో, కమిటీల విషయంలో విభేదాలు తలెత్తాయి. మళ్ళీ ఇప్పుడు ముఖ్యమంత్రి సమావేశాలను వాయిదా వేయమని అసందర్భ కోరిక కోరడం స్పీకర్ ని అప్రదిష్టపాలు జేయడానికేనని కాంగ్రెస్ నేతలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. తన కుర్చీపై కన్ను వేసిన బొత్సను, కన్నాలక్ష్మినారాయణను కూడా ముఖ్యమంత్రి వర్గం ఇదే విధంగా అభాసుపాలు చేసిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం.
అయితే ఈ వ్యవహారంలో స్పీకర్ కి మద్దతుగా మాట్లాడితే తమకీ కొత్త ఇబ్బందులు ఎదురవుతాయనే ఆలోచనతో సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు జాగ్రత్తగా స్పందిస్తున్నపటికీ, టీ-కాంగ్రెస్ నేతలు, తెరాస శాసనసభ్యులు ఆయనకి అండగా నిలబడేందుకు ముందుకు వస్తున్నారు. ముఖ్యమంత్రి దీనిని నుండి ఆశించినది ఒకటయితే ఫలితాలు మరొకలా వస్తున్నాయి.