కులపిచ్చి ఉంటే.. ఖాకీ డ్రెస్ తీసేయ్! ఎస్పీపై లోకేష్ ఫైర్
posted on May 19, 2021 @ 5:36PM
గుంటూరు అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డి వ్యవహారశైలిపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఎంపీ విజయసాయిరెడ్డిపై సోషల్ మీడియాలో అభ్యంతరకర వీడియోలు పోస్టు చేశారంటూ ఇద్దరు సీబీఎన్ ఆర్మీ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేయడంపై నారా లోకేశ్ స్పందించారు. గుంటూరు అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.‘‘ఎస్పీ అమ్మిరెడ్డి గారూ.. ప్రజల సొమ్ము జీతంగా తీసుకుని, తాడేపల్లి కొంపకి చాకిరీ చేయడానికి సిగ్గులేదా?. సోషల్ మీడియాలో వీడియో పెట్టిన వాళ్లని.. అంతర్జాతీయ ఉగ్రవాదుల్ని అరెస్ట్ చేసినట్టు ఏంటా ఓవరాక్షన్?. ఇవే వీడియోలు టీడీపీపై పెట్టిన వారిపై మేం పెట్టిన కేసుల్లో ఇప్పటి వరకూ ఎన్నింట్లో అరెస్ట్‌లు చేశారు?. మంత్రి సీదిరి అప్పలరాజుపై కేసు పెట్టడానికి వచ్చిన వారిపైనే రివర్స్ కేసు బనాయించారంటూ ట్వీట్టర్‌లో లోకేష్ ధ్వజమెత్తారు
"అమ్మిరెడ్డి గారూ, ప్రజల సొమ్ము జీతంగా తీసుకుంటూ తాడేపల్లి కొంపకు చాకిరీ చేయడానికి సిగ్గులేదా? జగన్ వద్ద పనిచేయాలని అంత ఉత్సాహం, కులపిచ్చి ఉంటే... పవిత్ర ఖాకీ డ్రెస్ తీసేసి బులుగు కండువా కప్పుకోండి" అని లోకేశ్ వ్యాఖ్యానించారు.
బుధవారం గుంటూరు అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డి పక్షపాతం ప్రదర్శించారు. ప్రెస్‌మీట్‌లో కొన్ని చానల్స్‌కే సమాధానం చెబుతానని మీడియా సమావేశంలో స్పష్టం చేశారు. కొన్ని చానల్స్ అడిగే ప్రశ్నలు తనకు వినబడవని, ఆ మీడియాలు తనకు కనబడవని చెప్పారు. మంత్రి అప్పలరాజుపై ఇచ్చిన ఫిర్యాదుపై మీడియా ప్రతినిధులు ఎస్పీని అడిగారు. ‘మీరు అడిగే ప్రశ్నలు నాకు వినబడవు, నాకు కనబడవు’ అని అమ్మిరెడ్డి సమాధానమిచ్చారు. సీబీఎన్ ఆర్మీ కో-ఆర్డినేటర్లపై ఓ చానల్ ప్రశ్నలకు ఉత్సాహంగా సమాధానాలిచ్చారు. అమ్మిరెడ్డి తీరుతో మీడియా ప్రతినిధులు అవాక్కయ్యారు.