కరోనా కాలపు దేవుడు.. సోనూసూద్ నెట్‌వర్క్ ఎలాంటిదో తెలుసా..?
posted on May 19, 2021 @ 6:33PM
వదల బొమ్మాళీ అన్నట్టు.. కొవిడ్ సేవలను వదలకుండా కొనసాగిస్తున్నారు సోనూ సూద్. రీల్ లైఫ్‌లో విలన్ అయినా.. రియల్ లైఫ్‌లో మాత్రం సూపర్ హీరో. క్రికెట్ అభిమానులకు సచిన్ దేవుడైతే.. కరోనా బాధితులకు, వలస కూలీలకు, ఆపదలో ఉన్న వారికి.. సోనూసూద్ సైతం దేవుడే. కరోనా కాలంలో.. ఆ కనిపించని దేవుడి అవతారమే.. ఈ కనిపించే సోనూసూద్ అంటున్నారు. వారిది అభిమానమో.. వెర్రితనమో కాదు.. సోనూసూద్ చేసిన, చేస్తున్న సేవలకు ప్రతిఫలం ఈ ఖ్యాతి.
సోనూసూద్. ఇప్పుడిది పేరు కాదు.. ఓ ధైర్యం. ఓ నమ్మకం. ఏ ఆపద వచ్చినా.. నేనున్నానంటూ.. సాయం చేస్తారనే ధైర్యం. ఏ కష్టం వచ్చినా.. తను ఆదుకుంటాడనే నమ్మకం. అందుకే ప్రస్తుత కొవిడ్ కాలంతో.. కష్టం వస్తే ప్రభుత్వాల వైపు చూడట లేదు.. పాలకులను వేడుకోవడం లేదు.. సోనూసూద్‌నే తలుచుకుంటున్నారు.. ఫోన్ చేసినా.. మెసేజ్ పెట్టినా.. సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టినా.. అంబులెన్స్ కంటే వేగంగా సోనూసూద్ నుంచి సాయం అందుతోంది. అది ఎంత పెద్ద కష్టమైనా కానీ.. ఆక్సిజన్ సిలిండర్, రెమ్‌డెసివర్ ఇంజెక్షన్.. హాస్పిటల్‌లో బెడ్.. సాయం ఏదైనా.. క్షణాల్లో స్పందించడం సోనూ స్పెషాలిటీ. ఏంతో పెద్ద నెట్‌వర్క్ ఉన్న ప్రభుత్వ వ్యవస్థల వల్ల కానిది కూడా.. సోనూసూద్ వల్ల అవుతుండటం మామూలు విషయమేమీ కాదు. అది ఆయనకే సాధ్యం.
మొదట్లో సోషల్‌మీడియా పోస్టులకే స్పందించిన సోనూసూద్.. ఇప్పుడు ప్రజాసేవను మరింత విస్తృతం చేశారు. ఏకంగా ఓ టోల్‌ఫ్రీ నెంబర్‌నే ప్రకటించారు. 24/7.. సదా మీ సేవలో ఉంటానంటున్నాడు. హెల్ప్‌లైన్ కోసం సొంతంగా ఓ డ్యాష్ బోర్డునే ఏర్పాటు చేసుకున్నారు. 400 మంది సిబ్బందిని నియమించి.. ఎనీ టైమ్ రెస్పాండ్ అయ్యేలా నెట్‌వర్క్ డెవలప్ చేశారు. అందుకే, క్రికెటర్లు సురేశ్ రైనా, హర్భజన్ సింగ్ లాంటి వాళ్లు సైతం సాయం కావాలంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే.. ఆ సాయం సోనూసూద్ నుంచే అందటం ఆశ్చర్యమేమీ కాదు. సోనూసూద్‌కు వస్తున్న రిక్వెస్టుల్లో.. 40శాతం ఆక్సిజన్ సిలిండర్ల కోసం ఉంటుండగా.. 30 శాతం వరకూ ఐసీయూ బెడ్స్ కోసం.. ఆ తర్వాత రెమ్‌డెసివిర్ ఇంజెక్షన్ల కోసం భారీగా విజ్ఞప్తులు వస్తున్నాయి.
చిన్న చిన్న సాయాల నుంచి.. ఆక్సిజన్ ప్లాంట్స్ నెలకొప్పడం లాంటి పెద్ద పెద్ద కార్యక్రమాల వరకూ సోనూసూద్ సేవలు విస్తరించాయి. 4 రాష్ట్రాల్లో.. 5 ఆక్సిజన్ ప్లాంట్స్ ఏర్పాటుకు సన్నాహాలు మొదలయ్యాయి. ఫ్రాన్స్, చైనా, తైవాన్ నుంచి ఆక్సిజన్ ప్లాంట్‌కు అవసరమైన సామాగ్రి తెప్పిస్తున్నారు. కలెక్టర్ విజ్ఞప్తి మేరకు నెల్లూరు జిల్లాలోనూ ఒక ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నారు సోనూసూద్.
కరోనా ఫస్ట్ వేవ్‌లోనే వెలుగులోకి వచ్చాడు ఈ రియల్ లైఫ్ హీరో. కేంద్రం సడెన్‌గా ప్రకటించిన లాక్‌డౌన్‌తో వలస కూలీలు సొంతూళ్లకు వెళ్లలేక నానాకష్టాలు పడ్డారు. వారి కష్టాన్ని చూడలేక.. సొంతంగా బస్సులు ఏర్పాటు చేసి.. దాదాపు ఏడున్నర లక్షల మంది పేద కూలీలను స్వగ్రామాలకు చేర్చిన ఘనత సోనూది. విదేశాల్లో చిక్కుకుపోయిన 1500 మంది స్టూడెంట్స్‌ను.. స్పెషల్‌గా చార్టెడ్ ఫ్లైట్స్‌లో స్వదేశానికి తీసుకొచ్చిన ఘనుడు. ఇలా, ప్రభుత్వాలు సైతం చేతగాక చేతులెత్తేసిన అనేక కష్టమైన పనులను సోనూసూద్ చాలా ఇష్టంగా చేసి చూపించాడు. అందుకే, ఆయన కరోనా కాలంలో వెలసిన దేవుడు. ఆయన కేవలం తెలుగు వారికి మాత్రమే కాదు.. యావత్ దేశానికి హీరో ఇప్పుడు.
తన సేవలను మరో మెట్టు తీసుకెళ్లడానికి.. మరింత మందికి సాయం చేయడానికి.. సూద్ ఛారిటీ ఫౌండేషన్ స్థాపించారు. ఈ ఫౌండేషన్‌కు అన్ని వర్గాల నుంచి విరాళాలు వెళ్లువెత్తుతున్నాయి. ఏపీకి చెందిన ఓ అంధురాలు సైతం తన నాలుగు నెలల పెన్షన్‌ను సూద్ ఫౌండేషన్‌కు డొనేట్ చేసిందంటే ప్రజల్లో సోనూపై ఉన్న నమ్మకం అలాంటిది మరి. గతంలో ఆయన నుంచి సాయం పొందిన వాళ్లే ఇప్పుడు తిరిగి సాయం చేస్తున్నారు. ప్రవాసీ రోజ్‌గార్ పేరుతో వలస కూలీలకు ఉపాధి కల్పించేందుకు వెబ్‌సైట్, మొబైల్ యాప్‌తో పాటు.. ఇలాజ్ ఇండియా పేరుతో అవసరమైన వారికి హెల్త్‌కేర్ సర్వీసులు అందజేస్తున్నారు.
కేవలం కరోనా విషయంలోనే కాదు.. ఎవరికి ఎలాంటి అవసరం వచ్చినా ఆదుకుంటున్నాడు. గతేడాది లక్షలాది మందికి విద్య, వైద్యం, ఇతర సహకారం అందించారు. ఏపీలో ఓ రైతు ఎడ్లు లేక.. కాడికి తన ఇద్దరు కూతుర్లను ఉంచి.. పొలాన్ని దున్నుతున్న వీడియో చూసి.. సోను చలించిపోయారు. ఎవరూ అడక్కపోయినా.. వాళ్లకు ట్రాక్టర్ కొనిచ్చి వారి జీవితాల్లో వెలుగులు నింపారు. ఇలా ఆయన చేసిన సేవలు ఎన్నో.. ఎన్నెన్నో.
ఇప్పటికీ ఆయన ఇంటికి నిత్యం వందలాది మంది సాయం కోసం వస్తున్నారు. సోషల్ మీడియా, టోల్‌ఫ్రీ నెంబర్లలో ప్రతీరోజు వేలాదిగా రిక్వెస్టులు. అన్నిటికీ కారణం.. సోనుసూద్‌తో చెప్పుకుంటే సాయం అందుతుందనే ధీమా. తమ కష్టం గురించి తెలిస్తే.. తప్పకుండా సాయం చేస్తారనే నమ్మకం. అందుకే, ఆయన.. కరోనా కాలంలో వెలిసిన దేవుడు. ప్రభుత్వాలు సైతం సిగ్గుపడేలా సేవ చేస్తున్న కలియుగ కర్ణుడు. ఆపదలో ఉన్నవారికి ఆపద్బాందవుడు. అందుకే ఇప్పుడు ఆయన సేవలు కీర్తిస్తూ ప్రత్యేక పాటలు.. వాట్సప్ స్టేటస్‌లు.. సోషల్ మీడియా పోస్టులు.. ఒక్కమాటలో చెప్పాలంటే.. ఇప్పుడు దేశంలో ప్రధాని మోదీ కంటే సోనూసూద్‌కే ఎక్కువ క్రేజ్.